రేటు రెట్టింపు!

ABN , First Publish Date - 2022-06-22T05:17:36+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతఏడాది ఉమ్మడి జిల్లాలో 1.06 లక్షల హెక్టార్లలో తెల్లబంగారం సాగయింది.

రేటు రెట్టింపు!
శుద్దిచేసిన పత్తివిత్తనాలు

ప్రభుత్వం నిర్ణయించిన పత్తి విత్తనాల ధర రూ.810

మార్కెట్‌లో ప్యాకెట్‌ రూ.1,600కు విక్రయం

ఆర్‌బీకెలలో ప్రారంభంకాని అమ్మకాలు

పూర్తికాని శాంపిల్స్‌ సేకరణ, బీజీ-3 పరీక్షలు


           (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతఏడాది ఉమ్మడి జిల్లాలో 1.06 లక్షల హెక్టార్లలో తెల్లబంగారం సాగయింది. ఈ ఏడాది పల్నాడు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 31 వేల హెక్టార్లలో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. ఈ సమయంలోనే పత్తి విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. దీనికి అనుగుణంగా సరఫరా లేదు. ఇదే అదనుగా బ్లాక్‌ మార్కెట్‌లో వీటి ధరలు విపరీతంగా పెంచేశారు. గత ఏడాది మార్కెట్‌లో కొన్ని రకాల విత్తనాలకు మంచి దిగుబడి రావడంతో ఈ ఏడాది వాటి కోసం రైతులు ఎగబడుతున్నారు. హైబ్రిడ్‌ పత్తి విత్తనాల ప్యాకెట్‌ను రూ.810కి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ బయట మార్కెట్‌లో రూ.1,400 నుంచి రూ.1,600 చొప్పున అమ్ముతున్నారు. 


విత్తనాల కోసం పొరుగు రాష్ర్టానికి..

మనరాష్ట్రంలో కో మార్కెటింగ్‌కు అనుమతులు లేవు. దీంతో ఏపీలోని విత్తన కంపెనీలు తెలంగాణాలో కోమార్కెటింగ్‌కు అనుమతిచ్చి ఆ పాకెట్లను ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రైతుభరోసా కేంద్రాలలో ఇంకా విత్తనాల అమ్మకాలు ప్రారంభం కాలేదు. తొలకరిలో మంచి వర్షం కురిసి భూమిపదునైతే వారంరోజుల్లో పత్తి సాగు పూర్తవుతుంది. ఆర్‌బీకేలలో అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు.  డిమాండ్‌ ఉన్న ఒకరకం విత్తనాలను ఆర్‌బీకేలలో అమ్ముతామని అధికారులు చెబుతున్నా ఇంతవరకు సరుకు రాలేదు. తెలంగాణాలోని నల్గొండ, మిర్యాలగూడెం, వరంగల్‌ ప్రాంతాలనుంచి విత్తనాలు తెచ్చుకొంటున్నట్లు పల్నాడు రైతులు తెలిపారు. 

 

పూర్తికాని శాంపిల్స్‌ సేకరణ, బిజి-3 పరీక్షలు..

వ్యవసాయశాఖ అధికారులు ఇంతవరకు పత్తివిత్తనాల శాంపిల్స్‌ సేకరణ పూర్తి చేయలేదు. శాంపిల్స్‌లో నాణ్యత నిర్ధారణ కాక ముందే వ్యాపారులు రైతులకు విత్తనాలను అమ్మారు. అధికారులు మార్కెట్‌లో బిజి-3 పరీక్షలు చేయలేదు. కానీ అనుమతి లేకుండానే వ్యాపారులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు.  

 

 31 వేల హెక్టార్లలో పత్తిసాగు..

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది పదిమండలాల్లో 31 వేల హెక్టార్లలో పత్తిసాగవుతుందని అంచనా వేశాం. దీనికి సంబందించి 1.89 లక్షల పాకెట్లు కావాలి.  మొత్తం 10,900 పాకెట్లు ఆర్‌బీకేలలో అందుబాటులో వుంచాం. విత్తనాలను ఎక్కువ ధరకు అమ్మితే రైతులు ఏవో సునీల్‌(నెంబర్‌: 8331056914)కు ఫిర్యాదు చేయాలి.. 

 - నున్నా వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ జేడీ, గుంటూరు  

 

ఎక్కువ ధరకు అమ్మితే జైలుకే...

విత్తనాలను ఎక్కువధరకు అమ్మితే వ్యాపారులు జైలుకు వెళతారు. పాకెట్‌ రూ.810కి అమ్మాలి. ఆర్‌బీకేలలో విత్తనాలను అమ్ముతున్నారు.  పల్నాడు జిల్లాలో విత్తనాలను ఎక్కువధరకు అమ్మితే రైతులు ఏడీ రవికుమార్‌(నెంబర్‌: 9182347807)కు ఫోన్‌ చేయాలి. 

 - మురళి, వ్యవసాయ శాఖ జేడీ, పల్నాడు  

 

 

Updated Date - 2022-06-22T05:17:36+05:30 IST