అమ్మో దగ్గు..!

ABN , First Publish Date - 2021-10-27T04:30:38+05:30 IST

ఖళ్‌.. ఖళ్‌...! రెండు వారాలుగా ఒకటే దగ్గు.. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు.. కాసేపు ఉపశమనం వచ్చినట్లే వచ్చి మళ్లీ వస్తోంది.. ఇదీ ప్రస్తుతం గిద్దలూరు ప్రాం తంలో అత్యధికులు అనుభవిస్తున్న సమస్య.

అమ్మో దగ్గు..!

అల్లాడిపోతున్న ప్రజలు 

ఆసుపత్రుల్లో ఎక్కువగా దగ్గు, గొంతునొప్పితోపాటు జ్వరపీడితులు

వారం గడుస్తున్నా తగ్గని వైనం 

కొందరిలో తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభణ

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 26 : ఖళ్‌.. ఖళ్‌...! రెండు వారాలుగా ఒకటే దగ్గు.. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు.. కాసేపు ఉపశమనం వచ్చినట్లే వచ్చి మళ్లీ వస్తోంది.. ఇదీ ప్రస్తుతం గిద్దలూరు ప్రాం తంలో అత్యధికులు అనుభవిస్తున్న సమస్య. దగ్గు, గొంతు నొప్పి సమస్యతోపాటు జ్వరం కూడా వస్తుండడంతో ఆసుపత్రులకు పరుగుతీస్తున్నారు. ఈ ప్రాంత ఆస్పత్రుల్లోని రోగుల్లో ఎక్కువ మంది ఈ తరహా బాధితులే.

కరోనా భయంతో పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్‌ అని వస్తుంది. వైద్యుల వద్దకు వెళితే టెస్టుల మీద టెస్టులు చేస్తూ అంతా మామూలే అని తేల్చుతున్నారు. మరోవైపు జ్వరంతో బాధపడే వారు కూడా రోజుల తరబడి అస్వస్థతతో గురవుతున్నారు. చాలామంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం వంటి శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులు యాంటీబయాటిక్స్‌కు త్వరగా లొంగడం లేదు. వారం, రెండు వారాలపాటు మందులు వాడాల్సి వస్తున్నది. సీజన్‌కు అనుగుణంగా వైరస్‌ మార్పులు చెందుతుండడం, ఎక్కువ సమయం ఇంట్లో గడపడం, రోగనిరోధక శక్తి స్థాయి తగ్గడం వలన చాలామంది వైరస్‌ బారిన పడుతున్నారని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ కాలుష్యం కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. గాలిలో తేమ, వాతావరణ కాలుష్యం వలన గొంతులో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుపుతున్నారు. 

ఇతర సమస్యలు కూడా

వైరల్‌ ఫీవర్‌తోపాటు ఇతర వైరస్‌, బాక్టీరియాల ద్వారా సంక్రమించే జబ్బుల నుంచి కోలుకునేందుకు ఎక్కువ రోజులు పడుతున్నది. గతంలో రెండు రోజులు చికిత్స తీసుకున్న సమస్యకు ఇప్పుడు ఐదారు రోజుల వరకూ చికిత్స పొందాల్సి వస్తున్నది. ప్రస్తుతం వైరల్‌ జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ప్రైవేటు ఆసుప్రతులలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. రోజూ వంద మందికి పైగానే దగ్గు, జ్వరం వంటి సమస్యలతో రోగులు వస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు. టైఫాయిడ్‌, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-27T04:30:38+05:30 IST