మాటలతో మమ..!

ABN , First Publish Date - 2021-04-18T05:22:22+05:30 IST

మాటలతో మమ..!

మాటలతో మమ..!
టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ ఉమ్మడి చంటి, వైసీపీ కార్పొరేటర్‌ పుణ్యశీల మధ్య వాగ్వాదం

మొక్కుబడిగా మొదటిరోజు కౌన్సిల్‌ సమావేశం 

టిడ్కో ఇళ్లపై పాలకపక్షం దాటవేత ధోరణి

పేదలకు కేటాయించాలంటూ టీడీపీ చర్చ

మంత్రి వెలంపల్లి, టీడీపీ, సీపీఎం సభ్యుల మధ్య వాగ్వాదం

సభ్యుల అంగీకారం లేకుండా తీర్మానాల ఆమోదం

మాటల యుద్ధాలు.. ఒకరిపై ఒకరి ఆరోపణలు.. పరిష్కారం కాని సమస్యలు.. చాన్నాళ్ల తరువాత శనివారం జరిగిన విజయవాడ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశ ముఖచిత్రమిది. అర్థంపర్థం లేని ప్రసంగాలు.. అనవసరపు రాద్ధాంతాలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని మమ.. అనిపించారు. టీడీపీ, సీపీఎం సభ్యుల అంగీకారం లేకుండా పాలకపక్షం పలు తీర్మానాలు ఆమోదించడంపై పెద్ద దుమారమే రేగింది. 

చిట్టినగర్‌, ఏప్రిల్‌ 17 : ప్రజా సమస్యల పరిష్కారాలకు వేదిక కావాల్సిన కౌన్సిల్‌ సమావేశం రాజకీయ వేదికగా  మారింది. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాల్లో కొత్త కౌన్సిల్‌ తొలి సమావేశం శనివారం జరిగింది. తొలుత కార్పొరేటర్లందరికీ రాపిడ్‌ కిట్‌లపై కరోనా టెస్టులు చేసి కౌన్సిల్‌ హాల్లోకి అనుమతించారు. సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ కార్పొరేటర్‌ బండి పుణ్యశీల ప్రమాణ స్వీకారం చేశారు.  అనంతరం ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదని టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సమాధానంగా వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే టిడ్కో ఇళ్ల కుంభకోణం జరిగిందని, అర్హులైనవారికి ఇళ్లు ఇవ్వకుండా ఆ పార్టీ అనుయాయులకు అమ్ముకున్నారని ఎదురుదాడికి దిగారు. దీంతో కొద్దిసేపు కౌన్సిల్‌ హాల్లో వాతావరణం వేడెక్కింది. మాటల యుద్ధం జరిగింది. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లపై జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ జరపాలని, ఈ మేరకు కౌన్సిల్‌ తీర్మానం చేయాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. కరోనా విజృంభిస్తున్నందున మొదటి కౌన్సిల్‌ సమావేశం కావడంతో ముందుగానే ఫ్లోర్‌లీడర్లతో మాట్లాడి, అధికారుల ప్రతిపాదనలను ఆమోదించి, మిగిలిన  వాటిని వాయిదా వేశారు. మరికొన్ని తీర్మానాలను విపక్షాల అంగీకారం లేకుండా ఆమోదించడంతో వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

ఆమోదించిన తీర్మానాలివీ..

కార్పొరేషన్‌ చట్టం సెక్షన్‌-88కే, 88జే కింద కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ప్రవేశపెట్టిన 21 అంశాల్లో తొమ్మిదింటికి ఆమోదం లభించింది. రెండు అంశాలను 2021-22 బడ్జెట్‌ నీటి సరఫరాకు చూపించిన నిధుల నుంచి ఖర్చు చేయటానికి అంగీకరించారు. మిగిలిన 10 అంశాలను వాయిదా వేశారు. అలాగే, కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ఆఫీసు రిమార్కులు  కోరుతూ వాయిదా వేశారు. 

సమస్యలను గాలికొదిలేశారు

ఈ వేసవిలో ప్రజలు తీవ్ర మంచినీటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. దానిపై ఎటువంటి చర్చ జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు టిడ్కో ఇళ్లు           లబ్ధిదారులకు కేటాయించకుండా రోజులు గడిపేస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతూ స్థలాల పేరిట జంతువులు ఉండే ప్రాంతాలను కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రచార ఆర్భాటాలు చేస్తుందే తప్ప ప్రజా సమస్యలపై ఆ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది.

- బాలస్వామి, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ 

అప్రజాస్వామిక వేదికగా మార్చారు

సమస్యలను పరిష్కరించాల్సిన కౌన్సిల్‌ను కేవలం తూతూమంత్రపు ప్రతిపాదనలతో ముగించారు. అప్రజాస్వామిక వేదిగా మార్చారు. కరోనా పేరిట 255 ప్రతిపాదనలను పక్కన పెట్టారు. నగర కౌన్సిల్‌ చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా నేను భావిస్తున్నాను.

- బోయి సత్యబాబు, సీపీఎం కార్పొరేటర్‌


Updated Date - 2021-04-18T05:22:22+05:30 IST