మూడు నెలల్లో.. 67 మంది మృత్యువాత!

ABN , First Publish Date - 2022-09-29T06:13:41+05:30 IST

పారిశుధ్యంపై అధికారుల అలసత్వం కారణంగా పట్టణంలో గడిచిన మూడు నెలల్లో అధికారికంగా 67 మంది డెంగీ, ఇతర అనారోగ్యాల బారిన పడి మృతిచెందారని టీడీపీ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు నెలల్లో.. 67 మంది మృత్యువాత!
కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ ప్లోర్‌ లీడర్‌ చిన్ని.. వైస్‌ చైర్మన్‌ మన్నే పద్మ మధ్య సాగుతున్న చర్చ

  • పట్టణంలో అపారిశుఽధ్యమే కారణం
    కౌన్సిల్‌లో ప్లోర్‌ లీడర్‌ చిన్ని
    రూ.7 కోట్లు ఏమయ్యాయని ప్రశ్న
    వాడీవేడిగా సాగిన సమావేశం

  • కొవ్వూరు, సెప్టెంబరు 28 : పారిశుధ్యంపై అధికారుల అలసత్వం కారణంగా పట్టణంలో గడిచిన మూడు నెలల్లో అధికారికంగా 67 మంది డెంగీ, ఇతర అనారోగ్యాల బారిన పడి మృతిచెందారని టీడీపీ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం బుధవారం అధికార, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల వాదోపవాదాల మధ్య వాడివేడిగా సాగింది. పట్టణంలోని సత్యవతినగర్‌ మునిసిపల్‌ కాంపెక్స్‌లో రూ. 5.35 లక్షలతో సబ్‌మెర్సిబుల్‌ మోటారు పంపులను ఏర్పాటుచేసే అంచనాలపై కౌన్సిల్‌లో రగడ జరిగింది. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ చిన్ని మాట్లాడుతూ చిన్న అంశాన్ని ఆమో దించడంలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.ప్రజాధనం దుర్వినియోగమయ్యే అంశా లు కౌన్సిల్‌కు చాలా వస్తున్నాయి వాటన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.మోటార్లు అంశాన్ని రద్దుచేస్తున్నామని చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి  ప్రకటించారు.రద్దును వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ, వైస్‌చైర్మన్‌ మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, రుత్తల భాస్కరరావు, సఖినేటిపల్లి చాందినీ నిలబడి అభ్యంతరాలు తెలిపారు. కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ మునిసిపల్‌ కాంప్లెక్స్‌, మునిసిపల్‌ కార్యాలయాలకు సంబంధించి ఎస్టిమేట్లను వేర్వేరుగా తయారుచేసి కౌన్సిల్‌కు తీసుకురావాలన్నారు. దీనిపై చైర్‌పర్సన్‌ మోటార్ల ఏర్పాటు అంశాన్ని రద్దు చేస్తున్నామని,తదుపరి కౌన్సిల్‌కు విడివిడిగా రెండు అంశాలను తీసుకురావాలన్నారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ   ఏప్రిల్‌ నెలలో మునిసిపాలిటీ ముగింపు నిల్వ రూ. 14 కోట్లు చూపించారని, ప్రస్తుతం రూ.7 కోట్లు చూపిస్తున్నారు. అప్పటి నుంచి ఒక్క రూపాయి అభివృద్ధి పని జరగలేదు. దేనికి ఖర్చుచేశారని ప్రశ్నించారు. గోదావరి ఏటిగట్టుపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్వయంగా కౌన్సిలర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ గామన్‌ వంతెన నుంచి గోదావరి మాత విగ్రహం వరకు ఒడ్డును నేషనల్‌ హైవేకు అప్ప గించడం జరిగిందని,రోడ్డుతో పాటు, డివైడర్‌, విద్యు ద్దీపాల నిర్వహణ వారికే అప్పగిస్తే మునిసిపాలిటీకి కొంతభారం తగ్గుతుందన్నారు. కమిషనర్‌ బి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతిపాదించి ఆగిపోయిన పనులను నిధుల లభ్యతను బట్టి పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామన్నారు. మునిసిపల్‌ నిధుల వివరాలు వచ్చే కౌన్సిల్‌లో అందజేస్తామన్నారు.


Updated Date - 2022-09-29T06:13:41+05:30 IST