Advertisement

అవి ఉన్నది మనలోనే!

Apr 23 2021 @ 00:00AM

మనం గుడులనూ, గోపురాలనూ, పుణ్యక్షేత్రాలనూ సందర్శిస్తాం. ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతాం. ప్రవచనాలను వింటాం. ఎవరైనా సాధు పురుషులు దగ్గరలో ఉన్నారని తెలిస్తే వెళ్ళి, వారిని దర్శించి, పాద నమస్కారాలు చేస్తాం. వీలైతే మన సందేహాలను వ్యక్తం చేసి, వారి సమాధానాలు పొందాలని అనుకుంటాం. వారు శాస్త్రాల నుంచి ఉదాహరణలు చూపిస్తూ, శ్లోకాలను చెప్పి, వాటి తాత్పర్యాన్ని వివరించి మనకు సమాధానం ఇస్తారు. మనం సంతోషించి ఇంటికి తిరిగి వస్తాం.  అయితే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో, బోధించే విధానంలో, సందేహాలను తీర్చడంలో జెన్‌ గురువుల ధోరణి చాలా వింతగా ఉంటుంది. 


ఒకసారి తమకు దగ్గరలోనే ఒక గొప్ప జెన్‌ గురువు ఉన్నాడని జపాన్‌ చక్రవర్తికి వార్తాహరుల ద్వారా తెలిసింది. ఆ గురువును ప్రజలందరూ పొగుడుతున్నారనీ, తండోపతండాలుగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారనీ, ఆయనతో సంభాషించిన తరువాత సంతోషంగా, సంతృప్తిగా తిరిగి వస్తున్నారనీ చక్రవర్తికి ఎందరో చెప్పారు. ఆ గురువును కలుసుకోవాలని చక్రవర్తి మనసు తొందర చేసింది. ఇక ఉండలేక, ఒక రోజు సంధ్యా సమయంలో, మందీ మార్బలంతో గురువు వద్దకు వెళ్ళాడు. ఎంతో కాలంగా నరకం గురించీ, స్వర్గం గురించీ చక్రవర్తికి సందేహాలు ఉన్నాయి. 


గురువును కలిసిన వెంటనే ‘‘నరకం అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఓయీ మూర్ఖుడా! నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇంతటి పనికిమాలిన ముఖాన్ని నేను ఇంతవరకూ చూడనే లేదు’’ అన్నాడా గురువు. 

అలాంటి మాటలు వింటే సామాన్యులకే ఎంతో కోపం వస్తుంది. అంతమంది ప్రజల మధ్య, తన పరివారం ఎదుట తన గురించి అలాంటి మాటలు విన్నప్పుడు చక్రవర్తికి కోపం రాకుండా ఉంటుందా? చక్రవర్తి ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ, తన ఒరలో కత్తిని తీసి ఆ గురువు తల నరకడానికి చెయ్యి పైకెత్తాడు. 


చక్రవర్తి కళ్ళలోకి గురువు సూటిగా చూస్తూ ‘‘ఆగు!’’ అని అరిచాడు. 

ఆయన మాటల్లో ఎలాంటి శక్తి ఉందో కానీ, చక్రవర్తి ఎత్తిన చెయ్యి స్తంభించిపోయింది.

‘‘అదిగో, అదే నరకం అంటే!’’ అన్నాడు గురువు.

కోపంతో ఊగిపోతూ, రక్తం మరిగిపోతున్నట్టున్న తన స్థితిని చక్రవర్తి గమనించుకున్నాడు. గురువు వైపు చూశాడు. గురువు ముఖంలో కదులుతున్న చిరునవ్వు చక్రవర్తిలో మార్పు తెచ్చింది. అతనిలో ఒక విధమైన ప్రశాంతత ఆవరించింది. తన చేతిలోని ఖడ్గాన్ని అవతల పారేసి, గురువు పాదాల మీద పడ్డాడు చక్రవర్తి. అతని భుజాలమీద తన చేతుల్ని ఉంచి, ‘‘స్వర్గం అంటే ఇదే! స్వర్గం, నరకం అనేవి ఎక్కడో లేవు. పక్క పక్కనే... మనలోనే ఉన్నాయి. మీరు ఒక్క క్షణంలోనే స్వర్గాన్నీ, నరకాన్నీ అనుభవించారు. మీ ప్రశ్నకు సమాధానం గ్రహించారు కదా!’’ అన్నాడు గురువు నవ్వుతూ.

- రాచమడుగు శ్రీనివాసులు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.