చేవెళ్లలోని బంకులో కల్తీ పెట్రోల్‌!

ABN , First Publish Date - 2021-10-18T04:48:31+05:30 IST

చేవెళ్లలోని బంకులో కల్తీ పెట్రోల్‌!

చేవెళ్లలోని బంకులో కల్తీ పెట్రోల్‌!
బంక్‌లో వచ్చిన కల్తీ పెట్రోల్‌ను చూపుతున్న వాహనదారులు

  • పోలీసులకు, విజిలెన్స్‌ అధికారులకు వాహనదారుడి ఫిర్యాదు

చేవెళ్ల: విజెలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో పెట్రోల్‌ బంకు యజమానులు పెట్రోల్‌ను కల్తీ చేసి అమ్ముతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన కానిస్టేబుల్‌ ఎంపీ నాయక్‌ తన స్నేహితుడు కృష్ణతో కలిసి ఆదివారం హైదరాబాద్‌ నుంచి చేవెళ్ల వీదుగా వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలానికి తమ కారులో బయల్దేరారు. మార్గమధ్యలో కారులో పెట్రోల్‌ పోయిం చుకుందామని చేవెళ్లలోని భారత్‌ పెట్రోల్‌ బంకుకు వెళ్లి రూ.1,200 పెట్రోల్‌ పోయించుకున్నారు. వారి కారు మూడు కిలో మీటర్ల దూరం వెళ్లగానే ఆగిపోయింది. ఎంతకూ స్టార్ట్‌ కా లేదు. వారు అనుమానంతో తిరిగి పెట్రోల్‌ బంక్‌కు వచ్చి రెండు బాటిళ్లలో పెట్రోల్‌ పోయించుకొని చూడగా పెట్రోల్‌లో నీరు కలిసినట్టు తేలింది. దీనిపై వారు పెట్రోల్‌ బంక్‌ యజమానులను నిలదీయగా వర్షం పడటంతో ఇలా జరిగి ఉంటుందని చెప్పారు. తమకు జరిగిన మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మెకానిక్‌ను పిలిపించి మరో కారుకు తాడు కట్టుకొని వారి కారును షెడ్డుకు తీసుకెళ్లి ఇంజిన్‌లో పేరుకున్న కల్తీ పెట్రోల్‌ను తొలగించారు. బాధితులు మాట్లాడుతూ.. కల్తీ పెట్రోల్‌ అమ్ముతున్న భారత్‌ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యంపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలా కల్తీ పెట్రోల్‌ పోసి సొమ్ము చేసుకుంటూ మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ పెట్రోల్‌ వల్ల వాహనాలు పాడవడంతో పాటు మెకానిక్‌ ఖర్చు అని, పని సైతం వాయిదాపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. విజిలెన్స్‌ తనిఖీలు లేకనే పెట్రోల్‌ కల్తీచేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-10-18T04:48:31+05:30 IST