కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-09-18T05:30:00+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, పక్కన బసంత్‌కుమార్‌, ఎస్పీ విజయరావు

ఉదయం 8నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

4979 మంది అధికారులు సిబ్బంది నియామకం

పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు


నెల్లూరు (జడ్పీ) సెప్టెంబరు 18 : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 8న పరిషత్‌ ఎన్నికలు జరగ్గా, ఆదివారం కౌంటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆదివారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. జిల్లాలో 10 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వాటిలో ఎంపీటీసీ కౌంటింగ్‌కు ప్రత్యేకంగా 42 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కౌంటింగ్‌ నిర్వహణకు  సంబంధించి 4979 మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వహించనున్నారని చెప్పారు. ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఓట్లను బట్టి రెండు నుంచి మూడు టేబుల్‌ళ్ల ఏర్పాటు చేసి ఐదుగురు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాలకు అనుమతి ఉన్న ఏజెంట్లు, అధికారులు, ఉద్యోగులు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు రెండు రోజులు వ్యాక్సిన్‌ వేసుకున్న సర్టిఫికెట్లు లేదా నెగిటివ్‌ రిపోర్టు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. డివిజన్‌ స్థాయిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను డీఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ఆర్‌డీవోలు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు కౌంటింగ్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా వీడియోలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయనున్నామని, ఫలితాల అనంతరం విజయోత్సవ రాల్యీలకు అనుమతి లేదన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేస్తామని చెప్పారు.


పటిష్టమైన బందోబస్తు : ఎస్పీ 

కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 1200 బంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వివరించారు.  ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారి ఉంటారన్నారు. అలాగే స్పెషల్‌ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో కౌంటింగ్‌ పరిశీలకులు బసంత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  


జడ్పీటీసీ స్థానాలు  : 46

ఏకగ్రీవాలు                 : 12

ఎన్నికలు జరిగినవి         : 34

అభ్యర్థులు                 : 140

ఎంపీటీసీ స్థానాలు  : 544

ఏకగ్రీవాలు                 : 188

ఎన్నికలు జరిగినవి         : 366

అభ్యర్థులు                     : 972

మొత్తం ఓటర్లు                : 13,38,408 మంది

పోలింగ్‌ అయినవి             : 7,16,344 మంది

ఓట్ల లెక్కింపు మొదలు       : ఉదయం 8 గంటలకు..

కౌంటింగ్‌ కేంద్రాలు            : 10

అధికారులు                     : 4,979 మంది

పోలీసులు                         : 1200 మంది




Updated Date - 2021-09-18T05:30:00+05:30 IST