పల్లెకట్టడి

ABN , First Publish Date - 2021-04-23T05:45:10+05:30 IST

జిల్లాలోని దాదాపు వందకుపైగా గ్రామాలు స్వీయనియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నాయి.

పల్లెకట్టడి

కరోనా కట్టడి కోసం రంగంలోకి వీడీసీలు 

100 గ్రామాల్లో అప్రకటిత బంద్‌

నిబంధనలు అతిక్రమించే వారికి భారీగా జరిమానాలు 

నిర్మల్‌, భైంసా పట్టణాల్లో మాత్రం కనీస జాగ్రత్తలు కరువు 

ఖానాపూర్‌ పట్టణంలోనూ కొనసాగుతున్న లాక్‌డౌన్‌

గ్రామాల్లో తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య 

నిర్మల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని దాదాపు వందకుపైగా గ్రామాలు స్వీయనియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నాయి. గతకొద్దిరోజుల నుంచి గ్రామీణ ప్రాంతా ల్లో సెకండ్‌వేవ్‌ కరోనా ఉధృతితీవ్రం కావడం అలాగే పాజిటివ్‌ కేసులసంఖ్య విఫరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు సామూహికంగా కట్టడిచర్యలకు ఉపక్రమించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లో సమాంతర వ్యవస్థను నడిపే వీడీసీలు ( విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ) ఈ స్వీయ నియంత్రణ చర్యలను పకడ్భందీగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాలోని దాదాపు వందకుపైగా గ్రామాల్లో ప్రస్తుతం సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు అమలవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కేవలం రెండు, మూడు గంటల పాటు మాత్రమే గ్రామాల్లోని దుకాణాలు, ఇతర వ్యాపారాలను ప్రజల సౌకర్యం కోసం నడిచేట్లు చేస్తున్నారు. గడువు ముగిసిన తరువాత బయట ఎవరూ సంచరించకుండా అలాగే దుకాణాలను ఎవరూ తెరవకుండా పకడ్భందీ ని బంధన విధించారు. వీడీసీలు విధించిన ఈ నిబంధనలను అతిక్రమించే వారికి భారీగా జరిమానాలు కూడా విధించాలని నిర్ణయించారు. సాధారణంగా ఇక్కడి గ్రామాల్లో వీడీసీ నిర్ణయాలను ధిక్కరించేందుకు ఎవరు కూడా సాహసించరన్నది బహిరంగ రహస్యమే. దీని కారణంగా వీడీసీలు విధించిన సెల్ఫ్‌లాక్‌డౌన్‌లు ప్రస్తుతం పల్లెల్లో ప కడ్భందీగా అమలవుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి ఈ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు పకడ్భందీగా అమలవుతున్న కారణంగా ఆయా పీహెచ్‌సీల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య కూడా తగ్గుముఖం పట్టినట్లు వైద్యాధికారు లు వెల్లడిస్తున్నారు. మొదటివేవ్‌ కరోనాకన్నా సెకండ్‌వేవ్‌ కరోనా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. పట్టణ ప్రాంతాల్లో ఎలాగూ కరోనాఉధృతి తీవ్రంగానే ఉంటున్నప్పటికీ మొదటివేవ్‌కు భిన్నంగా ఈ సారి గ్రామాల్లో పాజిటివ్‌ కేసులసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగైదు రోజుల క్రితం వరకు ప్రతి పీహెచ్‌సీ పరిధిలో 50కి తగ్గకుండా పాజిటివ్‌ కేసులు ప్రతీరోజూ నమోదయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ల కారణంగా పాజిటివ్‌ కేసులసంఖ్య 12 నుంచి 15కు మించడం లేదని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా పట్టణాల్లో మాత్రం ఎలాంటి కట్టడిచర్యలు కనిపించడం లేదు. యధావిధిగా జనసంచారం కొనసాగుతుండడం, దుకాణాలు, హోటళ్లు జోరుగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమలవుతుండగా స్వీయకట్టడి చ ర్యలు మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదంటున్నారు. కాగా ఖానాపూర్‌ పట్టణాల్లో నిర్మల్‌, భైంసా పట్టణాలకు భిన్నంగా అక్కడ పాజిటివ్‌ కేసులు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడంతో అక్కడ లాక్‌డౌన్‌ చేపట్టారు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కరోనాఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. 

రంగంలోకి వీడీసీలు

గ్రామీణప్రాంతాల్లో అన్ని తామై వ్యవహరిస్తూ సమాంతర వ్యవస్థను నడుపుతున్న వీడీసీలు (విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ) ఎట్టకేలకు కరోనాకట్టడి కోసం రంగంలోకి దిగడం సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జిల్లాలో దాదాపు వందకు పైగా గ్రామాల్లో ప్రస్తుతం అక్క డి వీడీసీలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించడం చర్చకు తావిస్తోంది. ఈ వీడీసీల సెల్ఫ్‌లాక్‌డౌన్‌ కారణంగా గత మూ డు నాలుగు రోజుల నుంచి ఆయా గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య తగ్గుముఖం పట్టిందంటున్నారు. అయితే వీడీసీలు సెల్ప్‌ లాక్‌డౌన్‌ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగానే జరిమానాలు విధించేందు కు సిద్ధమవుతున్నాయి. సెల్ప్‌లాక్‌డౌన్‌ విషయంలో ఇప్పటికే వీడీసీలు వ్యాపారులు, అలాగే అన్ని కుల సంఘాల సభ్యులతో చర్చించి స్వీయకట్టడిని ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీడీసీలకున్న పట్టు, ప్రాధాన్యత కారణంగా అక్కడ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పకడ్భందీగా అమలవుతోందంటున్నారు. కేవలం రెండు, మూడు గంటలు మా త్రమే లాక్‌డౌన్‌లో మినహాయింపును ఇస్తూ ఏవైనా పను లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వీడీసీలు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఇతర గ్రామాల్లో కూడా స్ఫూ ర్తి దాయకంగా నిలుస్తోంది. క్రమంగా ఒక్కో గ్రామం సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ దిశగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయంటున్నారు. 

గ్రామాల్లో తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

గత పదిరోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలకు గాను ప్రతీ కేంద్రంలో రోజు 50కి తగ్గకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వచ్చాయి. మొదటివేవ్‌కు భిన్నంగా ఈ సెకండ్‌వేవ్‌ సీజన్‌లో గ్రామీణ ప్రాంతాలనే ఎక్కువగా కరోనా ఉక్కిరి బిక్కి రి చేసింది. మొదటివేవ్‌లో కేవలం ఎక్కువగా పట్టణాలకే పరిమితమైన కరోనా సెకండ్‌వేవ్‌లో మాత్రం భిన్నంగా వ్యాప్తి చెందింది. పట్టణ ప్రాంతాల్లోనూ తన ఉదృతిని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగంగా విస్తరించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వరుసగా వారంరోజుల పాటు పాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిపోవడంతో పల్లెలన్నీ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారుపైనా, పోలీసులపైనా ఆధారపడకుండా ఇక తమకు తామే రంగంలోకి దిగి స్వీయ నియంత్రణతో వైరస్‌వ్యాప్తిని కట్టడి చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే పోటాపోటీగా దాదాపు వంద గ్రామాలకు పైగా సెల్ప్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించుకొని కరోనాబారి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ వారంరోజుల నుంచి కొనసాగుతున్న కట్టడి కారణంగా ఇక్కడి పీహెచ్‌సీల పరిధిలో పాజిటివ్‌ కేసులసంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మొన్నటి వరకు ప్రతీరోజు ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో 50కి పైగా దాటిపోయిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 15 దాటడం లేదని స్వయంగా వైధ్యాధికారులే పేర్కొంటున్నారు. ఆయా పీహెచ్‌సీల పాజిటివ్‌ కేసులలెక్కలు సైతం తగ్గిపోతుండడంతో అక్కడి సిబ్బంది వ్యాక్సినేషన్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 

పట్టణాల్లో మాత్రం కనీస జాగ్రత్తలు కరువు

గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై అవగాహన పెరగడంతో పాటు అక్కడి ప్రజలంతా చైతన్యంగా వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా పట్టణాల్లో మాత్రం స్థానికులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కే సుల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ ఇక్కడి ప్రజల్లో మాత్రం కనీస అవగాహన పెంపొందకపోవడం విమర్శలకు తావిస్తోంది. జనంగుంపులు,గుంపులుగా సంచరించడం, అలాగే హోటళ్లు, దుకాణాల్లో ఎగబడి కొనుగోళ్లు చేస్తుండడంతో కరోనావైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందంటున్నారు. అయి తే ఖానాపూర్‌లో మాత్రం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోవడం దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరి గిపోయిన కారణంగా అక్కడ సెల్ప్‌ లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నప్పటికీ నిర్మల్‌, భైంసా పట్టణాల్లో మాత్రం ఎక్కడ కూడా కనీస జాగ్రత్త చర్యలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. అక్షరాస్యులు, సామాజిక అవగాహన ఉన్న వారు ఎక్కువగానే ఉన్నప్పటికీ కరోనా విషయంలో నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చకు తావిస్తోంది. 

Updated Date - 2021-04-23T05:45:10+05:30 IST