రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కోసం పల్లెబాట

ABN , First Publish Date - 2021-05-11T06:05:30+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం అందించే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు జనం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద సోమవారం బారులు తీరారు.

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కోసం పల్లెబాట
వర్గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రెండో డోస్‌ కోసం సిటీ నుంచి వచ్చిన వారి కార్లు

సిటీకి దగ్గరగా ఉన్న ఆరోగ్య కేంద్రాల వద్ద వందల సంఖ్యలో కార్లు

గ్రామీణులకు దక్కని వైనం 

వైద్యాధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు

వర్గల్‌, మే 10: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం అందించే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు జనం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద సోమవారం బారులు తీరారు. గత నెలలో మొదటి డోస్‌ తీసుకున్న వారు ఇప్పుడు రెండో డోస్‌ కోసం  ఆసుపత్రుల వద్ద క్యూ కట్టారు. వారిలో అధిక శాతం పట్టణ ప్రజలే కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కోవాగ్జిన్‌ 4, కొవిషీల్డ్‌ 13 ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం ప్రజలకు రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ చేశారు. కాగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ చేయించుకోవడానికి జనం ఆరోగ్య కేంద్రాల వద్ద ఉదయంనుంచే బారులు తీరారు. ముఖ్యం గా హైదరాబాద్‌ సిటీకి దగ్గరగా ఉన్న మండలాలైన వర్గల్‌, ములుగు, గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రెండో డోస్‌ కోసం సిటీ జనం అధికంగా తరలివచ్చారు. 


సిటీ ప్రజలకే ప్రాధాన్యమా!

కాగా సిటీలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మొదటి డోస్‌ తీసుకున్నవారేరెండో డోస్‌ తీసుకునేందుకు   అధికంగా తరలిరావడం కనిపించింది. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడంలో వైద్యాధికారులు సిటీ ప్రజల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. వారికి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వ్యాక్సిన్‌ టీకాలు ఇచ్చారు. అదే స్థానికులు రెండో వ్యాక్సిన్‌ టీకా కోసం వచ్చిన వారిని వైద్య సిబ్బంది ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి డోస్‌ తీసుకున్న 6 వారాల తర్వాత రావాలని, ముందుగా వస్తే ఇవ్వలేమని తేల్చి చెప్పి పంపించారు. దీంతో వైద్యాధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ  ప్రజలు మండిపడ్డారు. 


ఆందోళన తప్పదా?

వైద్యాధికారులు రెండో డోస్‌ ఇవ్వడంలో చేతి వాటం ప్రదర్శిస్తున్నారని, సిటీ నుంచి వచ్చిన జనానికి డబ్బులు తీసుకుని వ్యాక్సిన్‌ ఇస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇలాగే కొనసాగితే ఆసుపత్రుల వద్ద లోకల్‌ వాళ్లకు మాత్రమే వాక్సిన్‌ ఇవ్వాలని, నాన్‌లోకల్‌ వాళ్లు వస్తే ఇచ్చేది లేదంటు అందోళన కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. 


కార్లతో నిండిన ఆస్పత్రుల పరిసరాలు

రెండో డోస్‌ కోసం సిటీ దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు అక్కడి జనం రావడంతో ఆస్పత్రి పరిసరాలు, రోడ్లు కార్లతో నిండిపోయాయి. ఆస్పత్రి అంతా సిటీ జనంతోనే రద్దీగా కనిపించింది. ఆధార్‌ కార్డుపై ఉన్న అడ్రస్‌ ప్రకారం స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లయితే గ్రామీణులకు వ్యాక్సిన్‌ దక్కవచ్చని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వైద్య సిబ్బంది తీరుపై గ్రామీణులు  అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-05-11T06:05:30+05:30 IST