మందుకొట్టి మాస్కులేకుండా విమానంలోకి.. అడ్డుకున్న సిబ్బందిపై తిట్ల దండకం.. వీడియో వైరల్.. చివరికి..

ABN , First Publish Date - 2021-09-14T14:12:42+05:30 IST

కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి మాస్కు మన జీవితంలో ఓ భాగమైపోయింది. గడపదాటి బయటకు రావాలంటేనే మాస్కు ధరించకుండా రావడానికి వీల్లేకుండా ఉంది. అయితే కొంతమంది మాత్రం ఈ నిబంధనలను..

మందుకొట్టి మాస్కులేకుండా విమానంలోకి.. అడ్డుకున్న సిబ్బందిపై తిట్ల దండకం.. వీడియో వైరల్.. చివరికి..

ఫ్లోరిడా: కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి మాస్కు మన జీవితంలో ఓ భాగమైపోయింది. గడపదాటి బయటకు రావాలంటేనే మాస్కు ధరించకుండా రావడానికి వీల్లేకుండా ఉంది. అయితే కొంతమంది మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కి తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుతిరుగుతారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విరుచుకుపడతారు. తాజాగా ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లైట్ ఎక్కే సమయంలో ఓ జంట మాస్కులు సక్రమంగా పెట్టుకోకపోగా దానిపై ప్రశ్నించిన విమాన సిబ్బందిపై బూతులతో దండెత్తారు. దీంతో వారిని సిబ్బంది విమానం నుంచి దించేశారు.  ఈ ఘటన మొత్తాన్నీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఫ్లోరిడాలోని లాండెర్‌డేల్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వెళ్లేందుకు జెట్ బ్లూ ఎయిర్‌ప్లేన్ విమానం సిద్ధమవుతోంది. విమానంలోకి ప్రయాణికులంతా ప్రవేశిస్తున్నారు. ఇంతలో ఓ జంట విమానం ఎక్కబోయింది. అయితే విమానంలోకి ముందుగా మహిళ ప్రవేశించింది. ఆ తర్వాత అతడు లోనికి అడుగుపెడుతూనే తన మాస్కు తీసేశాడు. దీంతో సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని అతడికి సూచించారు. దీంతో వెంటనే అతడు సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. పక్కనే ఉన్న మరో ఫ్లైట్ ఉద్యోగి అతడిని మాస్కు లేకుండా లోనికి అనుమతించలేదు. అప్పటికే విమానంలోనికి ప్రవేశించిన మహిళ ఇదంతా చూసి వెంటనే వెనక్కి వచ్చింది. తన మాస్కును కూడా తొలగించి సిబ్బందిపై బూతులతో విరుచుకుపడింది. ఈ తంతునంతా అక్కడి ఇతర ప్రయాణికులు వీడియోలు తీస్తుండడంతో వారిపై కూడా ఆ మహిళ విరుచుకుపడింది.




ఈ తంతు మొత్తాన్ని అలిస్ రూసో అనే తోటి ప్యసెంజర్ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘మందుకొట్టిన ఓ జంటను విమాన సిబ్బంది బయటకు తోసేశారు. ఈ వీడియో నేనే తీశాను. చాలామంది ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నారు కదా. అందుకే నేను కూడా దీనిని పోస్ట్ చేస్తున్నాను. సమస్యను సిబ్బంది చాలా బాగా పరిష్కరించారు. ఆ మహిళ విమానంలో అటు ఇటూ తిరుగుతోంది. ఆమెను చూస్తే కచ్చితంగా మద్యం తాగిందని తెలిసిపోతోంది’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

Updated Date - 2021-09-14T14:12:42+05:30 IST