దంపతుల ఆత్మహత్యపై పలు అనుమానాలు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-01-21T16:33:42+05:30 IST

పటాన్‌చెరు: చిన్నారి స్నిగ్ధతో సహా దంపతులు శ్రీకాంత్ గౌడ్, అనామిక ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.

దంపతుల ఆత్మహత్యపై పలు అనుమానాలు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

పటాన్‌చెరు: చిన్నారి స్నిగ్ధతో సహా దంపతులు శ్రీకాంత్ గౌడ్, అనామిక ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. హత్య, ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వందనపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్ల క్రితం అనామికను శ్రీకాంత్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె స్నిగ్ధ ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నారు. భార్య అనామిక ఓ ప్రయివేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. 


అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా.. స్పందన లేకపోవడంతో ఆయన కుమార్తె ఇంటికి వచ్చారు. తలుపు లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూసేసరికి ఏడేళ్ల స్నిగ్ధ, ఆమె తల్లి అనామిక నురగలు కక్కుతూ మృతి చెంది ఉన్నారు. పక్క గదిలో శ్రీకాంత్ గౌడ్ ఉరేసుకుని కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చనిపోయిన వారి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం.. దేవుని గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పఠాన్ చెరువు ప్రభుత్వ హాస్పిటల్‌లో మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం శామీర్ పేట్ మండలం పోతాయిపల్లిలో అంతక్రియలు జరగనున్నాయి.


పూర్తి వివరాలు..

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నెలకు రూ.2 లక్షల జీతం! ఆమె కార్పొరేట్‌ స్కూల్లో ఉపాధ్యాయురాలు. ఇద్దరూ దంపతులు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఏడేళ్ల కూతురు ఉంది! ఈ కుటుంబం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని బీరంగూడా వందననపురి కాలనీలోని సొంతింట్లో నివాసం ఉంటోంది! రెండ్రోజులుగా ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకురాలేదు. అనుమానంతో వెళ్లి చూస్తే.. ముందు గదిలో భార్య, కూతరు నోట్లోంచి నురగలు, నెత్తురు కక్కుతూ విగత జీవులుగా కనిపించారు! బెడ్‌రూంలో భర్త ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతులను శ్రీకాంత్‌ గౌడ్‌ (42), ఆయన భార్య అనామిక (40), కూతురు స్నిగ్ధ (7)గా గుర్తించారు. భార్య, కూతురుకు విషమిచ్చి చంపి.. అనంతరం శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఉన్నతోద్యోగం, జీవన విధానం ఆధారంగానైతే ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాకపోవచ్చునని బలంగా నమ్ముతున్నారు. మరి.. ఎందుకు ఆయన ఇంతటి దారుణానికి ఒడిగట్లు? అనేది సస్పెన్స్‌గా మారింది! శ్రీకాంత్‌, టీఎసీఎస్‌లో పనిచేస్తున్నారు. స్వస్థలం మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేట. అనామికది ఓల్డ్‌ అల్వాల్‌. ఇద్దరిదీ కులాంతర వివాహం. వందనపురి కాలనీలో ఈ దంపతులు ఓ ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు. ఓ కార్పొరేట్‌ పాఠశాలలో అనామిక పనిచేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బుధవారం ఉదయం తర్వాత ఎవ్వరూ బయట కనిపించలేదు. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు, దేవుడి పటాల తీరును పరిశీలిస్తే తీవ్ర మానసిక సమస్యలతోనే శ్రీకాంత్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనామిక, స్నిగ్ధ, శ్రీకాంత్‌ నుదుర్లకు నెత్తుటి బొట్లు ఉన్నాయి. దేవుడి పటాల వద్ద పూజలు చేసిన అనవాళ్లు కనిపించాయి. ఆ పటాలు బోర్లిచి ఉన్నాయి. భార్య, బిడ్డకు తినే ఆహారంలో విషం కలిపి వారు మృతిచెందారని నిర్ధారించుకున్నాక.. దేవుడి పటాలకు పూజలు చేసి, మృతదేహాలకు నెత్తుటి తిలకం దిద్ది శ్రీకాంత్‌ ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-01-21T16:33:42+05:30 IST