వర్క్‌ ఫ్రమ్‌ హోం : కోటి వస్తుందని చెప్పి 60 లక్షలు కొల్లగొట్టారు..!

ABN , First Publish Date - 2021-06-26T18:59:10+05:30 IST

ప్రస్తుతం ఏ అవసరమున్నా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం చాలా మందికి అలవాటు. దానిని ఆసరాగా

వర్క్‌ ఫ్రమ్‌ హోం : కోటి వస్తుందని చెప్పి 60 లక్షలు కొల్లగొట్టారు..!

  • దంపతుల నుంచి రూ. 60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
  • గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే మొబైల్‌కు యాప్‌ 
  • పెట్టుబడి పెడితే లాభాలంటూ మోసం

ప్రస్తుతం ఏ అవసరమున్నా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం చాలా మందికి అలవాటు. దానిని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. నమ్మకంగా మాట్లాడి అందిన కాడికి దోచుకుంటున్నారు. అధిక లాభాలు ఆశపెట్టి మోసం చేస్తున్నారు. సైబర్‌ క్రైం పోలీసులకు రోజుకు కనీసం ఒకటైనా ఇలాంటి ఫిర్యాదు వస్తోంది.


హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : వర్క్‌ ఫ్రమ్‌ హోం బిజినెస్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కిన ఒకరు ఏకంగా రూ. 60 లక్షలు పోగొట్టుకున్నాడు. సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కథనం ప్రకారం... అమీర్‌పేట్‌కు చెందిన వంశీమోహన్‌ గూగుల్‌లో వర్క్‌ ఫ్రం బిజినెస్‌ కోసం వెతికాడు. ఓ ఫోన్‌ నెంబర్‌ కనిపించడంతో కాల్‌ చేశాడు. ఆ తర్వాత అతని మొబైల్‌కు ఒక లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే అది వాట్సాప్‌ లోకి వెళ్లింది. వాట్సా్‌పలో అతనికి మరో లింక్‌ వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయగానే ఏపీకే ఫార్మాట్‌లో(గూగుల్‌ ప్లే స్టేర్‌లో ఉండని) జాప్‌బిట్‌ పేరుతో ఒక మొబైల్‌ యాప్‌ వచ్చింది. వెంటనే మదన్‌మోహన్‌ దాన్ని డౌన్‌లోడ్‌ చేసాడు. ఇంతలో అతనికి ఒక నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది.


మీరు డౌన్‌లోడ్‌ చేసిన జాప్‌బిట్‌ యాప్‌ ద్వారా రూ.500, ఆపైన డబ్బులు డిపాజిట్‌ చేస్తే రెండు మూడు రోజుల్లో రెట్టింపు లాభాలు వస్తాయని, ఇందుకోసం గూగుల్‌ యాడ్స్‌ తరహాలో డాక్టర్‌ లవ్‌ అనే వెబ్‌సైట్‌ను రోజూ ఓపెన్‌ చేసి డాక్టర్‌ సలహాలు తీసుకుంటుండాలని, రోజు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు యాప్‌లోని అకౌంట్‌కు జమ అవుతాయని నమ్మబలికారు. వారు చెప్పినట్లే రెండు రోజులు చేయగా యాప్‌లో ఐదారు వేలు జమ అయినట్లు బ్యాలెన్స్‌ చూపించింది. ఈలోగా మరో వ్యక్తి కాల్‌ చేసి, యాప్‌లో లాభాల మొత్తం రూ.కోటి దాటితే తప్ప విత్‌డ్రా చేసుకోవడం కుదరదని, ఒక ట్యూటర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో రూ.10లక్షలు పెట్టుబడి పెడితే వారంలో రూ. 30 లక్షల వరకు లాభాలు వస్తాయని, ఈ మొత్తం కోటి దాటిన తర్వాత డబ్బులు మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పాడు.


నమ్మిన వంశీమోహన్‌ రూ.10లక్షలు పెట్టుబడి పెట్టడమే కాకుండా, భార్య పేరిట కూడా మరో రూ. 10 లక్షల కట్టించాడు. తర్వాత జాప్‌బిట్‌ యాప్‌లో వంశీ మోహన్‌ దంపతుల పెట్టుబడులకు రూ.కోట్లలో లాభాలు వస్తున్నట్లు, అవి యాప్‌లో జమ అవుతున్నట్లు చూపించారు. మరో రెండు పర్యాయాలు ఇద్దరి వద్ద రూ.20లక్షల చొప్పున మొత్తం అరవై లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్చాఫ్‌ అయ్యాయి. మొబైల్‌ లింక్‌ ద్వారా మాత్రమే ఓపెన్‌ అయ్యే జాప్‌బిట్‌ యాప్‌ను కూడా డిలిట్‌ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేసాడు. 

Updated Date - 2021-06-26T18:59:10+05:30 IST