Sensational News: శేషన్న రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-09-29T00:44:21+05:30 IST

నయీం ప్రధాన అనుచరుడు శేషన్న(Seshanna) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలు...

Sensational News: శేషన్న రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న(Seshanna) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు. అయితే పోలీసుల అరెస్టుపై మీడియాతో మాట్లాడడానికి శేషన్న నిరాకరించారు. మరోసారి కలిసినప్పుడు మాట్లాడతానని చెప్పారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న శేషన్న.. ల్యాండ్ సెటిల్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా హైకోర్టులో ప్రవేశపెట్టారు. 


అయితే ABN చేతికి శేషన్న రిమాండ్ రిపోర్ట్ (Remand Report) దొరికింది. శేషన్నకు సంబంధించిన కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘శేషన్నపై మొత్తం పది కేసులు ఉన్నాయి. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఆరున్నర సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నయీం ప్రధాన అనుచరుడు ప్రమాదకరమైన వ్యక్తి శేషన్న. శేషన్నకు చాలా షెల్టర్స్ ఉన్నాయి. పారిపోయే ప్రమాదం ఉంది. చాలా నేరాలకు పాల్పడ్డాడు. ఆయుధాలు చూపించి బెదిరిస్తాడు. నానక్‌రాoగూడ నుండి గచ్చిబౌలి వెళుతున్న శేషన్నను అదుపులోకి తీసుకున్నాం. 1993లో శేషన్నను పోలీసులు తొలిసారి అరెస్ట్ చేశారు. ఐపీఎస్ వ్యాస్, కొనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి, టీచర్ కనకాచారి, రాములు హత్య కేసులో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. అక్రమ ఆయుధాల కేసులో సైతం శేషన్న నిందితుడు. విద్యార్ధి దశలోనే నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. తాడా కేసులో గతంలో అరెస్ట్ అయ్యాడు. నయీంతో జైల్లో పరిచయం అయింది.’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 



శేషన్న రిమాండ్ రిపోర్టులో మరిన్ని విషయాలను కూడా పొందుపర్చారు. ‘‘నయింతో పరిచయం తర్వాత శేషన్న వరుస హత్యలు, అక్రమాలకు పాల్పడ్డాడు. 15 మంది నక్సల్ కమాండర్స్‌తో పని చేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టులకు కొరియర్‌గా, డెన్ కీపర్‌గా పని చేశాడు. శేషన్నపై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు ఉన్నాయి. శేషన్నవద్ద నుండి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నాం. శేషన్నరెండు వివాహాలు చేసుకున్నారు. ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 





Updated Date - 2022-09-29T00:44:21+05:30 IST