వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచాలంటే.. అవన్నీ కావాలి

ABN , First Publish Date - 2021-05-09T06:09:41+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు నెలకొన్న భారీ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీ, కీలక యంత్రాలు, ముడి పదార్ధాల సరఫరా చాలా కీలకమని...

వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచాలంటే.. అవన్నీ కావాలి

  • పేటెంట్లలో వెసులుబాటు ఒక్కటే సరిపోదు
  • కొవాగ్జిన్‌ను ఈయూలో రిజిస్టర్‌ చేస్తున్నాం
  • భారత్‌ బయోటెక్‌ సంయుక్త ఎండీ సుచిత్రా ఎల్లా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు నెలకొన్న భారీ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీ, కీలక యంత్రాలు, ముడి పదార్ధాల సరఫరా చాలా కీలకమని భారత్‌ బయోటెక్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా తెలిపారు. పేటెంట్ల నిబంధనల్లో వెసులుబాటు కల్పించడం ఒక్కటే సరిపోదు. భాగస్వామ్యాలు, టెక్నాలజీ, ముడి పదార్థాల లభ్యత ముఖ్యమని ఈయూ-ఇండియా బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పేర్కొన్నారు. అప్పుడే దేశీయ అవసరాలతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలమని చెప్పారు. భారత్‌ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్‌ అవసరాలకు భాగస్వామ్యాలు చాలా అవసరమని వ్యాఖ్యానించారు. అందుకే కొవాగ్జిన్‌ను అమెరికాలో రిజిస్టర్‌ చేశాం. యూర్‌పలో కూడా రిజిస్టర్‌ చేయనున్నాం. యూరోపియన్‌ యూనియన్‌లోని (ఈయూ) కంపెనీలు, విద్యా సంస్థలతో చేతులు కలుపుతామని సుచిత్రా ఎల్లా తెలిపారు.


భాగస్వామ్యాలపై దృష్టి: భారత్‌ చాలా పెద్ద దేశం. 130 కోట్ల మంది జనాభాకు రెండు డోసులు ఇవ్వాలంటే 260 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ కావాలి. చాలా తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం చాలా కష్టం. ఇది ఏ దేశానికి సాధ్యమయ్యే పని కాదు. అయితే.. మరిన్ని టెక్నాలజీలు అందుబాటులోకి వస్తే.. వాటిని వినియోగించి భారత వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచగలవు. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని మనం వినియోగించుకోగలం. ఇటువంటి మార్పులు జరిగేతేనే వీలైనంత తక్కువ కాలంలో దేశానికి, ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను అందించగలమని ఆమె అన్నారు. ఈ దిశగా చేతులు కలిపేందుకు భారత్‌ బయోటెక్‌ సంసిద్ధంగా ఉందని చెప్పారు. భాగస్వామ్యాలకు విలువ ఇస్తుందని, గతంలో 6-8 ఉత్పత్తులను తీసుకురావడానికి వివిధ సంస్థలతో పని చేసిందన్నారు. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేయడానికి అవసరమైన కొన్ని కీలకమైన ఎక్వి్‌పమెంట్‌, ముడిపదార్ధాలు ఈయూ నుంచి రావాలి. వీటికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అవసరమైనంత స్థాయిలో ముడి పదార్థాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో ఈయూ కంపెనీలతో చేతులు కలపాలని భావిస్తున్నామని చెప్పారు. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసే విధంగా సామర్థ్యాలను భారత్‌ బయోటెక్‌ పెంచనుందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 18-44 ఏళ్ల మధ్య వారి కోసం వ్యాక్సిన్‌ను సమకూర్చుకునే బాధ్యతను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు వదిలి వేసిందని ఎల్లా అన్నారు.  దీంతో రాష్ట్రాలు వ్యాక్సిన్‌ తయారీదారుల వెంట పడుతున్నాయని, గిరాకీకి తగ్గట్టుగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసే పరిస్థితిలో వ్యాక్సిన్‌ తయారీదారులు లేరని సుచిత్రా ఎల్లా అన్నారు.

Updated Date - 2021-05-09T06:09:41+05:30 IST