కప్పేసిన మంచు దుప్పటి

ABN , First Publish Date - 2022-01-23T05:17:55+05:30 IST

గోపాలపట్నం శివారు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు మంచు ముసుగు తొలగడం లేదు.

కప్పేసిన మంచు దుప్పటి
కొత్తపాలెం- నరవ రహదారిలో ఉదయం 7.30 గంటలకు కమ్ముకున్న పొగమంచు

ఉదయం 8 గంటల వరకు కొనసాగిన పొగమంచు

ముందు వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకుల ఇబ్బందులు

గోపాలపట్నం, జనవరి 22: గోపాలపట్నం శివారు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు మంచు ముసుగు తొలగడం లేదు. వాహనచోదకులు హెడ్‌లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగిస్తున్నారు. గోపాలపట్నానికి దిగువ ప్రాంతంలోని కొత్తపాలెం శివారు నుంచి నరవ వెళ్లే ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కురిసింది. ముందు వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. గోపాలపట్నానికి దిగువ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు ఉండడంతో పాటు శివారులో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ కాలువ, చెరువులు ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో నిత్యం మంచు కురుస్తుంది. కాగా శనివారం ఉదయం మాత్రం అసాధారణంగా మంచు కురిసింది. కొత్తపాలెం, నరవ, కోటనరవ, సత్తివానిపాలెం ప్రాంతాల్లో మంచు తీవ్రత ఉదయం 8 గంటల వరకు కనిపించింది.

పరవాడలో..

పరవాడ: పరవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 8 గంటలైనా ఇంటి ముందు ఇళ్లు సైతం కనిపించనంతటి దట్టమైన మంచు కురిసింది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. హారన్‌ మోగించుకుంటూ నెమ్మదిగా వెళ్లారు. ఉదయం 8.30 గంటల వరకు సూర్య కాంతి కనిపించలేదు. సింహాద్రి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ ప్రాంతాల్లో కూడా మంచు తెరలు కమ్ముకోవడంతో విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు జాగ్రత్తగా రాకపోకలు సాగించాల్సి వచ్చింది. 

సబ్బవరంలో..

సబ్బవరం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం దట్టంగా మంచు కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు కమ్ముకునే ఉంది. పలు గ్రామాల్లో రైతులు కల్లాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పొగ మంచు వల్ల జీడి, జీడి మామిడి తోటల్లో పూత మాడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-01-23T05:17:55+05:30 IST