Advertisement

పొలంలో రైతు నిలిచేనా?

Oct 16 2020 @ 00:01AM

2010 సంవత్సరంలో బిహార్‌లో అమలు చేసిన ‘నూతన వ్యవసాయ మార్కెటింగ్’ వల్ల మార్కెట్‌యార్డులన్నీ నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడూ దేశవ్యాప్తంగా మార్కెట్‌యార్డులకు అదే గతి పట్టవచ్చు. కేంద్రమే అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. కొత్త వ్యవసాయ చట్టాలవల్ల మన ఆహార భద్రతకు,వ్యవసాయరంగం భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.


కొవిడ్–-19 మహమ్మారిని తట్టుకొని నిలబడగలిగిన ఒకే ఒక రంగం వ్యవసాయరంగం. గత సంవత్సరం కంటే ఈ ఏప్రిల్‌–జూన్ త్రైమాసికంలో అది 3.14 శాతం అభివృద్ధిని నమోదు చేసుకుంది. ఈ రంగం మరింత పురోగతి సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర కల్పించాలని రిజర్వుబ్యాంక్ సూచిస్తోంది. రైతుల కోసం సరళమైన వాణిజ్య విధానం లేకపోతే, పెరిగిన వ్యవసాయోత్పత్తికి, దాని ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య సారూప్యం ఉండదని ఆ బ్యాంక్‌ తన గత ఏడాది నివేదికలో పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ నివేదిక రైతులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరను కల్పించాలని సిఫారసు చేసినట్టే. ఒకవైపు రైతులు ధరకోసం కొట్లాడుతుంటే, మరోవైపు కేంద్రప్రభుత్వం ఆ ధరను నిర్ణయించే అధికారం కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టింది. మనదేశంలో గత సంవత్సరం 10 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 83 శాతం మంది మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే. వ్యవసాయ విధానంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల రైతుల పరిస్థితి కనక దిగజారిపోతే ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.


2017–18 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం, మోడల్ ఏపీఎంసి అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది ఆ తర్వాత ప్రభుత్వానికి మల్టిపుల్ మార్కెట్ ఛానల్, ప్రీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మొదలైనవాటిపై అనురక్తి కలిగింది. వాటిని అమలు చేయడానికి పాత ఏపీఎంసీ చట్టాలు అడ్డుగా ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం సంక్రమించే అధికారాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. అందువల్ల వాటి అధికారాన్ని కుదించడానికి కేంద్రం కుట్రపూరిత ప్రయత్నం మొదలుపెట్టింది. అందులో భాగంగానే 2019లో జూలైలో ఏడుగురు ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తనకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులనే అందులో నియమించింది.


ఆ కమిటీతో కాంట్రాక్టు వ్యవసాయానికి అనుకూలంగా సిఫారసులు చేయించుకుంది. వాటిని అమలు చేయాలంటే అత్యవసర వస్తువుల చట్టం–-1955 పెద్ద అడ్డంకిగా మారింది. అందుకే దానికి సవరణలు చేసింది. కార్పొరేట్, కాంట్రాక్టు వ్యవసాయానికి అనుకూలంగా మూడు కొత్త చట్టాలు తెచ్చింది. రైతులకు ఎంతో లాభం కలిగిస్తున్నట్టుగా మల్టిపుల్ మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తున్నట్టుగా కొన్ని అందమైన అబద్ధాలను వాటిలో పొందుపరిచింది. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి, రైతు అనుకూల విధానాలను రూపొందించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగుతుంటే, కేంద్రం మాత్రం అంతకంటే నష్టదాయకమైన చట్టాలు చేయటం దురదృష్టకరం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూనే, దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. గతంలో ఉన్న నియంత్రణ ఎత్తివేస్తూ ఒక వ్యక్తి లేదా సంస్థ పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవడానికి, నిల్వ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఫలితంగా నిన్నటిదాకా నేరమైన విషయం ఈరోజు న్యాయమైపోయింది. 


కేంద్రం వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారం వాణిజ్యం (ప్రమోషన్& ఫెసిలిటేషన్) పేరిట తెచ్చిన చట్టం వల్ల రైతులు తమ పంట దిగుబడులను దేశంలో ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చు. మార్కెట్‌యార్డ్‌లోనే అమ్ముకోవలసిన అవసరం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు లేదా గిడ్డంగుల ఆవరణలలోనూ అమ్ముకోవచ్చు. నిల్వ చే‍సుకునీ అమ్ముకోవచ్చు. ఎవరైనా పంట చేను దగ్గరకే వచ్చి కొనుగోలు చేయవచ్చు. దీనికి తోడు ఈ చట్టం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్‌ను కూడా అనుమతిస్తోంది. దీనిని అనుసరించి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్ మీద అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్‌ అయిన సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలు, వాటితో పాటు ఆదాయపు పన్ను నెంబర్ ఉన్న ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్, రిటైల్ సంస్థలకు ఎంతో లాభం చేకూర్చేదిగా ఉన్న ఈ చట్టం వల్ల ఇతర కొనుగోలు దారులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతారని చెప్పలేం. కొనుగోలుదారుల నుంచి ఎటువంటి లెవీ, మార్కెట్ ఫీజు వసూలు చేయకుండా ఈ చట్టం అడ్డుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెర వేస్తోంది. 


రైతులతో ధరపై ఒప్పందం చేసుకునే రెండో చట్టానికి సాధికారిత, రక్షణ చట్టం అని ముద్దుపేరు కూడా పెట్టారు. ఇది వ్యవసాయ ఉత్పత్తులపై కొనుగోలుదారులు రైతులతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా కనీసం ఒక పంట కాలానికి లేదా ఐదు సంవత్సరాల వరకు రైతుతో ఒప్పందం చేసుకోవచ్చు. పండ్లతోటలు, ఇతర దీర్ఘకాలిక పంటల విషయంలో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కూడా ఒప్పందం చేసుకోవచ్చు. దీనికో చక్కటి ముసుగు వేసి ఒక ఆకర్షణను అద్దారు. అదేమిటంటే, పంట ధరను ముందుగానే నిర్ణయించడం. ఒప్పందం చేసుకున్నప్పుడే పంట ధరను నిర్ణయించి రాతకోతలు పూర్తి చేసుకోవాలి. ఇంకేమైనా అదనపు ధర చెల్లించాల్సి వస్తే దాన్ని కూడా ఒప్పందంలో పొందుపరచుకోవాలి. దీని దగ్గరే అసలు మోసం ప్రారంభమవుతుంది. రైతుకు వ్యవసాయం మీద ఆజమాయిషీ పోతుంది. కొనుగోలుదారు లేదా కార్పొరేట్ కంపెనీ నిర్ణయించిన, నిర్దేశించిన పంట మాత్రమే వేయాల్సి ఉంటుంది. పంట చేతికొచ్చే నాటికి మార్కెట్ ధరతో సంబంధం లేకుండా చేసుకున్న ఒప్పందం ప్రకారమే కంపెనీలు రైతుకు డబ్బు చెల్లిస్తాయి. అంతా సవ్యంగా సాగినప్పుడు మాత్రమే రైతులకు డబ్బులు సరిగ్గా అందుతాయి. లైసెన్స్ లేని కొనుగోలుదారులు ఒప్పందం కుదుర్చుకుని మోసం చేస్తే, వారి నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి ప్రభుత్వం వద్ద వాళ్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవి ఉండవు.


ఏదైనా వివాదం తలెత్తితే సంబంధిత బోర్డుకి వెళ్లి ఫిర్యాదు చేసుకోవలసి ఉంటుంది. ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించినా దానిని అర్జీలు ఇచ్చిన 30 రోజుల లోపల పరిష్కరించుకోవాలి. లేదంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌ను సంప్రదించవలసి ఉంటుంది. రైతలు అప్పుల పాలైతే వారి నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోకూడదని చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ ఒక్క రైతులు భూమిని అమ్ముకునే బాకీ చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఆత్మహత్యలే శరణ్యమయే పరిస్థితి రావచ్చు.


ఇక కొత్త అత్యవసర వస్తువుల చట్టలోకి వెళ్లేముందు పాత చట్టం ఏం చెబుతోందో చూద్దాం. 1955 నాటి చట్టం ప్రకారం ఆహారధాన్యాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు అత్యవసర వస్తువుల కిందికి వస్తాయి. ఏదైనా ఒక నిత్యావసర వస్తువును కేంద్రం అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలంటే రాష్ట్రప్రభుత్వాలను సంప్రదించే చేయవలసి ఉంటుంది. లైసెన్స్, అనుమతులు ఇవ్వడం, వ్యవసాయ ఉత్పత్తులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అత్యవసర ఆహార ఉత్పత్తుల కోసం వృథాగా ఉన్న భూమిని వ్యవసాయ వినియోగంలోకి తీసుకొచ్చి, పంట దిగుబడి పెంచే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వస్తువులు కొనడం, అమ్మడం, నిల్వ చేసుకోవడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం ధర నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే వినియోగానికి మించి అధికంగా నిల్వ చేయకుండా బ్లాక్ మార్కెట్‌ని కట్టడి చేయడం కూడా దాని బాధ్యతే. 


కొత్త చట్టం ఈ అధికారాలను కేంద్రప్రభుత్వానికి దఖలుపరిచింది. గతంలో అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కేంద్రం తృణధాన్యాలు, పప్పులు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నూనె గింజలు వంటి కొన్ని ఉత్పత్తులను నియంత్రించేది. ఆ అసాధారణ పరిస్థితులు ఏమిటంటే– యుద్ధాలు జరడం, ఆయా ఉత్పత్తులకు తీవ్రమైన కొరత ఏర్పడటం, ధరలు అమితంగా పెరగడం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు సంభవించడం. ఇప్పుడు అవేవి లేకుండానే నియంత్రణలను, పరిమితులను ఎత్తివేయడానికి కొత్తచట్టం వెసలు బాటు కల్పిస్తోంది. దీని కారణంగా ఎవరైనా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. అయితే, ఉద్యానవన పంటల ధరలు ఒక సంవత్సరంలో ఉన్న దాని కంటే 50 శాతం పెరిగితే వాటి నిల్వలపై పరిమితి విధిస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. గతంలో కఠినమైన చట్టాలు ఉన్నప్పుడే, ఉల్లిగడ్డల వంటి వాటి ధరలు ఒక నెలలో కిలో 10 రూపాయలు ఉంటే తరువాతి నెలల్లో 50 రూపాయలు ఉండేవి. ఇప్పుడిక అత్యధిక నిల్వలకు అవకాశం కల్పించాక ధరల అసాధారణ పెరుగుదలను కేంద్రం నియంత్రించగలుతుందని సాధారణ ప్రజలు ఎలా నమ్మగలుగుతారు? రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయ రంగం వెళ్తే, ధరల నిర్ణయం వారిదే అవుతుంది. ప్రభుత్వాలు చేతలుడిగి చూస్తూండిపోవలసి వస్తుంది. 


2010 సంవత్సరంలో బిహార్‌లో అమలు చేసిన నూతన వ్యవసాయ మార్కెటింగ్ వల్ల కొత్త పెట్టుబడిదారులు ఎవరూ ఈ రంగంలోకి రాలేదు. ఉన్న మార్కెట్‌యార్డులన్నీ నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు కూడ దేశవ్యాప్తంగా మార్కెట్ యార్డులకు అదే గతి పట్టవచ్చు. కేంద్రమే అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. కొత్తగా తెచ్చిన ఈ చట్టాల వల్ల మనదేశపు ఆహార భద్రతకు, వ్యవసాయరంగం భవిష్యత్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.


ఎర్రోజు శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.