‘టీకా’ వేశారు

ABN , First Publish Date - 2021-01-17T05:29:47+05:30 IST

కరోనా మహమ్మారిపై సమరంలో అత్యంత కీలక ఘట్టమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం మొదలైంది. 20 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కడప రిమ్స్‌లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా లాంఛనంగా ప్రారంభం చేశారు.

‘టీకా’ వేశారు
రిమ్స్‌లో వ్యాక్సినేషనను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఇనచార్జి కలెక్టర్‌ గౌతమి

జిల్లాలో తొలిరోజు 1147 మందికి కరోనా వ్యాక్సినేషన్‌

అత్యధికంగా దువ్వూరు, పుల్లంపేటలో 87 శాతం

అత్యల్పంగా పులివెందులలో 30 శాతం

గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో కొందరు గైర్హాజర్‌

భయంతో మరి కొందరు..

వేధించిన కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు

కడప రిమ్స్‌లో టీకాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా


ముఖానికి మాస్కు లేకుండా ఇంటి నుంచి వీధిలోకి అడుగు పెట్టాలంటే భయం. దుకాణంలో ఏదైనా తాకాలంటే భయం. ఎదురుగా నిల్చుని మాట్లాడే ఆత్మీయులు తుమ్మినా దగ్గినా భయమే. అయినవారింట పెళ్లికి పోవాలన్నా భయం. స్నేహితుల ఇంట విందారగించాలన్నా భయం. ఇన్ని భయాలకూ పరిష్కారం ఒకే ఒక్కటి.. అదే కరోనా వ్యాక్సిన. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు రానేవచ్చాయి. శనివారం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన ప్రారంభమైంది. తొలిరోజు 2001 మందికి గాను 1147 మంది టీకా వేయించుకున్నారు. టీకాతో ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా వేయించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, టీకా వేసుకున్న వారు పిలుపునిచ్చారు.


కడప, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారిపై సమరంలో అత్యంత కీలక ఘట్టమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం మొదలైంది. 20 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కడప రిమ్స్‌లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా లాంఛనంగా ప్రారంభం చేశారు. జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసి, గుర్తించిన వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి టీకా వేయాలనే లక్ష్యంగా ముందుకు కదిలారు. 24,722 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ను గుర్తిస్తే, తొలిరోజు 2001 మందికి టీకా వేసేందుకు శ్రీకారం చుట్టారు. జనావళిపై దాడి చేసి, పది నెలలుగా పీడిస్తున్న కరోనా నుంచి విముక్తి పొందటానికి యావత్‌ ప్రపంచం ఎదురుచూసిన వ్యాక్సినేషన్‌ కీలక పర్వానికి తొలి అడుగు పడింది. గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో కొందరు.. భయంతో మరి కొందరు గైర్హాజరయ్యారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక సమస్య వల్ల టీకా ప్రక్రియకు కొంతసుపు ఆటంకం కల్గింది.


తొలిరోజు 1,147 మందికి టీకా..

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ తొలివిడతలో 24,722 మంది వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లను గుర్తించారు. శనివారం ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లాలో 20 కేంద్రాల్లో తొలిరోజు 2001 మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకే వైద్య సిబ్బంది టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడప రిమ్స్‌ హాస్పిటల్‌లో డీప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గౌతమి, జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ది) సాయికాంత్‌వర్మ ప్రారంభించారు. అయా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీకాను ప్రారంభించారు. తొలిరోజు 1147 మందికి టీకా వేసి, 57.32 శాతం సక్సెస్‌ సాధించారు. 


అత్యధికంగా దువ్వూరు, పుల్లంపేటల్లో..

పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ ఆసక్తి చూపారు. సగటున 65-70 శాతం గ్రామీణ ప్రాంత పీహెచ్‌సీలలో సక్సెస్‌ అయితే, పట్టణ ప్రాంతాల్లో 45-55శాతం లోపే ఉంది. ప్రతి కేంద్రంలో వంద మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేస్తే, అత్యధికంగా దువ్వూరు పీహెచ్‌సీలో 87, పుల్లంపేట పీహెచ్‌సీలో 87 మంది టీకాలు వేయించుకున్నారు. అత్యల్పంగా పులివెందుల ఏరియా ఆస్పత్రి పరిధిలో వంద మందికి గాను కేవలం 30 మంది, బద్వేలులో 32 మంది మాత్రమే వ్యాక్సినేషన్‌కు హాజరయ్యారు.

    యావత్‌ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కరోనా టీకా అందుబాటులోకి వచ్చినా.. తొలిరోజు దీనిని వేయించుకోవడానికి పలువురు వైద్య సిబ్బంది భయంతో  ముందుకు రాలేదు. మరి కొందరు గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు గైర్హాజరయ్యారు. అక్కాయపల్లి పీహెచ్‌సీలో ఎక్కువ శాతం భయంతోనే టీకాకు దూరంగా ఉన్నారు. ఎందరికో అవగాహన కల్పించాల్సిన రిమ్స్‌ జనరల్‌ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ పరిధిలోని 59 మంది టీకా వేయించుకోలేదు. పులివెందులలో 70 మంది టీకాకు గైర్హాజరు కాగా, వారిలో అత్యధిక శాతం భయం వల్లే రాలేదని, మరికొందరు సెలవులో వెళ్లారని వైద్యాధికారులు పేర్కొనడం కొసమెరుపు. మైదుకూరు, కల్లూరు పీహెచ్‌సీలోను ఇదే పరిస్థితి ఉంది. బద్వేల్‌, పోరుమామిళ్లల్లో సాయంత్రం 5 గంటలకు కూడా కనీస టార్గెట్‌ రీచ్‌ కాకపోవడంతో ఆ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ సాయికాంత్‌వర్మ టీకా టార్గెట్‌ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్‌లో కీలకమైన కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక సమస్యల వల్ల అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పెండ్లిమర్రి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీకా కార్యక్రమం మొదలైంది.


ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు

- డాక్టర్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి, తొలి టీకా వేయించుకున్న వ్యక్తి, రిమ్స్‌, కడప

కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తొలి టీకా వేయించుకోవడం నాకు ఆనందంగా ఉంది. నాకు ఎలాంటి చిన్న సమస్య కూడా తలెత్తలేదు. ధైర్యంగా టీకా వేయించుకోవచ్చు.


శాస్త్రవేత్తల సేవలు అభినందనీయం 

- డాక్టర్‌ షేక్‌ పర్వీన్‌, తొలి టీకా వేయించుకున్న మహిళ, రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, కడప

కడప రిమ్స్‌లో తొలి టీకా వేయించుకున్న మహిళగా ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వల్ల చాలా మంది చనిపోయారు. అలాంటి సమస్య ఏ ఒక్కరికి రాకూడదనే శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. ఏ ఆరోగ్య సమస్యలు రావు. ధైర్యంగా టీకా వేయించుకోవచ్చు.


కేంద్రాల వారీగా తొలిరోజు టీకా వేసుకున్న సంఖ్య

-------------------------------------------------------------------------

వ్యాక్సినేషన్‌ కేంద్రం గుర్తించినది వేయించుకున్నది

-------------------------------------------------------------------------

అక్కాయపల్లి పీహెచ్‌సీ 100 57

కడప రిమ్స్‌ 100 41

రాయచోటీ సీహెచ్‌సీ 100 59

దేవపట్ల పీహెచ్‌సీ 101 82

పులివెందుల ఏరియా ఆస్పత్రి 100 30

తాళ్లపల్లి పీహెచ్‌సీ 100 44

ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రి 100 57

కల్లూరు పీహెచ్‌సీ 100 68

జమ్మలమడుగు సీహెచ్‌సీ 100 73

ముద్దనూరు పీహెచ్‌సీ 100 70

మైదుకూరు సీహెచ్‌సీ 100 50

దువ్వూరు పీహెచ్‌సీ 100 87

బద్వేల్‌ సీహెచ్‌సీ 100 32

పోరుమామిళ్ల సీహెచ్‌సీ 100 43

రాజంపేట సీహెచ్‌సీ 100 45

నందలూరు పీహెచ్‌సీ 100 67

రైల్వేకోడూరు సీహెచ్‌సీ 100 42

పుల్లంపేట పీహెచ్‌సీ 100 87

చెన్నూరు సీహెచ్‌సీ 100 52

పెండ్లిమర్రి పీహెచ్‌సీ 100 61

-------------------------------------------------------------------------

మొత్తం 2001 1147

--------------------------------------------------------------------------


రండి బాబూ.. రండి..!

‘‘రండి బాబూ.. రండి.. రండమ్మా.. రండి..’’ అంటూ వైద్యాధికారులు వ్యాక్సినకోసం  అడుక్కోవాల్సి వచ్చింది. శనివారం మైదుకూరులో వంద మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 43 మంది మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు చాలా తక్కువమంది వచ్చారు. దీంతో రెండు గంటల నుంచి వైద్యాధికారులు మల్ల్లేష్‌, ఖదీర్‌అహ్మద్‌ లిస్టులో చూసి ఫోన్లు చేసి వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు రండి అంటూ పిలిచారు. కొందరు సాకులు చెబుతున్నారని గ్రహించి వ్యాక్సిన వేయించుకోకపోతే జిల్లా అధికారులు నోటీసులు ఇస్తారంటూ హెచ్చరించారు. రమ్మని బతిమాలారు. అయినా సాయంత్రం 5 గంటల వరకు కేవలం 43 మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

- మైదుకూరు


కరోనా సమయంలో

వారి సేవలు అభినందనీయం

డిప్యూటీ సీఎం

కడప (క్రైం), జనవరి 16: జిల్లాలో కరోనా సమయంలో ఫ్రంట్‌లైన వారియర్స్‌ సేవలు అభినందనీయమని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. జిల్లాలో మొదటి విడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన ప్రక్రియ శనివారం రిమ్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అత్యధికంగా కరోనా టెస్టులు చేయించి త్వరితగతిన కొవిడ్‌ వ్యాధిని గుర్తించడం జరిగిందన్నారు. వారందరికీ వ్యాధి నిరోధకత పెంచేలా పౌష్టికాహారాన్ని అందించి లక్షలాది మందిని వ్యాధి బారి నుండి కాపాడగలిగారన్నారు. కడప జిల్లాలో 55,340 పాజిటివ్‌ కేసులకు గాను 533 మంది ప్రాణాలు వదిలారని.. ఇది ఒక్కశాతం మాత్రమే అన్నారు. అనంతరం జిల్లా ఇనచార్జి కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ కొవిడ్‌ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యసిబ్బంది, పోలీసు, పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంతవర్మ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లకు ఈ వ్యాక్సినేషన వేయనున్నట్లు తెలిపారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఎలాంటి అపోహలు, భయాందోళనకు గురి కాకుండా నిరభ్యంతరంగా వ్యాక్సిన వేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కరోనాను ఎదుర్కోవాలన్నారు. అనంతరం అందరూ కలసి వ్యాక్సినేషన ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాన్ని రిబ్బన కట్‌ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప నగరపాలక కమిషనర్‌ లవన్న, డీఎంహెచవో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్‌ మల్లేశ్వరి, రిమ్స్‌ ఇనచార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నగేష్‌, అదనపు ఎస్పీ (పరిపాలన), వైద్యులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-17T05:29:47+05:30 IST