వ్యాక్సినేషన్ ప్రక్రియ తీవ్రంగా నిరాశపరిచింది: ఆంథోనీ ఫౌసీ

ABN , First Publish Date - 2021-01-02T01:02:19+05:30 IST

యుద్ధప్రాతిపదికన కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం.. మొదట అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడుతోంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియ తీవ్రంగా నిరాశపరిచింది: ఆంథోనీ ఫౌసీ

వాషింగ్టన్: యుద్ధప్రాతిపదికన కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం.. మొదట అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడుతోంది. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి ముందు డిసెంబర్ చివరి నాటికి రెండు కోట్ల మందికి మొదటి డోసు టీకా ఇవ్వడం పూర్తి చేస్తామని ప్రకటించిన ట్రంప్ యంత్రాంగం.. ఇప్పటివరకు కేవలం 2.8 మిలియన్ల మందికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇలా ట్రంప్ సర్కార్ వ్యాక్సినేషన్ పట్ల నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానం ద్వారా ఏళ్లుగా గడిచిన అమెరికన్లందరికీ టీకా అందడం కష్టమన్నారు. 


తాజాగా ఇదే విషయమై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ కూడా మండిపడ్డారు. అగ్రరాజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు డిసెంబర్ ఆఖరు వరకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి టీకా వేయడం పూర్తి చేస్తామని ప్రచారం చేసిన ట్రంప్ పరిపాలన విభాగం.. ఇప్పుడీ విషయంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) కొవిడ్ డేటా ట్రాకర్ ప్రకారం గురువారం నాటికి కేవలం 2.8 మిలియన్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందని.. ట్రంప్ యంత్రాంగం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే మరింత మంది అమెరికన్లు మహమ్మారికి బలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.   


ఇక అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు కోట్లకుపైగా మందికి ప్రబలిన వైరస్.. 3.54 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు ట్రంప్ సర్కార్ యుద్ధప్రాతిపదికన కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఫైజర్, మోడెర్నా టీకాలను అత్యవసర వినియోగానికి తెచ్చింది. కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2021-01-02T01:02:19+05:30 IST