కరోనా.. విలయం

ABN , First Publish Date - 2021-04-17T05:56:31+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే రోజుకు వెయ్యి మందికి వైరస్‌ వ్యాప్తి చెందే రోజు అతి దగ్గరలోనే ఉన్నట్లు స్పష్టమౌతోన్నది.

కరోనా.. విలయం

జిల్లాలో 735 మందికి పాజిటివ్‌ 

అత్యధికంగా గుంటూరులో 360 కేసులు

చిన్నఅరవపల్లిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి 

తెనాలిలో కరోనా బాధితులతో నిండిపోయిన వైద్యశాల

గుంటూరులో రెమ్‌డెసివిర్‌, ఫ్యాబిఫ్లూ మందులకు కొరత


జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొదటి విడత కంటే పెద్దఎత్తున వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వైద్యశాలల్లో బెడ్లు దొరక్క రోగులు అల్లాడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వైద్యశాలల్లో దోపిడీకి తెరలేస్తోంది. కరోనా చికిత్సలకు ఉపయోగించే మందులను బ్లాక్‌ చేసి మరీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందడంలేదు. ఇక పాజిటివ్‌తో తీవ్ర అస్వస్థతకు గురై మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో జిల్లాలో ఒక్క మృతి చూపగా క్షేత్రస్థాయిలో అధికారుల ప్రకటించిన మూడు మరణాల వరకు ఉన్నాయి. 


గుంటూరు/రేపల్లె, రాజుపాలెం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే రోజుకు వెయ్యి మందికి వైరస్‌ వ్యాప్తి చెందే రోజు అతి దగ్గరలోనే ఉన్నట్లు స్పష్టమౌతోన్నది. శుక్రవారం ఉదయం వరకు 5,825 శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా వాటిల్లో 735(12.62 శాతం) మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,820కి పెరిగింది. శుక్రవారం గుంటూరు నగరంలో అత్యధికంగా 360 మందికి వైరస్‌ సోకింది. తాడేపల్లిలో 48, మంగళగిరిలో 42, తెనాలిలో 24, పెదకాకానిలో 22, బాపట్లలో 21, నాదెండ్ల, ఈపూరు, యడ్లపాడు, రెంటచింతల, మాచవరం, తాడికొండ, ఫిరంగిపురం, క్రోసూరు, అచ్చంపేటలో రెండేసి, సత్తెనపల్లి, గుంటూరు రూరల్‌లో ఏడేసి, దుగ్గిరాల, కొల్లూరు, నగరం, దుర్గి, పెదకూరపాడు, మేడికొండూరులో నాలుగేసి, కాకుమాను, చెరుకుపల్లి, రొంపిచర్ల, శావల్యాపురం, నకరికల్లు, వెల్దుర్తి, బొల్లాపల్లి, ప్రత్తిపాడు, రాజుపాలెం, అమరావతి, ముప్పాళ్ల, పెదనందిపాడులో ఒక్కొక్కటి, మాచర్ల, కారంపూడి, తుళ్లూరు, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, భట్టిప్రోలులో ఆరేసి, నరసరావుపేట, వట్టిచెరుకూరులో 11 చొప్పున, దాచేపల్లి, గురజాలలో మూడేసి, పిడుగురాళ్లలో 12,  వేమూరు, కొల్లిపర, చిలకలూరిపేటలో ఐదేసి, వినుకొండలో 9, చేబ్రోలులో 10,  పొన్నూరులో 12, రేపల్లెలో 13, చుండూరులో 15 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.  రేపల్లె మండలంలోని చిన్నఅరవపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు పీహెచ్‌సీ వైద్యులు  కిరణ్‌ తెలిపారు. 25 ఏళ్ల మనవడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శుక్రవారం అతడి తాత(78) కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కరోనా తో రాజుపాలెం మండల కార్యాలయంలో ఓ అధికారి మృతి చెందినట్లు తహసీల్దారు  నగేష్‌ తెలిపారు. జ్వరంతో వారం రోజుల క్రితం సెలవు పెట్టిన ఈ అధికారి జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వవైద్యశాల్లో కరోనా పెసెంట్లతో ఆసుపత్రినిండిపోయింది. శుక్రవారం ముగ్గురిని డిశ్చార్జి చేయగా ఏడుగురిని చేర్చుకున్నారు. 225 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందారు. 


వాణిజ్య పన్నుల శాఖలో కలకలం

గుంటూరు జిన్నాటవర్‌ సెంటర్‌లోని వాణిజ్యపన్నులశాఖ భవనంలో ఇద్దరు అధికారులకు కరోనా సోకింది. దాంతో అధికారులు, ఉద్యోగుల్లో టెన్షన్‌ నెలకొన్నది. అలానే అదే శాఖలో పిడుగురాళ్ళ, చిలకలూరిపేట సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు సమాచారం. దాంతో ఉద్యోగులు విధులకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. 


విద్యుత్‌శాఖ కార్యాలయాల్లో ఆంక్షలు

గుంటూరు: కరోనా ఉధృతి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ కార్యాలయాల్లోకి ఉద్యోగులు తప్ప ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదని గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ మురళీమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్ల కోసం కార్యాలయాల బయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగుల వివరాలను సంబంధిత సెక్షన్‌ అధికారులకు సమాచారం అందించాలన్నారు.


12 మంది గురుకుల విద్యార్థులకు కరోనా 

చుండూరు: చుండూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 12 మందికి కరోనా సోకినట్లు  వైద్యాధికారి డాక్టర్‌ రమ్య తెలిపారు. గురువారం గురుకులంలోని 350 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలిందన్నారు. వాచ్‌మన్‌కి కరోనా వచ్చినట్లు ప్రిన్సిపాల్‌ కె.రమేష్‌బాబు తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించామని 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


 మందుల బ్లాక్‌

గుంటూరు(సంగడిగుంట): మూడు రోజుల వ్యవధిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదే అవకాశంగా వ్యాపారులు కరోనా మందులను బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అవి కూడా తెలిసిన వారికి మాత్రమే అందుతున్నాయి. కరోనా నియంత్రణలో ప్రధానపాత్ర పోషిస్తున్న మాస్కులు, శానిటైజర్లకు శుక్రవారం జిల్లాలో డిమాండ్‌ అధికమైంది. సర్జికల్‌ మాస్కులను శుక్రవారం 50 శాతం వరకు పెంచి విక్రయించారు. కరోనా తొలిదశ నివారణకు వినియోగించే ఫ్యాబిఫ్లూ ఒక షీటు రూ.1200కు విక్రయిస్తుండేవారు. ప్రస్తుతం దీనిని ఇష్టం వచ్చిన ధరకు విక్రయించడం మొదలుపెట్టారు. కరోనా వైద్యశాలల్లో రూ.2 వేలకు అందిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ రోజుకు ఒకటి చొప్పున కరోనా సోకిన వ్యక్తికి ఆరు రోజుల పాటు కోర్సుగా ఇవ్వాలి. అయితే దీని కొరత మూడు రోజుల్లో తీవ్రమైంది. సాధారణ రోజుల్లో ఈ ఇంజక్షన్‌ ఒక్కటి రూ.3,200కు లభ్యమయ్యేది. గురు, శుక్రవారాల్లో  దీని ధర రూ.8 వేలు పలికినా స్టాకు లేదు. ఈ ఇంజక్షన్‌ ఉత్పత్తి చేసే కంపెనీ హెటిరోల్యాబ్‌ కరోనా సోకిన వ్యక్తి ఆధార్‌ కార్డు, ఆర్‌టీసీపీఆర్‌ సర్టిఫికెట్లు ఉంటే ఒక్కొక్కరికి ఆరు డోసులు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు అన్ని ఆసుపత్రులకు సమాచారం పంపారు. ఉదయం 10  నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంతకం, స్టాంపుతో కూడిన డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌, రూ.32,004 నగదుతో విజయవాడ గాంధీనగర్‌, నాగేశ్వరరావు పంతులు రోడ్డు, డోరు నెం 26-3-126, సెకండ్‌ ఫ్లోర్‌ అనే చిరునామాకు వస్తే ఇంజక్షన్లు ఇస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు 0866-6615811 నెంబర్‌లో సంప్రదించాలని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.   


రెమ్‌డెసివిర్‌ రూ.2,500కే విక్రయించాలి

కరోనా బాధితులకు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వినియోగిస్తోన్న రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ 100 ఎంజీకి రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఇంజక్షన్‌కి ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ షాప్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు ఏ మేరకు అమలు జరుగుతాయోనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   


ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే

19 నుంచి దుకాణాల పని వేళల కుదింపు


గుంటూరు, ఏప్రిల్‌ 16: జిల్లాలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 19 నుంచి వ్యాపార సంస్థల పనివేళలను కుదిస్తున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. గుంటూరు జిన్నాటవర్‌ సెంటర్‌లోని చాంబర్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార దుకాణాలన్నీ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. మెడికల్‌ షాపులు, హోటల్స్‌, సినిమా హాల్స్‌ మినహా ఇతర దుకాణాలన్నింటికీ ఈ వేళలు వర్తిస్తాయన్నారు. వ్యాపార సంఘాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నో మాస్క్‌.. నో సేల్‌ విధానాన్ని వ్యాపారులంతా పక్కాగా అమలు చేయాలన్నారు. శానిటైజర్స్‌ వినియోగించటం, దుకాణాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని, తద్వారా వ్యాపారులు తమను తాము రక్షించుకోవటంతో పాటు వినియోగదారులకు కూడా రక్షణ కల్పించినట్లువుతుందన్నారు. సమావేశంలో సభ్యులు అన్నా పూర్ణచంద్రరావు, టీఎల్‌వీ వీరాంజనేయులు, ఆతుకూరి నగేష్‌, హనుమంతరావు ఉన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలో వ్యాపారసంస్థలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని మంగళగిరి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయం తీసుకుంది.  


నేటి నుంచి నరసరావుపేటలో సేవలు

ఆంద్రజ్యోతి వార్తకు స్పందించిన అధికారులు


నరసరావుపేట: ఎట్టకేలకు నరసరావుపేట లింగంగుంట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం నుంచి కరోనా వైద్య సేవలను ప్రారంభిస్తున్నారు. కొవిడ్‌ ఆస్పత్రి మూత అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వెలవడిన కథనంపై యంత్రాంగం స్పందించింది.   160 పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సౌకర్యంతో కరోనా రోగులకు ఇక్కడ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ వైద్యశాలను ప్రారంభించడానికి అన్ని అనుమతులు మంజూరయ్యాయని ఎమ్యెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఆరుగురు డాక్టర్లు, సహాయక సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉంటారని చెప్పారు.  


   

Updated Date - 2021-04-17T05:56:31+05:30 IST