Advertisement

కరోనా.. పంజా

Apr 22 2021 @ 00:38AM
శవ దహనాలతో గుంటూరులోని బొంగరాలబీడు శ్మశానవాటిక

ఆస్పత్రుల్లో చికిత్సకు బెడ్లు నిల్‌

అంతిమ సంస్కారాలకు శ్మశానాలు ఫుల్‌

కేసులతోపాటు పెరుగుతోన్న కొవిడ్‌  మరణాలు

హెల్త్‌ బులిటెన్‌ లెక్కల్లో ఒకటి రెండు మరణాలే

జిల్లాలో కొవిడ్‌ బాధితుల గోడు అరణ్య రోదనే

అంత్యక్రియలకు ముందుకొస్తున్న చారిటబుల్‌ ట్రస్టులు


కరోనా పంజా విసురుతోంది. కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొవిడ్‌ మహమ్మారి జిల్లాలో విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు ఇంచుమించు వెయ్యి మందికిపైగా  కొత్తగా కరోనా బారిన పడుతుండగా మరణాల సంఖ్య వందల్లో ఉంటున్నాయి. అయితే అధికారిక లెక్కల్లో మాత్రం ఒకటీ లేదా రెండు మాత్రమే చూపుతున్నారు. గుంటూరు బొంగరాలబీడు శ్మశానవాటిక కరోనా మృతదేహాలతో నిండిపోతోంది. ఇక పాజిటివ్‌ బాధితులు చికిత్సల కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో బెడ్లు లేక.. ప్రైవేటు దోపిడీని తట్టుకోలేక ఏమి చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. ఫోన్‌ చేసిన మూడు గంటల్లో బెడ్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పినా.. గంటల్లో కాదుకదా! కనీసం మూడు రోజులైనా ఆసుపత్రుల్లో బెడ్‌ దొరకటం ప్రహసనమే. ఆరోగ్యశ్రీ కార్డుతో కరోనా చికిత్స కోసం వెళితే చేర్చుకునేవారే లేరు. వైద్యం అందక చివరకు మృత్యు ఒడికి చేరుతుంటే, చనిపోయాక అంతిమ సంస్కారాలకూ కష్టాలు తప్పని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గుంటూరు, తెనాలి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైద్యం అందక చనిపోయారంటే ఒప్పుకోరు.. ఆస్పత్రిలో చేర్చుకోండి అని ప్రాథేయ పడితే ఖాళీ లేదనే సమాధానం మినహా వైద్యం అందించేవారూ లేరు. వైద్యం అందక మరణించటం ఒక శాపమైతే, చివరకు అంతిమ సంస్కారాలకు చోటులేక శ్మశానాలు నిండిపోవటం మరో దారుణ పరిస్థితి. పేదలకు కొవిడ్‌ చికిత్స కష్టంగా మారిపోయింది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కొందరైతే, ప్రైవేటు వైద్యశాలల్లో కేవలం సిటీ స్కాన్‌ సాయంతో వైద్యం తీసుకుంటున్నవారున్నారు. జిల్లాలో కరోనా రెండో విడత దాడి తీవ్రంగా ఉంటోన్నది. గత కొద్ది రోజుల నుంచి మృతుల సంఖ్య పెరుగుతోన్నది. కొవిడ్‌ సోకిన వారు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడుస్తోన్నారు. మృతుల్లో అన్ని వయస్సుల వారు ఉంటున్నారు. బుధవారం కొల్లిపరకు చెందిన నాగబాబు అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఊపిరి అందని స్థితిలో తెనాలిలోని వైద్యశాలల్లో వైద్యం కోసం ప్రయత్నం చేస్తే ఖాళీలు లేవని చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో గుంటూరు, విజయవాడ నగరాల్లోని ఆస్పత్రులు తిరిగితే చివరకు విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యులు కనికరించారు. అప్పటికే అతడి పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది. తెనాలికి చెందిన ఎస్‌.కె.రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో గుంటూరులోని అన్ని ప్రైవేటు కొవిడ్‌ వైద్యశాలలు తిరిగారు.  ఎంత ఖర్చయినా భరిస్తానని వేడుకున్నా బెడ్‌లు లేవని వెనక్కు పంపేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా బెడ్‌ దొరక్క, వైద్యం ఆలస్యమై చివరకు చేసేదిలేక అనధికారికంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు వైద్యశాల నిర్వాహకులను వేడుకుంటే రూ.2 లక్షలు ముందుగా తీసుకుని చేర్చుకున్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళితే అసుపత్రి మెట్లుకూడా ఎక్కనివ్వటం లేదని, చివరకు అప్పుచేసి డబ్బుతెచ్చి కొంత కడితే చేర్చుకున్నారని కొల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. 


మృతులన్నీ ఏ లెక్కలోవో

జిల్లాలో కరోనా ప్రభావం పెరగటం, ఆరోగ్య పరిస్థితి విషమించటం వల్ల చనిపోతున్నవారికంటే ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీలు లేక, ఉన్నా వైద్యం అందక చనిపోతున్నవారే ఎక్కువుగా ఉన్నారు.  లెక్కలో ఉండి కూడా కరోనాతో మరణించిన వారి లెక్కలు మాత్రం విచిత్రంగా చూపుతున్నారు. ఇద్దరు, ముగ్గురు చనిపోతే అసలు మరణాలే లేవని చూపుతున్నారు. ఒకే పట్టణంలో పదిమందికిపైగా ఒకేరోజు చనిపోతే, జిల్లాలో ఆ రోజు కేవలం ఒకరు, లేక ఇద్దరు చనిపోయారని లెక్కలు చూపారు. ఈ లెక్కలన్నీ ఏమైపోతున్నాయో, మరణించినవారి లెక్క ఏ ఖాతాలోకి చేరుతుందో అంతుబట్టని విషయం. మంగళవారం కొల్లూరు మండలంలో ఇద్దరు చనిపోతే ఆ రోజు అసలు ఒక్క మరణంకూడా చూపలేదుజ బుధవారం ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలు మరణిస్తే ఆమె లెక్కకూడా లేదు. తెనాలిలో మూడు శ్మశానాల్లోనే ఒకరోజే 14 శవాలకు దహన సంస్కారాలు చేశారు.   ఒకే రోజు గుంటూరు బొంగరాలబీడు శ్మశానంలో 40కి పైగా శవాలకు దహనసంస్కారాలు చేశారు. గుంటూరులో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈ రోజు తమ కాలనీలో ఒకరిద్దరు కరోనాతో మరణించారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం ఒక్క మరణాన్ని మాత్రమే ప్రకటిస్తోన్నది. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు గత వారం, పది రోజుల్లో అంత్యక్రియలు నిర్వహించిన సంఘటనలు వందకు పైగానే ఉన్నాయి. మంగళవారమే బొంగరాలబీడు శ్మశానవాటికలో 45 మృతదేహాలు ఖననం చేసినట్లు సమాచారం. రెండు రోజుల్లో బ్రాడీపేట, ఏటీఅగ్రహారంలో ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నాయి. అలానే కోర్టులో పని చేసే ఒక కారు డ్రైవర్‌(35) కూడా కరోనా సోకి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ ముగ్గురు ఉద్యోగులు కరోనాతో చనిపోయినట్లు అక్కడి ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అలానే మంగళగిరి, తాడేపల్లిలోనూ నిత్యం కరోనా బాధితుల మరణాలు నమోదు అవుతోన్నాయి. అయితే అధికారిక గణాంకాల్లో మాత్రం వాటిని చేర్చడం లేదు. సహజ మరణాలుగా ముద్ర వేసేసి అంత్యక్రియలు జరిపిస్తోన్నారు. గత ఏడాది కూడా ఇదే తంతు కొనసాగింది. అప్పట్లో ఓ స్వచ్ఛంద సంస్థ 470కి పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే జిల్లా యంత్రాంగం కేవలం 65 మాత్రమే అధికారికంగా లెక్కల్లో చూపించింది. ఇలా మరణాలు దాచేయడం వల్ల కూడా ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోన్నది.  జిల్లా మొత్తం మీద కేవలం ఇద్దరే మరణించినట్టు లెక్కల్లో చూపుతుండటంతో మరి మిగిలిన మృతులన్నీ ఏ లెక్కలోవో అధికారులే చెప్పాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

అప్రమత్తంగా ఉండండి...

డిప్యూటీ స్పీకర్‌ కోన మైక్‌ ప్రచారం 


బాపట్ల: కరోనా వైరస్‌ ప్రభలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి.. కరోనా నిబంధనలు పాటించండి.. అంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మైక్‌ పట్టి ప్రచారం చేపడుతున్నారు. బాపట్లలో ఆయన బుధవారం ప్రత్యేక వాహనానికి మైక్‌ సెట్‌ ఏర్పాటు చేసి వీధుల్లో ప్రచారం చేపట్టారు.  పట్టణంలోని పలువార్డులలో ప్రచారం నిర్వహించిన ఆయన పాతబస్టాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు తదితరులు పాల్గొన్నారు.


నామ్‌కేవాస్తిగా.. నోడల్‌ అధికారులు

కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే బెడ్లు ఖాళీ లేవు. ఇక ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తే పట్టించుకునే వారులేరు. దీంతో ఒక్కో కొవిడ్‌ ఆస్పత్రికి కేటాయించిన నోడల్‌ అధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితి విషమిస్తుంది.. చికిత్సకు బెడ్‌ ఇప్పించండి సార్‌ అని వేడుకున్నా వారి దగ్గర నుంచి నిరాశే మిగులుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మా మాట వినేవారే లేరు.. ఏదో నామకేవాస్తిగా ఉన్నాం.. మీరే ప్రయత్నం చేసుకోవడం మంచిదని వారు ఉచిత సలహా ఇస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు ఉచితంగా కరోనా వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించినా ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళితే ఆస్పత్రి మెట్లుకూడా ఎక్కనివ్వటం లేదనే ఆరోపణలున్నాయి.  కొల్లూరులో మంళవారం రాత్రి తహసీల్దారు కార్యాలయానికి ఎదురుగా ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో ఉందని   అధికారులకు స్థానికులు సమాచారం అందించినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఆమె బుధవారం తెల్లవారుజామున వైద్యం అందక మరణించారు. అయితే ఆమె దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. తెనాలి నుంచి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవాసమితి, చినరావూరు సభ్యులు వచ్చి ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. విభాగాల వారీగా కలెక్టర్‌ మంగళవారం నోడల్‌ అధికారులను నియమించారు. వీరు ఏమి పర్యవేక్షిస్తున్నారో ఎవరికీ తెలియడంలేదు.


చిన్నారుల కోసం కేర్‌ సెంటర్‌

అడవితక్కెళ్లపాడులో ప్రారంభించిన కలెక్టర్‌


గుంటూరు(తూర్పు): కొవిడ్‌ బారిన పడిన 5 నుంచి 15 ఏళ్ల  మధ్య వయస్సుగల వారికి చికిత్స అందించేందుకు అడవితక్కెళ్ళపాడులోని టిడ్కో గృహసముదాయంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేర్‌ సెంటర్‌ను బుధవారం కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రారంభించారు. ఇక్కడ 100 పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం సమీపంలోని ట్రైఏజ్‌ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, గుంటూరు నగర కమిషనర్‌ అనురాధ, డీఎంహెచ్‌వో యాస్మిన్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, జిల్లా పరిశ్రమల శాఖ జీఎమ్‌ పటేల్‌, నోడల్‌ అధికారి టాండన్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనా ఎట్‌ 1,236

పాజిటివ్‌ రేట్‌ 15.50 శాతం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లా నలుమూలలకు వ్యాపించేసింది. జిల్లాలో కొత్తగా 1,236 మందికి వైరస్‌ సోకింది. బుధవారం ఉదయం వరకు 7,972 శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా పాజిటివ్‌ రేట్‌ 15.50 శాతంగా నమోదైంది. గుంటూరు నగరంలో అత్యధికంగా 547 కేసులు నమోదయ్యాయి. మొత్తం 99 కాలనీల్లో బుధవారం కొత్త కేసులు వెలుగు చూశాయి. మంగళగిరిలో 117, తాడేపల్లిలో 93, నరసరావుపేటలో 86, తెనాలిలో 74, గుంటూరు రూరల్‌లో 19, ప్రత్తిపాడులో 14, సత్తెనపల్లిలో 18, తుళ్లూరులో 24, చిలకలూరిపేటలో 17, పెదకాకాని, బాపట్ల, చేబ్రోలులో 12 చొప్పున, కొల్లిపర, రేపల్లెలో 11 చొప్పున, పిడుగురాళ్ల, చుండూరులో పదేసి, మిగిలిన మండలాల్లో ఒక అంకెలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో బుధవారం దుగ్గిరాల మండలం మోరంపూడికి చెందిన 71 ఏళ్ల పురుషుడు, తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన 61 ఏళ్ల మహిళ చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. యాక్టివ్‌ కేసులు 6,354కి పెరిగాయి. బుధవారం 600 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే నరసరావుపేట కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరు నకరికల్లు మండలానికి చెందని వారని తెలిపారు. బెల్లంకొండ బుడగజంగాల కాలనీలో కరోనాతో ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు సర్పంచ్‌ గడ్డిపర్తి జ్యోతిసముద్రం తెలిపారు.   


జేసీ దినేష్‌కుమార్‌ దంపతులకు కరోన

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ, రైతుభరోస) ఏఎస్‌ దినేష్‌కుమార్‌కి కరోనా సోకింది. ఆయన  15 రోజుల నుంచి సెలవుపై తమిళనాడులోని స్వస్థలంలో ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైరస్‌ సోకింది. ఆయన సతీమణి, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ విజయకి కూడా వైరస్‌ సోకినట్లు అధికారవర్గాలు తెలిపాయి.   


జిల్లా కోర్టులో కలకలం

గుంటూరు(లీగల్‌): గుంటూరులోని జిల్లా కోర్టులో 12 మంది ఉద్యోగులకు, ముగ్గురు జడ్జిలు, 30 మందికి పైగా న్యాయవాదులు, ఇద్దరు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది కోర్టుకు వచ్చేందుకు భయపడుతున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ కోర్టు అసిస్టెంట్‌ నాజర్‌(ప్రొటోకాల్‌) రవికుమార్‌ బుధవారం ఉదయం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో మృతి చెందడంతో ఉద్యోగ వర్గాల్లో కలకలం రేగింది. రెండో డోసు వ్యాక్సిన్‌ వేయడానికి, కొత్తగా వేయించుకునే వారికి వ్యాక్సినేషన్‌ శిబిరం ఏర్పాటు చేయాలని బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని న్యాయవాదులు కోరుతున్నారు.


లక్ష దాటిన కేసులు

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు లక్ష దాటిపోయాయి. బుధవారం ఉదయానికి 1,01,749కి కేసుల సంఖ్య చేరింది. రెండు నెలల క్రితం వరకు 77 వేల మంది వైరస్‌ బారిన పడగా మార్చి నెల నుంచి సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడంతో వైరస్‌ వేగవంతంగా వ్యాప్తి చెంది లక్ష దాటేసింది. ఈ నెలలో కేవలం 21 రోజుల వ్యవధిలోనే 11,994 కేసులు నమోదయ్యాయి. ఽప్రధానంగా గుంటూరు నగరంలో ఇప్పటివరకు 27,965, మంగళగిరిలో 2,976, నరసరావుపేటలో 4,700, తాడేపల్లిలో 2,571, తెనాలిలో 4,930 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సెకండ్‌ వేవ్‌ వైరస్‌ వ్యాప్తి ఇదేరీతిన మరో మూడు, నాలుగు నెలలు కొనసాగితే కరోన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిపోయే అవకాశం లేకపోలేదు.


పక్కాగా జరగని ట్రేసింగ్‌

జిల్లాలో వైరస్‌ వ్యాప్తి వేగవంతంగా జరుగుతోండటానికి ప్రధాన కారణం కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ పక్కాగా జరగకపోతుండటమేననే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఒక కేసు వస్తే ప్రైమరీ, సెకండరీ కలిపి మొత్తం 60కి పైగా కాంటాక్ట్స్‌ని ట్రేసింగ్‌ చేసి వారిని క్వారంటైన్‌కు తరలించే వారు. అక్కడ కరోనా టెస్టులు చేసి రెండు సార్లు నెగిటివ్‌ వచ్చిన తర్వాతనే ఇళ్లకు పంపించే వారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి అసలు కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ మానేశారు. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్నా  కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ పరిమితంగానే చేస్తున్నారు. ఇప్పటివరకు 3,18,958 ప్రైమరీ, 3,31,671 సెకండరీ కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పాజిటివ్‌ కేసుకి సగటున 3.13 ప్రైమరీ, 3.26 సెకండరీ కాంటాక్ట్స్‌ని ట్రేసింగ్‌ చేశారు. 


నేటి నుంచి రెండో డోస్‌ : జేసీ ప్రశాంతి

గుంటూరు(తూర్పు), ఏప్రిల్‌ 21: కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న వారికి గురువారం నుంచి రెండో డోస్‌ వేయడం జరుగుతుందని జేసీ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రాఽథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌సెంటర్లు, గుంటూరులోని జీజీహెచ్‌లో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.