ప్రాణసంకటం!

May 8 2021 @ 00:00AM

రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ సరఫరాకు ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి

ఆ టెస్టుల ఫలితాలు వచ్చేందుకు తీవ్ర ఆలస్యం

ర్యాపిడ్‌, సిటీ స్కాన్‌ నిర్ధారిత బాధితులకు అందని ఆక్సిజన్‌

లక్షణాలు ఉంటే చాలు.. వైద్యం చేయాలంటూ కేంద్ర తాజా ప్రకటన

ఇప్పటికైనా అందరికీ వైద్యం అందేనా..? 


కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కొరత ప్రాణసంకటంగా మారింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఆ రిపోర్టు వచ్చినవారికే ఆక్సిజన్‌ అందిస్తుండడంతో మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారంతా ఆక్సిజన్‌ కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దొరికిన చోట చేపలకు పెట్టే ఆక్సిజన్‌ కూడా తెచ్చుకొంటున్నారు. కాగా తాజాగా జిల్లాలో  1,663 కరోనా కేసులు నమోదయ్యాయి. 19.85 శాతానికి పాజిటివ్‌ రేటు పెరిగింది. 

 

గుంటూరు(సంగడిగుంట), మే 8: కరోనా బాధితులందరికీ ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు అందని ద్రాక్షలా ఉన్నాయి. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు ద్వారా నిర్ధారించబడి ప్రభుత్వ, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అందరికీ ప్రభుత్వం ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ అందిస్తోంది. దీనికోసం ఓ నోడల్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింద. కానీ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు ఫలితం ఆలస్యం కావడం సమస్యగా పరిణమించింది. లక్షణాలు ఉండి ఆ టెస్టు చేయించుకుని రిజల్ట్‌ రావాలంటే మూడురోజుల పైనే పడుతుంది. దీంతో చాలామంది ర్యాపిడ్‌ టెస్టు, సిటి స్కాన్‌ చేయించుకుని ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.  కానీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ధారించిన రోగులకు మాత్రమే పై రెండు అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో 40 శాతం మంది వైద్యశాలల్లో, మిగిలిన 60 శాతం మంది ఇంటి వద్ద లేదా అనుమతులు లేని వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ఆక్సిజన్‌ దినదిన గండంగా మారింది. ప్రతి రోజూ ఆక్సిజన్‌ కోసం వెతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా తెచ్చుకోండి లేదంటే ఖాళీ చేయండి ఇది ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్న మాట. దీంతో కరోనా బాధితులతో పాటు రోగులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా ఒక్క సిలిండర్‌ ఇప్పించమంటూ ప్రాథేయపడుతున్నారు. రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్‌ది ఇదే పరిస్థితి. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు లేకుండానే అనేకమంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారికి ఈ ఇంజక్షన్‌ బ్లాకులో కొనుక్కోక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు లక్షణాలు ఉంటే చాలు.. ఆర్‌టీపీసీఆర్‌ ఫలితం లేకపోయినా చికిత్స చేయండి అంటూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి మరి..!


కొత్తగా 1,663 కరోనా కేసులు

19.85 శాతానికి పెరిగిన పాజిటివ్‌ రేటు

ఒకే రోజున అధికారికంగా 10 మంది మృతి


గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిపై ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ ప్రభావం కనిపించడం లేదు. ఇంకా పెరుగుతోంది. శనివారం ఉదయం 8,377 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులోనే 1,663 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ జరిగింది. పాజిటివ్‌ రేటు 19.85 శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యాక్టివ్‌ కేసులు 17,627కి పెరిగాయి. అయితే శనివారం 2,040 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కావడం ఒక్కటే కొంత ఊరటనిచ్చేదిగా ఉన్నది. అయితే గత ఎనిమిది నెలల్లో లేని విధంగా ఒకే రోజున 10 మంది కోవిడ్‌తో చనిపోవడం విషాదాన్ని నింపుతోంది. నగరంలోని నల్లచెరువుకు చెందిన 50 ఏళ్ల పురుషుడు, సంపత్‌నగర్‌లో వృద్ధురాలు, ఎల్‌ఆర్‌ కాలనీలో వృద్ధుడు, గోరంట్లలో 48 ఏళ్ల మహిళ, యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెంలో 50 ఏళ్ల మహిళ, వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడులో 50 ఏళ్ల మహిళ, ముట్లూరులో 43 ఏళ్ల పురుషుడు, తాడేపల్లి మండలంలోని కొలనుకొండలో వృద్ధురాలు, మంగళగిరి మండలంలోని చినకాకానిలో వృద్ధుడు, గురజాల మండలంలోని ఆర్‌ఎంబీ బంగ్లా వద్ద 26 ఏళ్ల యువకుడు కరోన కాటుకు బలైపోయారు.


నేడు కూడా వ్యాక్సినేషన్‌కి సెలవు

వ్యాక్సిన్‌ డోస్‌లు అయిపోవడంతో శని, ఆదివారంలు జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కి సెలవు ప్రకటించారు. తొలుత మళ్లీ వ్యాక్సినేషన్‌ ఎప్పుడు ప్రారంభిస్తామనే సమాచారాన్ని అధికారులు చెప్పకుండా తర్వాత తెలియజేస్తామన్నారు. దీనిపై వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు శనివారం ఉదయం టోకెన్లు ఇస్తామని శుక్రవారం చెప్పారని, తీరా వచ్చిన తర్వాత సెలవు అని చెబుతున్నారని మండిపడ్డారు. కాసేపటి తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ సోమవారం తిరిగి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని చెప్పడంతో వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద వేచి ఉన్న వారంతా వెనుదిరిగారు.


చేపలకు పెట్టే ఆక్సిజన్‌ కూడా తెచ్చుకొంటున్నారు

ఆక్సీజన్‌ కొరత కరోనా బాధితుల పాలిట యమగండంగా మారింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న ఆక్సీజన్‌ సిలిండర్లు కనీసం ఒక్క పూట కూడా రోగులకు అక్కరకు రావడం లేదు. ఏ అర్ధరాత్రికో సిలిండర్లు వస్తుండగా అవి వినియోగం ప్రారంభించిన ఆరు నుంచి 8 గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. దాంతో ఆక్సిజన్‌ అవసరం ఉన్న బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నది. కొంతమంది రూ.90 వేలు పెట్టి ఆక్సిజన్‌ సిలిండర్‌ని కొనుగోలు చేసి ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. వాటికి జోడించే పరికరాలు సాధారణ రోజుల్లో రూ.వెయ్యి లోపే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రూ.15 వేలకు పెంచేశారు. అలానే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు రూ.95 వేలకు విక్రయిస్తామని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. కాగా ప్రతీ ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలకు చేపల విక్రయందారులు ఆటోలలో బతికున్న చేపలను తీసుకొని వస్తారు. ఆటో వెనకభాగంలో నీళ్లు నింపి అందులో సిలిండర్‌ ద్వారా ఆక్సిజన్‌ పెడుతుంటారు. ఇప్పుడు ఆ సిలిండర్లను కూడా కరోనా బాధితులకు తీసుకొచ్చి పెడుతున్నారు. తెనాలి, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం తదితర ప్రాంతాల నుంచి ఆక్సీజన్‌ సిలిండర్లను తెస్తున్నారు.


కరోనా లక్షణాలతో ఎంఈవో మృతి 

 యడ్లపాడు మండల విద్యాశాఖాధికారి పిల్లి డేవిడ్‌రత్నం(60) కొవిడ్‌ లక్షణాలతో గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్న ఆయన ఉపాధ్యాయుడిగా, హెచ్‌ఎంగా, ఎంఈవోగా 35 సంవత్సరాలకు పైగా సేవలు అందించారు. ఎంఈవో మృతి పట్ల చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావులు సంతాపాన్ని తెలిపారు. అదేవిధంగా  పిడుగురాళ్ల లోని అయ్యప్పస్వామి దేవాలయ అధ్యక్షుడు మలిపెద్ది సత్యనారాయణ దంపతులు ఒకరోజు వ్యవధిలో కొవిడ్‌ లక్షణాలతో మృతి చెందారు. చిలకలూరిపేట మండలం మురికిపూడి-2 ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న పట్టణంలోని రాగన్నపాలెంకు చెందిన చింతపల్లి శ్రీదేవి(41) శనివారం కరోనాతో మృతి చెందారు. ఆమె నెల కిందట రెండో డోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆమె స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి కన్నుమూసింది. మంగళగిరిలో పేరొందిన న్యూకెనడీ విద్యాసంస్థ యాజమాన్య దంపతులు దాసరి అశ్వనీకుమార్‌ దత్తు(59) కరోనాతో పోరాడుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. అంతకుముందు ఆయన భార్య సోఫీదత్తు (54) మూడు రోజుల కిందటే కరోనా లక్షనాలతో మృత్యువాత పడ్డారు. 


కాంటాక్ట్స్‌పై కన్నేదీ..?

ఫస్టు వేవ్‌లో పోలీసు శాఖ భాగస్వామ్యం

నేడు మొక్కుబడిగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే తంతు

సగటున ముగ్గురినే గుర్తిస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతం


గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ లోపభూయిష్టంగా మారింది. అసలు కాంటాక్ట్స్‌ని గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించి హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారో, లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. సగటున ముగ్గురు కాంటాక్ట్స్‌ని గుర్తిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీని వలన వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసే పరిస్థితి లేదనన్నది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది అయితే కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ బాధ్యత పోలీసు శాఖ చూసుకొంది. ఆ శాఖలో లోతుగా విచారణ జరిపే స్వభావం అధికారులు, సిబ్బంది ఉండటం వలన కరోనా పాజిటివ్‌ వ్యక్తి కాంటాక్ట్స్‌ అందరిని గుర్తించి ఐసోలేషన్‌/ క్వారంటైన్‌ చేయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 

 సహజంగా ఏ వ్యక్తి శరీరంలోకి అయినా వైరస్‌ ప్రవేశిస్తే దాని లక్షణాలు బయట పడటానికి కొంత సమయం పడుతోంది. కొందరిలో అయితే మైల్డ్‌గా వచ్చి పోతున్నాయి. దీంతో వారంతా తమకు సాధారణ జ్వరం వచ్చిందన్న భావనతో ఎంతోమందితో కాంటాక్ట్‌ అవుతున్నారు. దీని వలన వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందుతోన్నది. తీరా వారం, పది రోజులు అయినా జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు తగ్గకపోతే అప్పుడు కరోనా టెస్టులు చేయించుకొంటున్నారు. దీని వలన జరగాల్సిన వ్యాప్తి అప్పటికే జరిగిపోతోంది. ఇది కూడా జిల్లాలో కేసులు తగ్గకపోవడానికి ఒక కారణంగా వైద్య వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

ఫస్టు వేవ్‌లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఎవరైనా మందుల షాపు వద్దకు వచ్చినా వారి వివరాలు తీసుకోకుండా ఔషధాలు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలానే వలంటీర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే ఒకటికి రెండుసార్లు చేయించారు. చుట్టుపక్కల ఎవరైనా అస్వస్థతతో ఉంటే వెంటనే ఆ సమాచారం తమకు చేరవేయాలని టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇక ఎవరికైనా వైరస్‌ నిర్ధారణ అయితే పోలీసు అధికారులు రంగంలోకి దిగేవారు. ముందు ఫోన్‌ ద్వారా ఆ వ్యక్తి ఎక్కడెక్కడ సంచరించింది, ఎవరెవరని కలుసుకొన్నది వంటి వివరాలన్ని సేకరించి కాంటాక్ట్స్‌ జాబితా సిద్ధం చేసి మొత్తాన్ని హోం ఐసోలేషన్‌/ క్వారంటైన్‌కు తరలించేవారు. సీఐలు, ఎస్‌ఐలు కూడా కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌లో పాలుపంచుకొనేవారు. కుటుంబ సభ్యుల మొత్తాన్ని సమీపంలోని హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లి టెస్టులు చేయించేవారు. ఇలాంటి చర్యల వలన వైరస్‌ వ్యాప్తి అప్పట్లో అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఆ విధానాలను అవలంభించకపోవడంతో వైరస్‌ అదుపులోకి రావడం లేదు. 


 

వద్దన్నా వినరు..!

కొవిడ్‌ ఆస్పత్రులకు యథేచ్ఛగా రోగుల సహాయకులు

ఐసీయూ, రూంలలో సంచారం

ఏమాత్రం అడ్డు చెప్పని ఆస్పత్రుల యాజమాన్యాలు

వారికి, వాళ్ల ద్వారా ఇతరులకు కూడా వైరస్‌ సోకే ముప్పు


గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ సోకిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స ఇప్పించేందుకు తీసుకొస్తున్న సహాయకులు ఆయా హాస్పిటల్స్‌లోనే ఉండిపోతున్నారు. పీపీఈ కిట్‌ ధరించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం మాస్కు ధరించి కొవిడ్‌ రోగుల సేవలో ఉంటున్నారు. స్కానింగ్‌ల కోసం ల్యాబ్‌లకు, కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బాత్‌రూంలకు తీసుకెళుతున్నారు. కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ, రూంలలోకి వెళ్లి పరామర్శిస్తున్నారు. సహాయకులు ఇద్దరు, ముగ్గురు డ్యూటీలు వేసుకొని ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. దీని వలన వారికి వైరస్‌ సోకితే రాత్రికి వాళ్లు ఇళ్లకు వెళ్లినప్పుడు మరింత ఎక్కువ మందికి కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. 

గత ఏడాది కొవిడ్‌ చికిత్సకి, ఈ సంవత్సరం అందిస్తున్న వైద్యానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోన్నది.  గత సంవత్సరం ఎవరైనా పాజిటివ్‌ అని తేలితే ప్రభుత్వమే అంబులెన్స్‌ పంపించి రోగి ఒక్కరినే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించేది. ఆ రోగి కోలుకొంటే చివరలో రెండుసార్లు కోవిడ్‌ టెస్టు నిర్వహించి నెగెటివ్‌ రిపోర్టు వస్తేనే ఇంటికి పంపించేది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా క్వారంటైన్‌ పాటించాల్సి ఉండేది. ఒకవేళ చనిపోతే కేవలం ముగ్గురు, నలుగురిని మాత్రమే పీపీఈ కిట్‌ వేసి మృతదేహం చూపించి అంత్యక్రియలు చేసేవారు. ఇక కాంటాక్ట్స్‌ని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించి అక్కడ 15 రోజులు ఉంచి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత ఇంటికి పంపేవారు. 

ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు. కరోన సోకిన వారితో పాటు సహాయకులను కూడా ఆస్పత్రుల్లోకి అనుమతిస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేవు. ఆక్సిజన్‌ పడకలు ఉన్న చోటికి  వెళ్లి రోగుల పక్కనే గంటల తరబడి ఉంటున్నారు. పీపీఈ కిట్‌లు, ఎన్‌95 మాస్కులు, ఫేస్‌ షీల్‌లుఉ ధరించిన వారికే కరోనా వ్యాప్తి చెందుతోండగా ఎలాంటి జాగ్రత్తలు పాటించని రోగుల సహాయలకు ఇట్టే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. వాళ్లు ఆస్పత్రిని విడిచి బయటకు వెళ్లినప్పుడు మరింత మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.


సహాయకులను పూర్తిగా నిరోధించాలి: ఉషారాణి, స్పెషలాఫీసర్‌

కొవిడ్‌-19 ఆస్పత్రులను సందర్శించిన జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఉషారాణి పలుచోట్ల రోగుల సహాయకులు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రుల్లోకి రోగుల సహాయకులను పూర్తిగా నిరోధించడం ద్వారానే కరోనా వైరస్‌ వ్యాప్తి గొలుసుని విచ్ఛిన్నం చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.