ఒకే రోజున 30,000 మందికి.. టీకా

ABN , First Publish Date - 2021-06-15T05:45:02+05:30 IST

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు భారీ సంఖ్యలో జిల్లాకు రావడంతో సోమవారం పెద్దసంఖ్యలో ప్రజలకు టీకాలు వేశారు.

ఒకే రోజున 30,000 మందికి.. టీకా

ఏడు లక్షల మార్కు దాటిన వ్యాక్సినేషన్‌

కొత్తగా 322 మందికి కరోనా

5.35 శాతంగా పాజిటివ్‌ రేటు


గుంటూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు భారీ సంఖ్యలో జిల్లాకు రావడంతో సోమవారం పెద్దసంఖ్యలో ప్రజలకు టీకాలు వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చురుగ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఒకే రోజున 30,000 మందికి.. టీకా వేశారు. 45 ఏళ్ల వయస్సు దాటిన 21,727 మందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 444, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 70 మందికి తొలి డోసు టీకా వేశారు. అలానే ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలు ఉన్న తల్లులు 8,104 మందికి, విదేశాలకు వెళ్లే 120 మందికి కూడా టీకా వేశారు. 1,898 మందికి తొలి డోసు వేసి గడువు తీరడంతో రెండో డోస్‌ టీకాని వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌  జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 7,2,601 మందికి తొలి డోస్‌ టీకాని వేశామని చెప్పారు. 

కాగా సోమవారం 6,016 శాంపిల్స్‌ని టెస్టింగ్‌ చేయగా 322 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ జరిగింది. పాజిటివ్‌ శాతం 5.35గా నమోదైంది. కొవిడ్‌ నుంచి 307 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసులు 5,103కి తగ్గాయి. రికవరీ రేటు 1,082గా ఉంది. గుంటూరు నగరం, మాచవరం, మంగళగిరిలో ఒక్కొక్కరు కొవిడ్‌తో మరణించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా గుంటూరు నగరంలో 51, అచ్చంపేటలో 23, చిలకలూరిపేటలో 15, ముప్పాళ్లలో 14, దాచేపల్లిలో 14, చేబ్రోలులో 14, మంగళగిరిలో 11, తెనాలిలో 11, క్రోసూరులో 10, అమరావతిలో 3, బెల్లంకొండలో 2, గుంటూరు రూరల్‌లో 6, మేడికొండూరులో 3, పెదకాకానిలో 4, పెదకూరపాడులో 2, పెదనందిపాడులో 3, ఫిరంగిపురంలో 2, ప్రత్తిపాడులో 1, రాజుపాలెంలో 7, సత్తెనపల్లిలో 7, తాడేపల్లిలో 6, తాడికొండలో 2, తుళ్లూరులో 1, వట్టిచెరుకూరులో 1, దుర్గిలో 1, గురజాలలో 3, కారంపూడిలో 2, మాచవరంలో 1, మాచర్లలో 8, పిడుగురాళ్లలో 9, రెంటచింతలలో 4, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 2, యడ్లపాడులో 1, ఈపూరులో 3, నాదెండ్లలో 8, నరసరావుపేటలో 9, నూజెండ్లలో 2, నకరికల్లులో 1, రొంపిచర్లలో 2, శావల్యాపురంలో 1, వినుకొండలో 9, అమర్తలూరులో 1, భట్టిప్రోలులో 2, బాపట్లలో 9, చెరుకుపల్లిలో 1, దుగ్గిరాలలో 1, కాకుమానులో 1, కర్లపాలెంలో 5, కొల్లిపరలో 2, కొల్లూరులో 2, నగరంలో 1, నిజాంపట్నంలో 4, పొన్నూరులో 4, రేపల్లెలో 3, చుండూరులో 4, వేమూరులో 2 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.


తగ్గిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు

ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో కరోనా టెస్టుల సంఖ్యని బాగా తగ్గించేశారు. ఎక్కువ టెస్టులు చేయాలన్న లక్ష్యమో, మరే ఇతర కారణాల వలనో ఇప్పుడు యాంటీజెన్‌ టెస్టులనే ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన టెస్టుల్లో 5,081 యాంటిజెన్‌ విధానంలోనే ఉన్నాయి. ఆర్‌టీపీసీఆర్‌లో కేవలం 827 మాత్రమే టెస్టింగ్‌ చేశారు. ట్రూనాట్‌ 31, ప్రైవేటు యాంటిజెన్‌ 77 టెస్టులు చేశారు. కాగా గతంలో యాంటిజెన్‌ టెస్టింగ్‌ విధానంలో పాజిటివ్‌ రేట్‌ అధికంగా ఉండేది. ఇప్పుడు ఆర్‌టీపీసీఆర్‌లోనే ఎక్కువగా నమోదు అవుతోంది. సోమవారం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌ శాతం 13.78గా ఉంటే యాంటిజెన్‌లో కేవలం 3.72గా నమోదైంది. 


 


Updated Date - 2021-06-15T05:45:02+05:30 IST