Advertisement

కొవిడ్ 2.0: కేంద్రానిదే బాధ్యత

Apr 23 2021 @ 00:09AM

బహుమాధ్యమ యుగ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల పిచ్చా పాటీలో ప్రతిధ్వనించే పదునైన మాటను, వైచిత్రి ఉట్టిపడే బొమ్మను, మనస్సును కదిలించే నినాదాన్ని సరైన సమయంలో ప్రభావశీలంగా ఉపయోగించుకోవడంలో ఆయన అనితర సాధ్యుడు. ఈ ప్రచార నైపుణ్యం, మోదీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటి నుంచీ ప్రదర్శితమవుతోన్న ఆయన విలక్షణ నాయకత్వ శైలి. అయితే ఎంతటి మహాయోధుడూ ఏదో ఒక సందర్భంలో విజితుడు కాక తప్పదు. ఇటీవల అటువంటి పరిస్థితే నరేంద్ర మోదీకి తటస్థించింది. కొవిడ్–19 కేసులు ఒకే రోజున ప్రప్రథమంగా రెండు లక్షల సంఖ్యను దాటిన దుర్దినాన ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మోదీ సభలకు జనం రాకపోవడమా?! తండోపతండాలుగా వచ్చారు. అయితే మాస్క్‌లు ధరించినవారు, సామాజిక దూరాన్ని పాటించిన వారు ఎంతో మంది లేరు. కొవిడ్ మహమ్మారి మహోగ్రంగా విజృంభించడం ఈ సువిశాల భారతావనిలో ఎల్లెడలా కన్పిస్తుండగా తానేదో ఒక సమాంతర విశ్వంలో నడయాడతున్నట్టుగా మోదీ వ్యవహరించారు! ‘దో గాజ్ కి దూరి’ (పరస్పరం రెండు గజాల దూరాన్ని పాటించండి) అని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేసిన నరేంద్ర మోదీ, రాజకీయంలో, సమాజంలో, వైయక్తిక జీవితాలలో కొత్తదనం కోసం ఆరాటంలో కొవిడ్ నిబంధనలను పాటించకుండా తన సభలకు వెల్లువెత్తిన బెంగాలీ జన సందోహాన్ని చూసి మోదీ పులకించిపోయారు. ఈ పులకరింపు, విపత్తువేళ ప్రధానమంత్రి విధ్యుక్త ధర్మ నిర్వహణలో భాగంగా తాను చేసిన విజ్ఞప్తులను తానే విస్మరించడం కాదా?


జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానమంత్రి తన పార్టీ తరఫున ప్రచారం చేయకుండా ఎలా ఉంటారు? ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని మీరు భావిస్తే, అది, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్స్ ఫైనల్ నుంచి ఉపసంహరించుకోవాలని విరాట్ కోహ్లీని అడగడమే అవుతుంది సుమా! కొవిడ్ విషమ పరిస్థితుల దృష్ట్యా ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదించేందుకు ఎన్నికల సంఘం తిరస్కరించింది. కాకలు తీరిన రాజకీయ ప్రచార యోధుడు అయిన నరేంద్ర మోదీ తనదైన ప్రచారోద్ధృతి శైలి నుంచి వెనక్కి తగ్గడం అసాధ్యం. ఎన్నికలు ఆయనలోని ప్రచార నిపుణుడికి ప్రాణవాయువులాంటివి. ప్రజల వద్దకు వెళతారు. తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తారు. ప్రత్యర్థులకు ఓటు వేయడం ఎందువల్ల నిష్ప్రయోజనమో మరీ గట్టిగా చెబుతారు. ఒక అనితర సాధ్యమైన పోరాట స్ఫూర్తి ఆయన ప్రచారంలో ద్యోతకమవుతుంది. ఆయనకు అదొక ప్రామాణిక విజయ సాధనా వ్యూహం. 


అసాధారణ పరిస్థితులలో ఏ వ్యూహంలోనైనా మార్పులు చేర్పులు తప్పనిసరి. కొవిడ్ మహోగ్రంగా తాండవమాడుతున్న వేళ కూడా ఎన్నికల ప్రచారాన్ని సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా నవీన మార్గాలలో ఎందుకు చేయకూడదు? భారతీయ జనతా పార్టీకి డిజిటల్ సాంకేతికతల సామర్థ్యం అపారంగా ఉంది కదా. మరి తన సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఆన్‌లైన్ వేదికలను ప్రధానమంత్రి ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టలను పూర్తిగా కూల్చి వేస్తున్న ర్యాలీలు, రోడ్ షోలను గణనీయంగా తగ్గించేలా ఎన్నికల సంఘంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ఇందుకు ప్రధానమంత్రి తన అధికారాలను ఉపయోగించుకోవడం చాలా సముచితంగాను, ప్రశంసనీయంగాను ఉండేది కాదూ? నిజమైన నాయకత్వ లక్షణమేమిటి? మందలో కలవకుండా మిగతా వారికంటే ఒక అడుగు ముందుండి మార్గదర్శకత్వం నెరపడమే కాదూ? మరి మోదీ ఇలా ఎందుకు వ్యవహరించడంలేదు? 


దురదృష్టవశాత్తు మన సమాజ జీవితం మితిమీరిన స్థాయిలో రాజకీయీకరణ అయిపోయింది. సామాజిక చీలికలు పెరిగిపోయాయి. ఆర్థిక అసమానతలు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విషయయూ రాజకీయాలకు అతీతం కాబోదు. సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు మోదీ ప్రభుత్వం చిక్కుకొంది. కొవిడ్ విపత్తును ఎలా ఎదుర్కోవాలనే విషయమై విధాన నిర్ణేతలు తమ దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయంలో మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడులు ముమ్మరమయ్యాయి. గత ఏడాది మోదీ సర్కార్ పలు విభిన్న పోరాటాలు చేయవలసివచ్చింది. చైనాతో సరిహద్దు ఘర్షణలు, ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చివేయడం, ఆర్థిక వనరుల పంపకం విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదాలు, ఇప్పుడు బెంగాల్‌లో దేశ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగల ఎన్నికల సమరం! చైనాతో ఘర్షణలు ఆ దేశ సామ్రాజ్యవాద విస్తరణ ఆకాంక్షల ఫలితమేనని పాలకులు చెప్పారు. మరి ఇంచుమించు ఐదు నెలలుగా ఉత్తర భారతావని రైతులు చేస్తున్న పోరాటం విషయమేమిటి? ఎందుకు అది ఎడతెగకుండా కొనసాగే పరిస్థితిని మోదీ ప్రభుత్వం కల్పించింది? కనీవినీ ఎరుగని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిపై పోరాడేందుకు మరింత విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన సమయంలో కొత్త వ్యవసాయ బిల్లులకు హడావుడిగా పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరమేమిటి? బిల్లులను తెచ్చే ముందు రైతులతో ఎందుకు సంప్రదించలేదు?


ఈ సంక్లిష్ట రాజకీయ వ్యవహారాలు అన్నీ అసలు సమస్యపై మోదీ ప్రభుత్వం ఏకాగ్ర దృష్టి నిలపకుండా చేశాయనడంలో సందేహం లేదు. దీనికితోడు తమ నిర్ణయాలు అమోఘమైనవని, ప్రజలు వాటిని తప్పక ఆమోదిస్తారనే మితిమీరిన విశ్వాసం పాలకుల వివేచనను కుంటుపరిచిందని చెప్పక తప్పదు. గత నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో లభించిన విజయంతో తమ రాజకీయ ఎజెండా ఏదైనా సరే ప్రజలు పూర్తి మద్దతు నిస్తారనే విశ్వాసం మోదీ ప్రభుత్వంలో పెరిగిపోయింది. ఇదిలా వుంటే కొవిడ్ విపత్తు కొంచెం నెమ్మదించడంతో ప్రజలు తాము విధిగా పాటించాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం చూపసాగారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ దక్షత వల్లే కొవిడ్ తగ్గు ముఖం పట్టిందని గట్టిగా విశ్వసించింది. ప్రజలను అంతగా కట్టడి చేయకపోయినా పరిస్థితి అదుపులో ఉంటుందనే భరోసాకు పాలకులు వచ్చారు.


ఈ ‘సానుకూల’ పరిస్థితులు అన్నీ మోదీ ప్రభుత్వం అనుసరించిన వాక్సిన్ విధానం ఫలితమేనని పాలకపక్ష మద్దతుదారులు భావించారు. కరోనాను ప్రభుత్వం ఓడించిందని జయపతాకలు ఎగురవేశారు. విపత్తు పరిస్థితులు మరింతగా దిగజారిపోయిన పక్షంలో చేపట్టవలసిన చర్యలకు సంసిద్ధమవ్వాల్సిన సమయంలో వేడుకలు జరుపుకోవడం సబబేనా? అసలు మోదీ సర్కార్ అనుసరించిన వాక్సిన్ విధానాన్ని నిశితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు మార్చి మూడో వారం వరకు తన సొంత పౌరులకు వేసిన టీకాల కంటే అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్లను భారత్ ఎగుమతి చేసింది! (దేశంలో కేవలం 5.2 కోట్ల మందికి మాత్రమే టీకా వేసిన భారత్ అదే సమయంలో 76 దేశాలకు ఆరు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసింది! ఇదెలా జరిగింది? దౌత్య ప్రయోజనాల కోసం వాక్సిన్ వితరణను, దేశానికి ‘విశ్వ గురు’ ప్రతిష్ఠను నిర్మించే ప్రయత్నాలను దేశంలో కొవిడ్-–19 పరిస్థితి సంపూర్ణంగా అదుపులోకి వచ్చేంతవరకు ఎందుకు వాయిదా వేయలేకపోయారు? వాక్సిన్ ప్రత్యామ్నాయాల సంఖ్యను పరిమితం చేశారు. సరైన విధంగా వాక్సిన్ సరఫరా ఆర్డర్లను ఉత్పత్తి సంస్థలకు ముందుగా ఇవ్వడంలో అలసత్వం చూపారు. ప్రతి రాష్ట్రానికి వాక్సిన్ పంపిణీ విషయంలో కఠినమైన ‘కోటా- పర్మిట్’ విధానాన్ని అనుసరించారు. వాక్సిన్లను మరింత ముమ్మరంగా, మరింత శీఘ్రంగా ఉత్పత్తి చేసేలా ప్రైవేట్ సంస్థలకు తగు ప్రోత్సాహకాలనివ్వలేదు. అన్ని వయస్సులవారికీ టీకా వేయించే విషయాన్ని ఉపేక్షించారు. వాక్సిన్ విధానం అమలుకై ఒక ఉద్యోగస్వామ్య సంబంధిత క్లిష్ట వ్యూహాన్ని సృష్టించారు. తత్ఫలితంగానే అత్యంత కీలక సమయంలో వాక్సిన్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజల సమస్యలు మిక్కుటమయ్యాయి. వాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి దేశం ఇప్పుడు నైరాశ్యంతో వాక్సిన్లను దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి నెదుర్కొంటున్నది. ఈ పరిస్థితి, కరోనా మహమ్మారిపై పోరు సుదీర్ఘమైనదీ, సంక్లిష్టమైనదీ అన్న సత్యాన్ని స్పష్టం చేస్తోంది. 


ఈ శోచనీయ పరిస్థితులకు మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. రెండో దఫా కొవిడ్ విజృంభణ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ క్లిష్ట పరిస్థితినెదుర్కొనేందుకు మోదీ సర్కార్ ఎందుకు సంసిద్ధమవలేదని విపక్షాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. కొవిడ్ విపత్తును అదుపు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో చాలా లొసుగులు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే అధికారపక్షం వారు ఆయన హెచ్చరికలను కొట్టివేస్తూ వచ్చారు. సరే, కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలలో కొవిడ్‌పై పోరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కంటే మెరుగ్గా ఉందా? వైరస్‌కు రాజకీయ హద్దులు తెలియవు. మహమ్మారిని అదుపు చేసేందుకు మహా మంత్రమేదీ ఎవరి వద్దా లేదు. 


పరిష్కారాన్ని కనుగొనడానికి వేయవలసిన మొదటి అడుగు సమస్యను అంగీకరించడం, దానినెదుర్కోవడంలో జరిగిన తప్పులను ఆమోదించడం, ఆ తరువాత దిద్దు బాటు చర్యలు తీసుకోవడం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ వాక్సిన్ విధానంలో ఇటీవల జరిగిన మార్పులు సరైన దిశలో వేసిన ముందడుగుగా చెప్పి తీరాలి. అయితే కొవిడ్ విపత్తు అదుపు బాధ్యతను మోదీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై మోపకూడదు. ‘కొత్త’ భారతదేశంలో సిద్ధించిన విజయాలన్నీ తమ ఘనతే అని చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌పై పోరులో వేసిన తప్పటడుగులకూ తన వంతు బాధ్యతను అంగీకరించి తీరాలి. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారాలు అన్నిటినీ కేంద్రీకరించింది. విధాన నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయంలో ఏకపక్షంగా తీసుకోవడం జరుగుతోంది. కొవిడ్‌పై పోరులో ‘ప్రైమ్ మినిస్టర్స్ కేర్ ఫండ్’ ద్వారా నిధులు ఏ మేరకు వ్యయం చేయడం జరిగిందనే విషయమై ప్రాథమిక సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదు. అయినప్పుడు జరగాల్సిన పనులు సవ్యంగా జరగనప్పుడు అందుకు మోదీ ప్రభుత్వమే జవాబుదారీ కావాలి. కొవిడ్‌పై పోరులో జరిగిన తప్పులు అన్నిటికీ బాధ్యత పూర్తిగా మోదీ సర్కార్‌దే. ఇది సందేహాతీతమైన నిజం.

 

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.