Advertisement

కొవిడ్‌ టీకాకు శ్రీకారం

Jan 16 2021 @ 00:00AM
టీకా వేయించుకుంటున్న జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి, చిత్రంలో హో మంత్రి సుచరిత, కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తదితరులు

31 కేంద్రాల్లో వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్‌ 

తొలిరోజు 2,006కి మంది టీకా 

గుంటూరులో ప్రారంభించిన మంత్రి సుచరిత 

మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపు 

ఆనందంగా ఉందన్న టీకా గ్రహీతలు 


అంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. జిల్లాలో 31 కేంద్రాల్లో కొవిషీల్డు టీకా పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, పారా మెడికల్‌, వైద్యసిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. గుంటూరులో తొలి టీకాను మహిళా ఆరోగ్య కార్యకర్త సీహెచ్‌ శ్రీదేవి, రెండో టీకాను ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తీసుకున్నారు. 


 గుంటూరు (మెడికల్‌) జనవరి 16: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఽధ్వర్యంలో శనివారం జిల్లాలో కరోనా టీకా మందు పంపిణీ ప్రారంభమైంది. ఉత్సాహపూరిత వాతావరణంలో శనివారం ఉదయం 11 గంటలకు కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రి నాట్కో కేన్సర్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని మంత్రి సుచరిత ప్రారంభించారు. తొలి టీకాను మహిళా ఆరోగ్య కార్యకర్త సీహెచ్‌ శ్రీదేవి, రెండో టీకాను ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తీసుకున్నారు. కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ (అభివృద్ధి, సచివాలయాలు) పి.ప్రశాంతి, డీఎంహెచ్‌వో జే.యాస్మిన్‌, డీఐవో డాక్టర్‌ చుక్కా రత్న మన్మోహన్‌ వీరికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సుచరిత ప్రసంగిస్తూ కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే మహాయజ్ఞంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 31 కేంద్రాల్లో కొవిషీల్డ్‌ టీకా మందు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు, దశలవారీగా  ప్రజలందరికీ టీకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో మూడు దశలుగా వ్యాక్సిన్‌ కార్యక్రమం అమలు  చేస్తున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌ గైనకాలజీ విభాగం పోస్ట్‌ పార్టమ్‌ యూనిట్‌లో పనిచేసే వైద్యనిపుణులు, స్టాఫ్‌ నర్సులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలను టీకాల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, వైసీపీ నాయకులు పాదర్తి రమేష్‌ గాంఽధీ, కావటి మనోహర్‌, చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని వీక్షించారు. 


కేవలం ఆరుగురికే కరోనా

గుంటూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. శనివారం ఉదయం వరకు 2,514 మంది శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా కేవలం ఆరుగురికి మాత్రమే పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది. పాజిటివ్‌ శాతం 0.24గా నమోదైంది. మిగతా 2,508(99.76 శాతం) మందికి నెగెటివ్‌గా తేలింది.  వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గుంటూరు నగరంలో 2, తాడేపల్లి, మేడికొండూరు, భట్టిప్రోలు, బాపట్లలో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గురజాల, నరసరావుపేట డివిజన్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 76,882 మందికి కొవిడ్‌-19 సోకగా వారిలో 75,866(98.68 శాతం) మంది కోలుకొన్నారు. ప్రస్తుతం 285 మంది ఆస్పత్రులు, ఐసోలేషన్‌లో ఉండగా 731 మంది చనిపోయారు. మరణాల శాతం 0.95గా నమోదైంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.