Covid కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-06-15T17:26:29+05:30 IST

రాష్ట్ర రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. ఫోర్త్‌వేవ్‌పై సందిగ్ధత కొనసాగుతుండగానే

Covid కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్‌

- రెండు ప్రైవేట్‌ పాఠశాలకు సెలవు 

- ఆందోళన చెందవద్దు: ఆరోగ్యశాఖ మంత్రి


బెంగళూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. ఫోర్త్‌వేవ్‌పై సందిగ్ధత కొనసాగుతుండగానే బెంగళూరులోని రెండు పాఠశాలల్లో 31 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. వైరస్‌ ప్రబలిన ఈ రెండు ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు పాఠశాల ప్రాంగణాలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. దాసరహళ్లి జోన్‌లోని రాజగోపాలనగర్‌లోగల న్యూ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ పాఠశాల, ఎంఈఎస్‌ పబ్లిక్‌ పాఠశాలల్లో 6-10 తరగతుల విద్యార్థులకు వైరస్‌ సోకింది. ఇందులో 21 మంది విద్యార్థులకు తొలుత పాజిటివ్‌ వచ్చినట్టు గుర్తించగా అనంతరం మరో 10 మందికి వైరస్‌ సోకింది. మొత్తం 31 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై బీబీఎంపీ అధికారులు ప్రత్యేక నిఘా విధించారు. వీరితో పాఠశాలల్లో కలసిన ఇతర విద్యార్థులకు కూడా వైరస్‌ సోకి ఉంటుందన్న అనుమానంతో మొత్తం విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో ఉలిక్కిపడ్డ బీబీఎంపీ ఆరోగ్యశాఖ కొవిడ్‌ బారి నుంచి రక్షణ పొందేందుకు తాజా మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ప్రతి పాఠశాలలోనూ మాస్క్‌, శానిటైజర్‌, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈమేరకు బీబీఎంపీ ప్రతి పాఠశాలలోనూ స్వయంగా సమీక్ష జరుపుతుందని చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కొవిడ్‌ కొత్త వేరియంట్‌లు లేవని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ భరోసా ఇచ్చారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీణ్యా, దాసరహళ్లి జోన్‌లో 31 మంది విద్యార్థులకు వైరస్‌ సోకిన మాట నిజమేనని, అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పటికే 12-15 ఏళ్లలోపువారికి కొవిడ్‌ వ్యాక్సిన్ల ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వెలుగు చూసిన రెండు పాఠశాలలకు మూడు రోజులు సెలవు ప్రకటించామన్నారు. కొత్త వేరియంట్‌గా భావిస్తున్న బీఏ-4, ఒమైక్రాంట్‌ ఉనికి ఎక్కడా లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-06-15T17:26:29+05:30 IST