బూస్టర్‌ డోస్‌ ఉచితం కాదు: ఆరోగ్యశాఖ

ABN , First Publish Date - 2022-05-19T15:35:37+05:30 IST

రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వరకు ప్రభుత్వాస్పత్రుల్లో బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేయలేమని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ సెల్వవినాయగం ప్రకటించారు. ఆయన అన్ని జిల్లాల

బూస్టర్‌ డోస్‌ ఉచితం కాదు: ఆరోగ్యశాఖ

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వరకు ప్రభుత్వాస్పత్రుల్లో బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేయలేమని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ సెల్వవినాయగం ప్రకటించారు. ఆయన అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులకు జారీచేసిన సర్క్యులర్‌లో, కేంద్రప్రభుత్వం సూచనల మేరకు, 2021 జనవరి 16వ తేదీ నుంచి కోవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ టీకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. ఆ తర్వాత కోర్బీవాక్స్‌, స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులోకి వచ్చాయని, ఈ రెండు టీకాలను ప్రస్తుతం జాతీయ కరోనా నివారణ టీకా పథకంలో కేంద్రప్రభుత్వం చేర్చిందని వివరించారు. ఈ రెండు టీకాలను 2 నుంచి 17 ఏళ్లలోపున్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేయించుకోవచ్చని, అదే విధంగా 12 నుంచి 17 ఏళ్ల వరకు మొదటి, రెండవ విడతగా కోర్బీవాక్స్‌ టీకాను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవచ్చన్నారు. 15 నుంచి 17 ఏళ్లలోపున్న వారు కోవాగ్జిన్‌ టీకాను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవచ్చని తెలిపారు. కోవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ టీకాలను ఇప్పటివరకు వేయించుకోని 18 ఏళ్లకు పైబడిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవచ్చని, 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవచ్చన్నారు. ఇక, స్పుత్నిక్‌-వి టీకాను 18 ఏళ్ల పైబడిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవచ్చని, 18 నుంచి 59 ఏళ్లలోపున్న వారికి బూస్టర్‌ డోస్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయలేమన్నారు. అయితే ఈ టీకాను ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేయించుకోవచ్చని సెల్వవినాయగం జారీచేసిన సర్క్యులర్‌లో తెలిపారు.

Updated Date - 2022-05-19T15:35:37+05:30 IST