వైరస్‌.. విలయం!

ABN , First Publish Date - 2021-04-18T05:27:30+05:30 IST

కరోనా కలవరపెడుతోంది. జిల్లాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

వైరస్‌.. విలయం!

ఒక్కరోజుల్లో జిల్లాలో 903 కరోనా కేసులు 

13.28 శాతంగా పాజిటివ్‌ రేటు నమోదు


కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ప్రజలపై విరుచుకుపడుతోంది. వివిధ మార్గాల్లో వచ్చి ఆవహింస్తోంది. టెస్టింగ్‌ చేస్తున్న ప్రతీ 100 మందిలో 13.28 శాతం మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ జరిగింది. ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోన్నది. శనివారం ఉదయం వరకు  విడుదలైన 6,798 శాంపిల్స్‌ ఫలితాల్లో 903 మందికి పాజిటివ్‌ వచ్చింది. తెనాలిలోని పినపాడుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోన సోకి చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి.  


గుంటూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కరోనా కలవరపెడుతోంది. జిల్లాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా గుంటూరు నగరంలో 379, తాడేపల్లిలో 76, మంగళగిరిలో 67, నరసరావుపేటలో 67, తెనాలిలో 50, పిడుగురాళ్లలో 23, అమరావతిలో 4, అచ్చంపేటలో 4, గుంటూరు రూరల్‌లో 9, క్రోసూరులో 4, మేడికొండూరులో 6, ముప్పాళ్లలో 6, పెదకాకానిలో 16, పెదకూరపాడులో 7, పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 4, ప్రత్తిపాడులో 3, సత్తెనపల్లిలో 4, తాడికొండలో 12, తుళ్లూరులో 18, వట్టిచెరుకూరులో 5, దాచేపల్లిలో 4, దుర్గిలో 2, గురజాలలో 1, కారంపూడిలో 5, మాచర్లలో 4, రెంటచింతలలో 3, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 1, చిలకలూరిపేటలో 8, యడ్లపాడులో 1, ఈపూరులో 3, నాదెండ్లలో 6, నకరికల్లులో 7, రొంపిచర్లలో 3, వినుకొండలో 4, అమర్తలూరులో 9, భట్టిప్రోలులో 4, బాపట్లలో 10, చేబ్రోలులో 11, చెరుకుపల్లిలో 8, దుగ్గిరాలలో 3, కాకుమానులో 2, కర్లపాలెంలో 2, కొల్లిపరలో 6, కొల్లూరులో 6, నగరంలో 2, నిజాంపట్నంలో 2, పిట్టలవానిపాలెంలో 3, పొన్నూరులో 4, రేపల్లెలో 3, చుండూరులో 3, వేమూరులో 4 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కాగా శనివారం కోవిడ్‌ నుంచి కోలుకొని 141 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 3,030 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


గుంటూరు నగరంలో కరోనా కలకలం

నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా గుర్తింపు పొందిన బృందావన్‌గార్డెన్స్‌, బ్రాడీపేటలో కరోనా కలకలం సృష్టిస్తోంది. బృందావన్‌గార్డెన్స్‌లో కేవలం రెండు రోజుల వ్యవధిలో 42 మందికి వైరస్‌ సోకింది. బ్రాడీపేటలో ఒక్క శనివారం రోజునే 25 మంది కరోన బారిన పడ్డారు. ఏటీ అగ్రహారం, పాండురంగనగర్‌, కొరిటెపాడు, పట్టాభిపురం, రైలుపేట, కొత్తపేటలో ప్రతీ చోట 10కి పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. హాస్టళ్లు, రీడింగ్‌ రూంలు, టీ, జ్యూస్‌ స్టాల్స్‌ హోటళ్లు, విద్యాసంస్థలు కరోన వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారాయి. వీటిపై పోలీసుశాఖ పరంగా ఎలాంటి నిఘా లేకపోవడంతో కొవిడ్‌-19 మార్గదర్శకాలు నామమాత్రంగా కూడా అమలు కావడం లేదు. 


 ఉమ్మినా.. మాస్కు పెట్టుకోకపోయినా

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కొత్త నిబంధనని అమలులోకి తీసుకొచ్చింది. రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో ఉమ్మినా, మాస్కు ధరించకపోయినా రూ.500 పెనాల్టీగా విధించనున్నట్లు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. దీని దృష్ట్యా ప్రయాణీకులంతా కచ్ఛితంగా మాస్కులు ధరించాలన్నారు. అలానే స్టేషన్లు, ప్రయాణ సమయాల్లో భౌతికదూరం పాటించాలన్నారు. 

Updated Date - 2021-04-18T05:27:30+05:30 IST