1,348 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-07T05:48:33+05:30 IST

గత వారం నుంచి నిత్యం రెండు వేలకు పైగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు గురువారం కొంతమేరకు తగ్గాయి.

1,348 మందికి కరోనా

11.87 శాతానికి తగ్గిన పాజిటివ్‌ రేటు

అధికారికంగా మరో ఐదుగురు మృతి


గుంటూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): గత వారం నుంచి నిత్యం రెండు వేలకు పైగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు గురువారం కొంతమేరకు తగ్గాయి. మొత్తం 11,353 శాంపిల్స్‌ టెస్టింగ్‌ చేయగా 1,348 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ జరిగింది. పాజిటివ్‌ రేటు కూడా 18 నుంచి 11.87 శాతానికి తగ్గింది. అలానే గుంటూరు నగరంలో నిత్యం 700లకు పైగా స్థిరంగా నమోదు అవుతూ వస్తున్న కరోనా కేసులు కూడా గురువారం 421కి తగ్గాయి. కాగా డిశ్చార్జ్‌లు పెరగని కారణంగా యాక్టివ్‌ కేసులు 18,334కి చేరాయి. పట్టాభిపురంలో 17, పాతగుంటూరులో 15తో పాటు మొత్తం 103 కాలనీల్లో కేసులు నమోదు అయ్యాయని నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. కాగా మంగళగిరిలో 112, తాడేపల్లిలో 95, నరసరావుపేటలో 82, సత్తెనపల్లిలో 68, తెనాలిలో 50, అమరావతిలో 31, అచ్చంపేటలో 1, బెల్లంకొండలో 5, గుంటూరు రూరల్‌లో 5, క్రోసూరులో 9, మేడికొండూరులో 18, ముప్పాళ్లలో 15, పెదకాకానిలో 15, పెదకూరపాడులో 34, పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 14, ప్రత్తిపాడులో 14, రాజుపాలెంలో 2, తాడికొండలో 16, తుళ్లూరులో 35, వట్టిచెరుకూరులో 9, దాచేపల్లిలో 12, దుర్గిలో 4, గురజాలలో 16, కారంపూడిలో 10, మాచవరంలో 2, మాచర్లలో 18, పిడుగురాళ్లలో 6, రెంటచింతలలో 4, వెల్దుర్తిలో 4, బొల్లాపల్లిలో 4, చిలకలూరిపేటలో 32, యడ్లపాడులో 5, ఈపూరులో 6, నాదెండ్లలో 12, నూజెండ్లలో 13, నకరికల్లులో 4, రొంపిచర్లలో 12, శావల్యాపురంలో 6, వినుకొండలో 3, అమర్తలూరులో 4, భట్టిప్రోలులో 3, బాపట్లలో 18, చేబ్రోలులో 8, చెరుకుపల్లిలో 7, దుగ్గిరాలలో 26, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 3, నగరంలో 4, నిజాంపట్నంలో 4, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 15, రేపల్లెలో 17, చుండూరులో 5, వేమూరులో 4 కొత్త కేసులు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 


డిశ్చార్జ్‌లు పెరగడం లేదు

కరోన సెకండ్‌ వేవ్‌ కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదు కావడం ప్రారంభమై దాదాపు 20 రోజులు పైనే అయింది. అయినప్పటికీ డిశ్చార్జ్‌ల సంఖ్య పెరగడం లేదు. రోజుకు 200 నుంచి 300 మధ్యనే డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య ఉంటోంది. ఇదే సమయంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి గురించి సరైన డేటా అధికారవర్గాల వద్ద ఉండటం లేదు. ఈ నేపథ్యంలో యాక్టివ్‌ కేసులు 18 వేలు దాటిపోయాయి. గత ఏడాది అయితే రోజుకు ఎన్ని అయితే పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యేవో డిశ్చార్జ్‌ల సంఖ్య కూడా ఇంచుమించుగా అలానే ఉండేది. దాంతో యాక్టివ్‌ కేసులు మూడు వేల మధ్యనే ఉండేవి. దాని వలన పడకల కొరత తలెత్తేది కాదు. 


 4,261 మందికి వ్యాక్సిన్‌

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల గురువారం వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగింది. 60 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, 484 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, 3,717 మంది 45 కంటే ఎక్కువ సంవత్సరాల వయస్సు వారు వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకొన్న వారి సంఖ్య 4,42,147కి పెరిగింది. 


 ఆగని మరణ మృదంగం

తాడేపల్లిలో మహిళ(58), రేపల్లెలో పురుషుడు(69), వట్టిచెరుకూరు మండలంలోని కట్రపాడు గ్రామంలో యువకుడు(33), దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో వృద్ధుడు, గుంటూరు నగరంలోని పట్టాభిపురంకు చెందిన మరో వృద్ధుడు కరోనాతో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రకాశం జిల్లా కురిచేడు ఎంపీడీవో సయ్యద్‌ జాకీర్‌హుస్సేన్‌(48) కొవిడ్‌తో బాధపడుతూ ఒంగోలులోని రిమ్స్‌లో  చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. వినుకొండ పట్టణంలోని సట్టుబజారుకు చెందిన ఆయన రెండేళ్ల నుంచి ఎంపీడీవోగా  విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. వేమూరు మండలం బలిజేపల్లి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొండిశెట్టి సాంబశివరావు (45) గురువారం కరోనా లక్షణాలతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.   

Updated Date - 2021-05-07T05:48:33+05:30 IST