రాజధానిలో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2022-01-07T14:41:30+05:30 IST

రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం వారం రోజుల్లోనే నాలుగు వేలకు పైగా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో రాష్ట్ర యంత్రాంగం ఉక్కిరిబిక్కిరైపోతోంది. దీని

రాజధానిలో కరోనా కల్లోలం

-  చెన్నైలోనే 1100 దాటిన కేసులు

- జీహెచ్‌లో 215 మందికి చికిత్స

- స్టాన్లీలో 16 మంది డాక్టర్లకు పాజిటివ్‌

- ఒమైక్రాన్‌ బాధితుల కోసం 2 వేల అదనపు పడకలు


చెన్నై: రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం వారం రోజుల్లోనే నాలుగు వేలకు పైగా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో రాష్ట్ర యంత్రాంగం ఉక్కిరిబిక్కిరైపోతోంది. దీనిని ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కాగా రాష్ట్రంలోకన్నా చెన్నైలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే నగరంలో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నగరంలోని నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో 11 జోన్లలో  జోన్‌కు వంద చొప్పున సుమారు 1100 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో తేనాంపేట జోన్‌లో అత్యధికంగా 299 మందికి వైరస్‌ సోకిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే విధంగా తండయార్‌పేట, రాయపురం, తిరువిక నగర్‌, అంబత్తూరు, అన్నానగర్‌, కోడంబాక్కం, వలసరవాక్కం, అడయార్‌ జోన్లలో వరుసగా 189, 225, 159, 150, 293, 287, 153, 258 మంది చొప్పున పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుకుంటున్నారు. పెరుంగుడి జోన్‌లో 137 మంది, షోళింగ నల్లూరు జోన్‌లో 117 మంది వైరస్‌బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇదేవిధంగా మనలిజోన్‌లో 29, మాధవరం జోన్‌లో 55, ఆలందూరు జోన్‌లో 96 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. 

 

ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు

నగరంలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీహెచ్‌) సహా ఐదు ప్రభుత్వ వైద్యకళాశాలల ఆస్పత్రుల్లో చికిత్స కోసం అడ్మిట్‌ అవుతున్న కరోనా బాధితుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. జీహెచ్‌లో కరోనా బాధితుల కోసం 2050 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా, అందులో 215 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే రీతిలో స్టాన్లీ వైద్య కళాశాల ఆసుపత్రిలో 2700 పడకలుండగా 138 మంది కరోనా బాధితులు చికిత్సలందుకుంటున్నారు. కీల్పాక్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో 700 పడకలతో ప్రత్యేక వారు ఏర్పాటు చేయగా, అందులో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఓమండూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో 500  పడకల ప్రత్యేక వార్డులో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గిండి కింగ్‌ఇన్‌స్టిట్యూట్‌ ప్రభుత్వ ప్రత్యేక ఆస్పత్రిలో 650 పడకల ప్రత్యేక వార్డులో 290 మంది చికిత్సలందుకుంటున్నారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఎంఐటీలో 


80కి చేరిన కేసులు...

స్థానిక క్రోంపేటలోని ఎంఐటీ విద్యా సంస్థ హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల్లో మరో 13 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. రెండు రోజుల క్రితం హాస్టల్‌ వైద్యపరీక్షలు చేయగా వారిలో నలుగురు విద్యార్థినులు సహా 67 మందికి పాజిటివ్‌ వచ్చింది. గురువారం కూడా 13 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రావడంతో వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.


స్టాన్లీ వైద్యులకు కరోనా...

స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఇద్దరు డాక్టర్లు, 14 మంది ట్రైనీ డాక్టర్లకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ప్రత్యేకవార్డుల్లో పనిచేసిన నలుగురు నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరందరికీ అదే ఆస్పత్రిలో చికిత్సలందిస్తున్నారు. ఆ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులందరికీ రెండు రోజుల క్రితం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 16 మంది డాక్టర్లు, నలుగురు నర్సులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యాయి.


రాష్ట్రవ్యాప్తంగా అదనపు పడకలు

ఒమైక్రాన్‌ వైరస్‌ బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 2 వేల పడకలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. కరోనా రెండో అల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. గత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒమైక్రాన్‌ బాధితుల కోసం తగినన్ని పడకలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న 20 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో రూ.120 కోట్లతో 2 వేల పడకలు సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్యశాఖాధికారులు తెలిపారు.



Updated Date - 2022-01-07T14:41:30+05:30 IST