మళ్లీ కోరలు

ABN , First Publish Date - 2022-07-01T07:20:06+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. కొన్నినెలలపాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు చాపకింద నీరులా విస్త రిస్తూ బాధితుల సంఖ్యను అంతకంతకూ పెంచేస్తోంది. దీంతో మహ మ్మారి భయం సర్వత్రా అలముకుంటోంది. వైద్యఆరోగ్యశాఖకు ముచ్చె మటలు పట్టిస్తోంది.

మళ్లీ కోరలు

  • చాపకిందనీరులా మళ్లీ పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులు
  • జిల్లాలో గురువారం ఏకంగా 45మందికి పాజిటివ్‌
  • ఇందులో 35 కేసులు కాకినాడ నగరంలోనే 
  • బుధవారం నమోదైన కేసులు 41.. కొవిడ్‌తో జీజీహెచ్‌లో మహిళ మృతి
  • ఈ నాలుగురోజుల్లో ఏకంగా 250కిపైగా దాటేసిన పాజిటివ్‌లు
  • వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో  బెంబేలెత్తుతున్న వైద్యఆరోగ్యశాఖ
  • జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో త్వరలో టెస్ట్‌లు పెంచేందుకు ప్రయత్నాలు 
  • బాధితుల్లో ఎక్కువమందికి జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి లక్షణాలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. కొన్నినెలలపాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు చాపకింద నీరులా విస్త రిస్తూ బాధితుల సంఖ్యను అంతకంతకూ పెంచేస్తోంది. దీంతో మహ మ్మారి భయం సర్వత్రా అలముకుంటోంది. వైద్యఆరోగ్యశాఖకు ముచ్చె మటలు పట్టిస్తోంది. గతేడాది పాజిటివ్‌లు సృష్టించిన భయానక మరణమృదంగ విలయంనుంచి తేరుకోకముందే మళ్లీ కేసులు పంజా విసురుతుండడంతో ఈసారి పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయనే ఆందో ళన వెన్నాడుతోంది. ముఖ్యంగా జిల్లాలో గడచిన వారం నుంచీ పాజిటి వ్‌లు పెరిగిపోతున్నాయి. బుధవారం 41మందికి కొవిడ్‌ సోకగా, గురు వారం 45కి పెరిగాయి. ఇందులో 35కేసులు ఒక్క కాకినాడ నగరంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో త్వరలో జిల్లావ్యాప్తంగా టెస్ట్‌ల సంఖ్య పెం చడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మళ్లీ రయ్‌ రయ్‌...

విరగడైందనుకున్న కొవిడ్‌ పీడ జిల్లాలో మళ్లీ మొదలవడంతో కలకలం రేగుతోంది. మళ్లీ కేసులు ఏస్థాయికి వెళ్తాయో అనే భయం ప్ర తిఒక్కరిని బెంబేలెత్తిస్తోంది. 2020, మార్చి 23న ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో తొలి కేసు నమోదవగా ఆస్ప త్రిలో వేలాదిమంది చేరి తిరిగి నయమై ఇంటికి చేరారు. కానీ గతేడాది ఏప్రిల్‌లో వచ్చిన సెకండ్‌వేవ్‌ మాత్రం జిల్లాను కకావికలం చేసేసింది. వేలాది కేసులతో జిల్లాను వణికించేసింది. బాధితుల ఆర్తనాదాలు, ఆక్సి జన్‌ అందక చనిపోవడాలు, పడక దొరక్క కన్నుమూయడం, శ్మశానాల్లో నిరంతర చితులు కాలడం.. ఇలా ఒకటేంటి దాదాపు మూడునెలలపా టు వైరస్‌ విలయం సృష్టించింది. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత ఎక్కడికక్కడ కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, జిల్లాలో రెండు డోసులు దాదాపు అంతా పూర్తి చేసుకోవడంతో మహ మ్మారి పోయినట్లేనని అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండేళ్ల కొవిడ్‌ రక్క సినుంచి అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పడ్డాయి. అంతా సద్దుమణిగిం దనుకున్న తరుణంలో మళ్లీ కొవిడ్‌ కేసులు పురివిప్పుతుండడంతో భ యాందోళనలు పెరుగు తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుం డడంతో ఆస్పత్రుల్లో బాధితులు పెరుగుతున్నారు. మూడువారాల కింద టి వరకు రోజుకు ఒకటీ అరా కేసులే రావడంతో వైద్యఆరోగ్యశాఖ అధి కారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ గతవారంనుంచి పాజి టివ్‌లు రయ్‌ మంటూ పరుగులు తీస్తుండడంతో కలవరం మొదలైంది. ఈ వారంలోనే జిల్లాలో ఏకంగా 250 వరకు పాజిటివ్‌లు నిర్ధారణ అవ డంతో మహమ్మారి ముంచుకొస్తున్న సంకేతాలతో అధి కారులు ఉలిక్కిపడుతున్నారు. ఒక్క బుధవారం జిల్లా లో 41మందికి కొవిడ్‌ సోకింది. గురువారం ఈ సంఖ్య 45కి పెరిగింది. ఇందులో 35 కేసులు కాకినాడ నగరం లోనే గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్‌తో పో రాడుతూ 52ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమెకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉండడం, కొవిడ్‌ ముదిరిపోవ డంతో చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

టెస్ట్‌లు పెంచాల్సిందే..

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీవ్రతతో జిల్లా లో పాజిటివ్‌లు మళ్లీకట్టు తప్పుతాయేమోననే భయం అందరినీ వెన్నా డుతోంది. ముఖ్యంగా కాకినాడ నగరంలో ఇప్పుడు రోజుకు 35కిపైగా కొత్త బాధి తులు నమోదవుతుండడంతో పరిస్థితి చేయిదాటకుండా చూడాల్సిన అవసరం వైద్యఆరోగ్యశాఖపైనే ఉంది. వాస్తవానికి గతేడాది మేలో కూడా మొదట్లో కాకినాడలో రోజుకు పది ఆ తర్వాత పాతిక, ఆ తర్వాత వందల్లో పాజిటివ్‌లు పెరిగిపోయి నగరం మొత్తం వణికిపో యింది. మరణాలు సైతం ఇక్కడే ఎక్కువ సంభవించాయి. పైగా ఇప్పు డు మహమ్మారి పోయిందనే ధీమాతో జిల్లాలోను, ముఖ్యంగా కాకినాడ నగరంలో జనం మాస్క్‌లు ధరించడం లేదు. యథావిధిగా గుంపులుగా సంచరిస్తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి రెట్టింపయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యం లో శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పరిస్థితి వివరించాలని డీఎం అండ్‌ హెచ్‌వో భావిస్తున్నారు. కేసులు కట్టుతప్పకుండా ముందే వ్యాప్తిని నియంత్రించాలంటే టెస్ట్‌ల సంఖ్యను పెంచడానికి అనుమతివ్వాలని కోరనున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే రెండు కేంద్రాల్లో రోజుకు 120 వరకు టెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు కేసు లు పెరుగుతుండడంతో టెస్ట్‌ల కోసం వస్తున్న వారి సంఖ్య పెరు గుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో అన్ని పీహెచ్‌సీల్లోను టెస్ట్‌లు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ బారిన పడుతున్న వారిలో జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని, అనుమానం వస్తే తక్షణం టెస్ట్‌ చేయిం చుకోవాలని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

Updated Date - 2022-07-01T07:20:06+05:30 IST