కరోనా పైపైకి

ABN , First Publish Date - 2022-01-20T06:29:25+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

కరోనా పైపైకి
వన్‌టౌన్‌ వీధుల్లో రద్దీ

ఒక్కరోజే 332 మందికి వైరస్‌ 

కొవిడ్‌ ఆసుపత్రుల్లో యాక్టివ్‌ కేసులు 2,545 

హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారు లక్షల్లోనే.. 

విజయవాడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఒక్క వారంలోనే కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు రెట్లకు పైగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 326 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితోపాటే కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,545 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొత్తవాటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,425కు పెరిగాయి. ఇప్పటి వరకు 1,19,379 మంది వైరస్‌ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కొవిడ్‌ మరణాలు 1,482 వద్ద నిలకడగా ఉన్నాయి. జిల్లాలో థర్డ్‌వేవ్‌ ఉధృతి పెరుగుతుండటంతో వేలసంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. వీరిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకుంటున్నవారి వివరాలు మాత్రమే అధికారిక లెక్కల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం వైరస్‌ బారిన పడుతున్నవారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటంతో చాలామంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం లేదు. పరీక్షలు చేయించుకోకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ బాధితులు లక్షల్లోనే ఉంటారనేది అనధికారిక అంచనా. 


దుర్గగుడిలో ఆంక్షలు కట్టుదిట్టం 

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో దుర్గగుడి అధికారులు ఇంద్రకీలాద్రిపై కొవిడ్‌ ఆంక్షలను బుధవారం నుంచి మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. మాస్కులు లేకుండా దర్శనానికి వచ్చే భక్తులను అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆలయంలోని క్యూలైన్లను రోజుకు మూడుసార్లు హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రం చేస్తూ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి ఆలయంలో అంతరాలయ దర్శనాలను, శఠారిని పూర్తిగా రద్దు చేశారు. ప్రతిరోజూ జరిగే ఆర్జిత సేవలకు కూడా 50 శాతం మంది భక్తులనే అనుమతిస్తున్నారు. అన్నదానం, ఉచిత ప్రసాదాల పంపిణీని నిలిపివేశారు. థర్డ్‌వేవ్‌ ఉధృతితో ఆలయంలో కొంతమంది ఉద్యోగులు వైరస్‌ బారిన పడినప్పటికీ.. అందరూ క్షేమంగానే ఉన్నారని ఆలయవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-01-20T06:29:25+05:30 IST