ఎడాపెడా కేసులు

ABN , First Publish Date - 2021-05-10T07:02:59+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి తన ఉధృతిని కొనసాగిస్తోంది. ఎడాపెడా కేసులతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.. అంతకంతకూ కేసులు పెరిగిపోతుండడంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు.

ఎడాపెడా కేసులు

  • కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి
  • జిల్లాలో ఆదివారం 2,844 మందికి సోకిన వైరస్‌
  • మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,63,193
  • ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 9: కొవిడ్‌ మహమ్మారి తన ఉధృతిని కొనసాగిస్తోంది. ఎడాపెడా కేసులతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.. అంతకంతకూ కేసులు పెరిగిపోతుండడంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోవడంతో బాధితులు అల్లాడుతున్నారు. కాస్త ఆక్సిజన్‌ ఇచ్చి పుణ్యం కట్టుకోండని ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా మహమ్మారికి కనికరం లేకుండా ప్రజలను కాటేస్తూనే ఉంది. తాజాగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 2,844 మంది వైర స్‌ బారిన పడ్డారు. ఈ వారమంతా ఇదే స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిల్లో ఆక్సిజన్‌ బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. అందుబాటులో ఉన్న వందల ఆక్సిజన్‌ బెడ్లు గంటల్లో నిండిపోతున్నాయి. ఆదివారం నాటి కేసులతో మొత్తం జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 1,63,193కు చేరుకుంది. ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న యాక్టివ్‌ కేసులు 23,905గా నమోదయ్యాయి. మరోపక్క కొవిడ్‌ మరణాలు ఆదివారం జిల్లాలో 9 సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 771కు చేరింది. జిల్లాలో ఈ వారంలో 70 మరణాలు పెరిగాయి. మొత్తంగా జిల్లాలో 1,38,517 మంది కోలుకున్నారు. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌లు ఈ వారం రోజుల్లో నమోదయ్యాయి. రోజూ వందలాది మంది కొవిడ్‌ టెస్ట్‌ల కోసం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌ ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. బాధితుల సంఖ్య, లక్షణాలు ఉన్నవారు అంతకంతకూ పెరిగిపోతుండడంతో టెస్ట్‌ల కోసం పోటెత్తుతున్నారు. ఆదివారం మొత్తం పాజిటివ్‌ల్లో రాజమహేంద్రవరం అర్బన్‌లో 384, ఆ తర్వాతి స్థానంలో కాకినాడ అర్బన్‌లో 282 నమోదయ్యాయి. కోనసీమలో కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రోజూ వేలల్లో పొజిటివ్‌లు రావడం, అందులో వందలాది మంది ఆక్సిజన్‌ పడకల్లో చేరడంతో ఆక్సిజన్‌ వినియోగం భారీగా పెరిగింది. 

మండలాల వారీగా కేసుల వివరాలు... 

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 2,844 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మండలాల వారీ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్‌ 384, కాకినాడ అర్బన్‌ 282, అమలాపురం 173, ఉప్పలగుప్తం 140, రాజమహేంద్రవరం రూరల్‌ 108, గంగవరం 94, రాయవరం 88, కొత్తపల్లి 87, కాకినాడ రూరల్‌ 86, రాజానగరం 69, మండపేట 61, సామర్లకోట 54, రామచంద్రపురం 53, గొల్లప్రోలు 53, అల్లవరం 49, అయినవిల్లి 47, కొత్తపేట 46, కడియం 43, ఆలమూరు 41, పిఠాపురం 41, రావులపాలెం 39, కిర్లంపూడి 38, ఐ.పోలవరం 34, చింతూరు 33, రాజోలు 29, పి. గన్నవరం 28, అంబాజీపేట 27, తొండంగి 26, ముమ్మిడివరం 25, ఆత్రేయపురం 25, సఖినేటిపల్లి 24, మలికిపురం 24,  కోరుకొండ 24,  కాజులూరు 23, ప్రత్తిపాడు 23, బిక్కవోలు 23, అనపర్తి 21, రౌతులపూడి 17, శంఖవరం 15, దేవీపట్నం 14, కరప 13, కోటనందూరు 13, కూనవరం 12, కపిలేశ్వరపురం 10.


ఎంఎస్‌ఎన ఛారిటీస్‌ చైర్మన శివరామనాయకర్‌ మృతి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 9: కాకినాడ జగన్నాథపురంలోని ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ విద్యా సంస్థల చైర్మన్‌, వ్యవస్థాపక ధర్మకర్త మల్లాడి శివరామనాయకర్‌ ఆదివారం మృతి చెందారు. పది రోజులుగా కొవిడ్‌తో పోరాడి వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పార్ధివదేహాన్ని ఛారిటీస్‌ ప్రాంగణంలో కొంతసేపు సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు జరిపారు. నాయకులు బలగం ప్రసన్నకుమార్‌, పి.చంద్రమోహన్‌, ఛారిటీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సాయిబాబు, ధర్మకర్తలు పొన్నమండ విజయకుమార్‌, పుప్పాల నరసింహరావు, నలమాటి  సత్యాదేవి, మానే చంద్రకళ, సోమాదుల సునీత, దోని గంగారత్నం, కామవరపు సత్యదుర్గదేవి, రాయప్రోలు బాలవెంకట కృష్ణమూర్తి, పీసుపాటి సేతుమాధవరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.అమరేశ్వరరావు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.విజయకుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఎస్‌ సుబ్రహ్యణ్యం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాఽధ్యాయుడు ఒ.చిట్టిబాబు, జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు నివాళులర్పించారు. 


విద్యుత్‌ శాఖ కరప ఏఈ ప్రసాద్‌ మృతి

కరప, మే 9: కరోనా మహమ్మారికి విద్యుత్‌ శాఖ ఏఈ బలయ్యారు. కరప సబ్‌స్టేషన్‌ ఏఈగా పని చేస్తున్న కోడూరి వీరవెంకటప్రసాద్‌ (42)కు రెండు వారాల క్రితం వైరస్‌ సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్న తరుణంలో అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు కాకినాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కన్నుమూశారు. బంధువుల సమక్షంలో స్వగ్రామం పిఠాపురం మండలం కోలంకలో ఆదివారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. ఏఈ ప్రసాద్‌కు భార్య, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆయన మరణ వార్తతో కరప మండలంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రసాద్‌ మృతికి ఎంపీడీవో కర్రె స్వప్న, ఏవో ఎ.గాయత్రీదేవి, డిప్యూటీ తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ బాలాజీవెంకటరమణ, విద్యుత్‌ శాఖ సిబ్బంది సంతాపం తెలిపారు. 


అన్నదమ్ముల మృతి

మలికిపురం, మే 9: మండలంలోని గూడపల్లికి చెందిన సుందరవారి కుటుంబంలో విషాదం నెలకొంది. సుందర బ్రహ్మయ్య (దత్తుడు) (78), రామచంద్రరావు అన్నదమ్ములు. కొవిడ్‌ బారిన పడిన వీరిలో అన్నయ్య బ్రహ్మయ్య ఇంటి వద్ద, తమ్ముడు రామచంద్రరావు మలికిపురంలో చికిత్స పొందుతు న్నారు. ఆదివారం వీరిద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు. కాగా పది రోజుల క్రితం బ్రహ్మయ్య కుమారుడు శ్రీను, వారం క్రితం రామచంద్రరావు  భార్య, ఆయన అత్తగారు మృతి చెందారు. 

Updated Date - 2021-05-10T07:02:59+05:30 IST