వణికిస్తోంది!

ABN , First Publish Date - 2022-01-27T07:05:44+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వెయ్యికిపైగా పాజిటివ్‌లు నమోదవుతూ కలవరపెడుతున్నాయి.

వణికిస్తోంది!

 జిల్లాలో అంతకంతకూ ఎగబాకుతున్న కొవిడ్‌ కేసులు
 అత్యధికంగా వైరస్‌బారిన ఉపాధ్యాయులు, విద్యార్థులే
 పాఠశాలకు వెళ్లాలంటేనే మిగిలిన వారంతా బెంబేలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో కొవిడ్‌ కేసులు అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వెయ్యికిపైగా పాజిటివ్‌లు నమోదవుతూ కలవరపెడుతున్నాయి. ఈనెల 22 నాటికి మొత్తం కేసులు మూడు లక్షలు దాటగా, తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే మరో నాలుగు వేల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. దీంతో పెరిగిపోతున్న పాజిటివిటీ రేటుతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ బెంబేలెత్తుతోంది. ఇటీవల సంక్రాంతి పేరుతో రాకపోకలు పెరగడం, కోడిపందేలు, గుండాట, నృత్యాల్లో భారీగా ఎక్కడికక్కడ జనం పాల్గొనడంతో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని ఆశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈనేపథ్యంలో భారీగా పెరుగుతున్న అనుమానితులకు టెస్ట్‌ లు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయడానికి సెంటర్‌ ఏర్పాటుచేసినా పూర్తి స్థాయి పరికరాలు లేకపోవడం తో టెస్ట్‌ల కోసం జనం నరకయాతన పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో టెస్ట్‌లు చేయించుకున్నా ఫలితాలు రావడానికి రోజులు పడుతుండడంతో పాజిటివ్‌గా నిర్ధారించుకుని సొంతంగా మందులు మింగుతున్నా రు. మరోపక్క జిల్లాలో రోజువారీ కేసులు పెరుగుతుండగా, ఎక్కువగా పాఠశాలల్లోనే నమోదవుతుండ డం విద్యాశాఖకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా 25మందికిపైగా ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతుండడంతో వరుసగా ఒక్కో పాఠశాలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అటు విద్యార్థులు సైతం ఉపాధ్యాయులతో పోల్చితే మూడింతలు అధికంగా కొవిడ్‌కు గురవుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు కొన్ని వందల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌గా తేలడంతో పాఠశాలలకు వెళ్లాలంటేనే మిగిలినవారు ఆందోళన చెందుతున్నారు. కేసులు వేలల్లో పెరుగుతున్నా తెలంగాణ తరహాలో సెలవులు ప్రకటించకపోవడంతో వీరంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమ తోపాటు విద్యార్థుల ప్రాణాలతో సర్కారు ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బ్యాంకుల్లోను పాజిటివ్‌లు ఎగబాకుతున్నాయి. జిల్లావైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సైతం వరుసగా వైరస్‌ బారినపడుతున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో గౌరీశ్వరరావుకు పా జిటివ్‌ సోకడంతో హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈయన కొవిడ్‌ బారిన పడడం ఇది రెండోసారి. కాగా బుధవారం జిల్లాలో మరో 961 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో అత్యధికంగా కోనసీమ,కాకినాడ డివిజన్లలో ఉన్నారు. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,04,658కు చేరాయి. కొవిడ్‌తో కాకినాడ జీజీహెచ్‌లో మంగళవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరిద్దరి వయస్సు 70ఏళ్లకుపైనే. ఒకరిది రాజమహేంద్రవరంగా గుర్తించారు. అటు బుధవారం సైతం మరో ఇద్దరు కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో కొవిడ్‌ మరణాలు నాలుగు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 1,296కు చేరింది. ఇటీవల వరుసగా బాధితులు జీజీహెచ్‌కు, కొవిడ్‌కేర్‌ సెంటర్‌లకు పోటెత్తుతుండడంతో రద్దీ తగ్గించడానికి నియోజకవర్గ కేం ద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T07:05:44+05:30 IST