కొంచెం దిగులు పడక్కర్లే....!

Jun 22 2021 @ 00:29AM

కేసుల ఉధృతి కొంచెం తగ్గడంతో 

అందుబాటులోకి ఆక్సిజన్‌ పడకలు

మొన్నటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 

ఇవి దొరక్క బాధితుల నరకయాతన

అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు వచ్చి 

అక్కడికక్కడే అనేకమంది కన్నుమూత

జిల్లావ్యాప్తంగా ఖాళీగా 1,731 ఆక్సిజన్‌ బెడ్లు.. 

జీజీహెచ్‌లో 484 అందుబాటులో

జీజీహెచ్‌ మినహా అన్ని ఆసుపత్రుల్లో 

ఐసీయూ బెడ్లకు సగానికి తగ్గిన డిమాండ్‌ 

442 పడకలకుగాను ఖాళీగా 236 పడకలు

కేసులు తగ్గాయనే నెపంతో 

జేఎన్‌టీయూ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ మూసివేత

మరో వారంలో బొమ్మూరు, 

బోడసకుర్రు కేంద్రాలు కూడా మూతే


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌, ఐసీయూ పడకల లభ్యత క్రమేపీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ బెడ్లు దొరక్క వేలాది మంది కొవిడ్‌ బాధితులు నరకయాతన పడ్డారు. లక్షలు ఖర్చు చేద్దామన్నా ఎక్కడా ఏ పడకా దొరకని పరిస్థితి. అటు ఆక్సిజన్‌ బెడ్‌ల కోసం వందలాది మంది అంబులెన్స్‌ల్లో వచ్చి కాకినాడ జీజీ హెచ్‌ మొదలుకుని ప్రైవేటు ఆసుపత్రుల వరకు గంటల తరబడి వేచి చూసిన పరిస్థితి. అయినా ఇవేవీ ఖాళీ లేక వందలాది మంది కన్నుమూసిన హృదయవిదారకర సంఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. ఒకదశలో ఉన్నతస్థాయి పైరవీ చేయించుకున్న వారికి మినహా బెడ్‌ దొరకడం గగనంగా మారింది. అయితే గడచిన కొన్నిరోజుల నుంచి కేసుల ఉధృతి కొంచెం తగ్గడం, ఉన్న కేసుల్లోను ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తిన వారి సంఖ్య కూడా కొంతవరకు తగ్గడంతో ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల లభ్యత పెరిగింది.


జీజీహెచ్‌ మినహా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడ కలకు డిమాండ్‌ తగ్గడంతో బాధితులకు ఇప్పుడు వేగంగా బెడ్లు దొరుకుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 41 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి కలిపి 442 ఐసీయూ పడకలుంటే మొన్నటివరకు పది పడకలు ఖాళీగా ఉండడం అతికష్టంగా మారేది. కానీ సోమవారం నాటికి వీటన్నింటిలో కలిపి 236 బెడ్‌లు ఖాళీగా ఉన్నా యి. అయితే ఇందులో 90 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌లో మాత్రం ఇప్పటికీ ఒక్క ఐసీయూ బెడ్‌ కూడా ఖాళీగా లేదు. జీజీహెచ్‌లో 62, రాజమహేంద్రవరం డీహెచ్‌లో 53 బెడ్‌లు బాధితులతో నిండిపోయాయి. అటు ఆక్సిజన్‌ పడకలు జిల్లాలో మొత్తం 2,574కుగాను సోమవారం నాటికి 1,731 ఖాళీగా ఉన్నాయి. ఇందులో జీజీహెచ్‌లో 484, డీహెచ్‌లో 248 ఖాళీగా ఉన్నాయి. జీఎస్‌ఎల్‌లో 207, అమలాపురం కిమ్స్‌లో 121 అందుబాటులో ఉన్నాయి. కాగా జిల్లాలో సోమవారం 335 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఈ లెక్కను ఆధారంగా చేసుకుని జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య తగ్గాయనుకోవడం భ్రమే. ప్రతి సోమవారం కొవిడ్‌ బులిటెన్‌లో కేసులు తక్కువగా కనిపిస్తుండగా, మిగిలిన ఆరు రోజుల్లో మాత్రం వెయ్యి వరకు నిర్ధారణ అవుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్రం మొత్తం మీద ఒక్క మన జిల్లాను కర్ఫ్యూ సమయం సడలింపుల జాబితా నుంచి మినహాయించారు. మరోపక్క కేసుల సంఖ్య గతంలో వచ్చిన మూడు వేల స్థానంలో ఇప్పుడు వెయ్యి వరకు వస్తుండడం, క్వారంటైన్‌ అడ్మిషన్లు తగ్గడంతో జేఎన్‌టీయూలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను అధికారులు సోమవారం నుంచి మూసివేశారు. ఇక్కడ వెయ్యి వరకు పడకలు ఉండగా, మొన్నటివరకు నాలుగు వందలమంది వరకు పాజిటివ్‌ వచ్చిన వారు ఇక్కడ ఉండేవారు. మరో వారంలో బొమ్మూరు, బోడసకుర్రు సెంటర్లను ఎత్తివేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 


కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : కలెక్టర్‌ హెచ్చరిక

భానుగుడి (కాకినాడ), జూన్‌ 21: జిల్లాలో కొవిడ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉన్న కారణంగా జూన్‌ 30 తేదీ వరకూ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుం దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 51-60 ఐపీసీ సెక్షన్‌ 188, ఇతర వర్తింపు చట్టాల మేరకూ చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు 30వ తేదీ వరకూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పనిచేయాల్సి ఉంటుందన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.