తక్షణం నియంత్రించండి

ABN , First Publish Date - 2021-12-31T14:35:25+05:30 IST

రాష్ట్రంలో హఠాత్తుగా పెరిగిన కరోనా, ఒమైక్రాన్‌ కేసుల పట్ల కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

తక్షణం నియంత్రించండి

- కరోనాపై రాష్ట్రానికి కేంద్రం సూచన

- ఇక చెన్నైలోనే ఒమైక్రాన్‌ పరీక్షలు: మంత్రి సుబ్రమణ్యం

- ఇక బహిరంగ ప్రదేశాల్లోనూ కొవిడ్‌ పరీక్షలు: కమిషనర్‌

- మళ్లీ పైపైకి కరోనా కేసులు


చెన్నై: రాష్ట్రంలో హఠాత్తుగా పెరిగిన కరోనా, ఒమైక్రాన్‌ కేసుల పట్ల కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. కరోనాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అంతేగాక బాధితుల్ని ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక కోడంబాక్కం, అడయార్‌ తదితర నాలుగు మండలాల్లో ఒక్కసారిగా పెరిగిన కేసుల జాడలను కట్టడి చేయాలని సూచించారు. నిబంధనల్ని కఠినతరం చేయాలని, ఏమాత్రం ఉపేక్షించరాదని హెచ్చరించారు. 


నగరంలోనే పరీక్షలు: ఒమైక్రాన్‌ నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలను ఇక మీదట బెంగుళూరు, హైదరాబాద్‌, పూణేలకు పంపాల్సిన అవసరం లేకుండాపోయింది. నగరంలోనే ఒమైక్రాన్‌ పరీక్షలు చేసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని గురించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒమైక్రాన్‌ పరీక్షలను ఇకమీదట చెన్నైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. స్థానిక తేనాంపేటలోని డీఎంఎస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో రూ.4 కోట్ల వ్యయంతో అధునాతన పరికరాలను, యంత్రాలను అమర్చామన్నారు. ఒమైక్రాన్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఒమైక్రాన్‌ బాధితుల్లో ఏ మేరకు లక్షణలున్నాయన్నది కూడా ఇక్కడ నిర్ధారించవచ్చన్నారు. ఇలాంటి పరిశోధనా కేంద్రాలు ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. ఇకమీదట వెంటనే ఒమైక్రాన్‌ నిర్ధారణా ఫలితాలు వెల్లడవుతాయని, పరీక్షా ఫలితాల్లో జాప్యం వుండదని ఆశాభావం వ్యక్తం చేశారు. 


కేసులను జల్లెడ పడతాం: కమిషనర్‌

చెన్నైలో పెరుగుతున్న కరోనా కేసులను జల్లెడ పట్టేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు నగర కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా మసలుకోవాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, కరోనా లేదా ఒమైక్రాన్‌ బారిన పడడం ఖాయమని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు మసలుకోవాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించని వారికి స్పాట్‌ ఫైన్లు కూడా వేస్తామని హెచ్చరించారు. ఇక మీదట మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో రోజుకు 28 వేల పరీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి తరచుగా పరీక్షలు చేయించాలని యాజమాన్యాలకు సూచించారు. కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లలో కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నామన్నారు. విద్యార్థులు ఒకేచోట గుమిగూడి భోజనం చేయరాదన్నారు. ప్రజలు అనవసరంగా బయట ప్రాంతాల్లో సంచరించడాన్ని నియంత్రించుకోవాలని కమిషనర్‌ హితవు పలికారు. 


పెరుగుతున్న కరోనా కేసులు

ఏడు నెలలుగా రోజురోజుకు క్రమేణా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు రెండు రోజుల నుంచి హఠాత్తుగా పెరుగుతున్నాయి. రోజుకు వందకు పైగా కేసులు పెరుగుతుండడం పట్ల రాష్ట్ర ఆరోగ్యశాఖ తీవ్ర ఆందోళన చెందుతోంది. మంగళవారం 619గా వున్న కేసులు బుధవారానికి 739కి చేరాయి. ఇక గురువారం ఈ సంఖ్య 890కి చేరింది. మృతులు తక్కువమందే వున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.



Updated Date - 2021-12-31T14:35:25+05:30 IST