గుజరాత్‌లో కొవిడ్ నిబంధనలు గాలికి.. బీజేపీ నాయకురాలు ఆతిథ్యమిచ్చిన పెళ్లిలో వేలాదిమంది చిందులు!

ABN , First Publish Date - 2022-01-19T02:50:46+05:30 IST

దేశంలో చెలరేగిపోతున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

గుజరాత్‌లో కొవిడ్ నిబంధనలు గాలికి.. బీజేపీ నాయకురాలు ఆతిథ్యమిచ్చిన పెళ్లిలో వేలాదిమంది చిందులు!

గాంధీనగర్: దేశంలో చెలరేగిపోతున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో స్వయంగా అధికార బీజేపీ నేత నిర్వహించిన పెళ్లిలో ఏకంగా వేలాదిమంది పాల్గొని, డీజేకే అనుగుణంగా డ్యాన్స్‌లు వేస్తూ కొవిడ్ నిబంధనలను గంగలో కలిపేశారు. తాపి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. 


కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. వివాహ వేడుకకు 150 మందికి మించి హాజరు కావొద్దన్నది అందులో ఒకటి. అయితే, జిల్లాలోని డోల్వన్ బ్లాక్‌లో స్థానిక బీజేపీ నాయకురాలు, డోల్వన్ తహసీల్ ఉపాధ్యక్షురాలు సునంద కుటుంబ సభ్యులు నిర్వహించిన పెళ్లి వేడుకలో కొవిడ్ నిబంధనలు గాల్లో కలిసిపోయాయి. ఈ వేడుకకు తరలివచ్చిన  వేలాదిమంది స్థానికులు పట్టపగ్గాలు లేని ఆనందంతో డీజేకే అనుగుణంగా చిందులు వేశారు.  


వీడియో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుజరాత్‌ ప్రస్తుతం కొవిడ్ థర్డ్ వేవ్‌కు చేరుకుంది. సోమవారం రాష్ట్రంలో 12,753 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇంకా 70 వేల కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. 

Updated Date - 2022-01-19T02:50:46+05:30 IST