ప్రాణదాతల కన్నెర్ర

Published: Wed, 15 Sep 2021 01:06:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రాణదాతల కన్నెర్ర

ఐదు నెలలుగా వేతనాల్లేవు

మొర ఆలకించేవారూ లేరు

విధి నిర్వహణలో చనిపోయినా దిక్కులేదు

నయాపైసా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు

కాంట్రాక్ట్‌ వైద్యులను వాడుకుని వదిలేశారు

నేటి నుంచి నిరవధిక సమ్మెలోకి కొవిడ్‌ జనరల్‌ డ్యూటీ డాక్టర్లు


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): తమ ప్రాణాలను పణంగా పెట్టి, వేలాదిమంది ప్రాణాలను నిలబెట్టారు కొవిడ్‌ జనరల్‌ డ్యూటీ డాక్టర్లు. ఆ క్రమంలో కొందరు మృత్యువాత పడగా, ఎందరో తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయినా వారి సేవలకు గుర్తింపు లేదు. కాంట్రాక్టు పద్ధతిలో సేవలందించినవారికి అయిదు నెలలుగా వేతనాలూ లేవు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తూ, వైరస్‌బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సైతం ఇవ్వలేదు. వేలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఈ వెద్యుల గోడు వినే అధికారులే లేకుండా పోయారు. దీంతో ఆగ్రహించిన కొవిడ్‌ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌ మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు.


- డాక్టర్‌ రత్నకిషోర్‌, ఆయన భార్య ఇద్దరూ వైద్యులే. కొవిడ్‌ తొలి వేవ్‌ నుంచి వీరిద్దరూ కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. విజయవాడ సమీపంలోని గూడవల్లి కొవిడ్‌ కేర్‌ సెంటర్లో విధులు నిర్వర్తించేవారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డాక్టర్‌ రత్నకిషోర్‌ కరోనా బారినపడ్డారు. సుమారు 15 రోజులపాటు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరికి కరోనాతో పోరులో ఓడిపోయారు. రత్నకిషోర్‌ను దక్కించుకునేందుకు ఆయన భార్య సుమారు రూ.22 లక్షలు ఖర్చు పెట్టారు. భర్త చనిపోయిన సమయంలో ఆమె గర్భవతి. భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకుని ఆమె ప్రభుత్వ సాయం కోసం అధికారుల చుట్టూ తిరిగారు. కానీ ప్రయోజనం శూన్యం. ఐదు నెలలు గడుస్తున్నా.. డాక్టర్‌ రత్నకిషోర్‌ కుటుంబానికి నయాపైసా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేకపోయింది జిల్లా యంత్రాంగం.


కొవిడ్‌ బారిన పడినవారికి వైద్య సేవలు అందించేందుకు  ప్రభుత్వం పలువురు వైద్యులను కాంట్రాక్టు విధానంలో విధుల్లోకి తీసుకుంది. వీరు ఫస్ట్‌వేవ్‌లోనూ, రెండో వేవ్‌లోనూ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో జిల్లాలో సుమారు 300 మంది వైద్యులను జనరల్‌ డ్యూటీ డాక్టర్లుగా తీసుకున్నారు. మరో వెయ్యి మందికిపైగా పారా మెడికల్‌ సిబ్బందిని తీసుకున్నారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులకు వచ్చే పాజిటివ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సులు పూర్తి చేసినవారిని తాత్కాలిక ప్రాతిపదికన కొవిడ్‌ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. కలెక్టర్‌ అత్యవసర నోటిఫికేషన్‌ జారీ చేసి ఈ నియామకాలు చేపట్టారు. ఇదే పద్ధతిలో పారామెడికల్‌ సిబ్బందినీ తీసుకున్నారు. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లకు నెలకు రూ.70 వేలు వేతనం చెల్లిస్తామని చెప్పారు. కానీ సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ విధుల్లో చేరిన జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లకు, పారామెడికల్‌ సిబ్బందికి గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.


‘కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి పాజిటివ్‌ రోగులకు వైద్యసేవలందించాం. మాలో అనేక మంది కొవిడ్‌ బారినపడ్డారు. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయినా వెనకడుగు వేయలేదు. ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోయినా సొంత ఖర్చులతో అద్దె గదుల్లో ఉంటూ కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్నాం. మా ఇబ్బందులను అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అయినా పరిష్కరించలేదు.’ అని జనరల్‌ డ్యూటీ డాక్టర్లు వాపోతున్నారు. కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళదామంటే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని, అందుకే ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం అర్ధరాత్రి నుంచి మూకుమ్మడిగా విధులను బహిష్కరించి, నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్టు జనరల్‌ డ్యూటీ డాక్టర్లు తెలిపారు. జీతాల బకాయిలు మొత్తం చెల్లించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా మూడోవేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో తాత్కాలిక వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సమ్మెలోకి వెళితే ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో పాజిటివ్‌ రోగులకు అందించే వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వేతనాలివ్వకుండా పనిచేయమంటే ఎలా?

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో రిక్రూట్‌ చేసుకున్న కాంట్రాక్టు డాక్టర్లకు ఇంతవరకు జీతం చెల్లించలేదు. జిల్లాలో మొత్తం 300 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, పారామెడికల్‌ సిబ్బందితో కలిపి 1000 మందికి పైగా కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్నాం. ఎవరికీ వేతనాలు చెల్లించలేదు. నెలకు రూ.70 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో అలాగే చెల్లించారు. ఈ జిల్లాలో మాత్రం నెలకు రూ.54 వేల చొప్పున చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఆందోళనకు దిగితే ఎరియర్స్‌ రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఇవ్వలేదు. 11 నెలలుగా కొవిడ్‌ సేవలు అందిస్తున్న మాకు సర్వీస్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు. అక్టోబరు ఒకటో తేదీతో సెకండ్‌ వేవ్‌లో తీసుకున్న డ్యూటీ డాక్టర్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోతుంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని సాగనంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మా డిమాండ్లను సాధించుకునేందుకు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యాం.

- డాక్టర్‌ అంజని, విజయవాడ జీజీహెచ్‌


మా కుటుంబ సభ్యులను కోల్పోయాం

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో రోగుల దగ్గరకు వెళ్లడానికి సీనియర్‌ డాక్టర్లందరూ భయపడేవారు. మేమే పీపీఈ కిట్లు ధరించి ధైర్యంగా వార్డుల్లోకి వెళ్లి రోగులకు వైద్యసేవలందించి వారి ప్రాణాలను కాపాడాం. ఈ క్రమంలో మేం కూడా వైరస్‌ బారినపడ్డాం. మా ద్వారా కుటుంబ సభ్యులు పాజిటివ్‌ అయ్యారు. కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయాం. మాలో కొంతమంది డాక్టర్స్‌ కూడా చనిపోయారు. మా సేవలను గుర్తించకపోగా, ఐదు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మరో నెలలో మా కాంట్రాక్టు గడువు కూడా పూర్తవుతుంది. అప్పుడు మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోరు. అందుకే ఆందోళనకు దిగాల్సివచ్చింది.

- డాక్టర్‌ సమీర, జీజీహెచ్‌, విజయవాడ 


డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తాం 

ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తాం. సెకండ్‌ వేవ్‌లో మమ్మల్ని రిక్రూట్‌ చేసుకున్నారు. ఐదు నెలలు గడిచాయి. ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. అయినా కరోనా రోగులకు వైద్యసేవల పరంగా ఎలాంటి ఇబ్బంది కల్పించకూడదనే ఉద్దేశంతో మా ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నాం. జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా మొదటి దశలో పని చేసిన కాంట్రాక్టు డాక్టర్లకు ప్రభుత్వమే ఉచితంగా వసతి సౌకర్యం కల్పించింది. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తీసేశారు. కొవిడ్‌ పేషెంట్ల మధ్య విధులు నిర్వహించి.. సాయంత్రానికి ఇంటికి వెళ్లాల్సి రావడంతో మా ద్వారా కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకి అనేక ఇబ్బందులను అనుభవించాం. నెలకు రూ.70 వేలు జీతమని చెప్పి.. రూ.54 వేలే చెల్లించారు. ఆ ఎరియర్స్‌ ఒక్కొక్క డాక్టరుకు రూ.90 వేలు చొప్పున రావాల్సి ఉంది. ప్రభుత్వం జీతాలు, ఎరియర్స్‌, సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇచ్చేవరకు ఆందోళనను కొనసాగిస్తాం.  

- డాక్టర్‌ నిఖిల్‌, జీజీహెచ్‌, విజయవాడ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.