ఆకలి కేకలు.. వేతనాలు లేక కొవిడ్‌ వారియర్స్‌ విలవిల

ABN , First Publish Date - 2020-11-10T14:13:16+05:30 IST

కొవిడ్‌ వారియర్స్‌ విధులను బహిష్కరించి..

ఆకలి కేకలు.. వేతనాలు లేక కొవిడ్‌ వారియర్స్‌ విలవిల

జీతాలు చెల్లించాలంటూ రోడ్డెక్కి ఆందోళన

అయినా స్పందించని కాంట్రాక్టు సంస్థ, అధికారులు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కొవిడ్‌ వారియర్స్‌ విధులను బహిష్కరించి రోడ్డెక్కారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన ఆందోళనకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కష్టపడి పనిచేసినందుకు జీతాలు అడుగుతుంటే కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. 


జిల్లావ్యాప్తంగా ఐమాస్క్‌ బస్సుల్లో పనిచేస్తూ, కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ (స్వాబ్‌) సేకరిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్టు సంస్థ మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా జిల్లాలో ఐమాస్క్‌ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం ఉదయం విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆవరణలో నిలిపి ఉంచిన ఐమాస్క్‌ బస్సుల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ పరిస్థితులకు దారితీసిన పరిణామాలు ఇలా ఉన్నాయి. 


ప్రాణాంతక కరోనా విజృంభించిన తరుణంలో జూన్‌ నుంచి జిల్లావ్యాప్తంగా నిర్దేశిత ప్రాంతాల్లో ఐమాస్క్‌ బస్సుల ద్వారా కొవిడ్‌ అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించేందుకు వీరా హాస్పిటల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతో ప్రభుత్వం కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఆ సంస్థ యాజమాన్యం ఐమాస్క్‌ బస్సుల ద్వారా ప్రజల నుంచి శాంపిల్స్‌ను సేకరించేందుకు అన్ని అర్హతలూ ఉన్న స్థానిక నిరుద్యోగ యువతీ యువకులను తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ల్యాబ్‌ టెక్నీషియన్లుగా నియమించుకుంది. ఇలా జిల్లాలో దాదాపు 250 మందిని నెలకు రూ.22 వేలు చొప్పున వేతనం చెల్లించేలా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకుని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరంతా జూన్‌ నుంచి అధికారులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి కరోనా అనుమానితుల నుంచి ప్రతిరోజూ దాదాపు 3వేల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. వీరికి మూడు నెలలుగా ‘వీరా’ సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో విధులను బహిష్కరించారు. పది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నా సంస్థ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది అందరూ సోమవారం ఉదయం రైల్వేస్టేషన్‌ వద్ద నిలిపి ఉంచిన బస్సుల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 


గట్టిగా మాట్లాడితే తొలగిస్తున్నారు

ప్రతిరోజూ ఉదయం 7.30కి రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకుని, ఐమాస్క్‌ బస్సుల్లో వైద్యాధికారులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి కొవిడ్‌ శాంపిల్స్‌ సేకరిస్తున్నాం. వాటిని ల్యాబ్‌లకు పంపించి, ఇళ్లకు చేరుకునేసరికి అర్థరాత్రి అవుతోంది. కరోనా బాధితుల నుంచి శాంపిల్స్‌ సేకరించే క్రమంలో కొందరు వైరస్‌ బారినపడ్డారు. ఇంత కష్టపడుతున్నా మూడు నెలలుగా జీతాలు లేవు. మేం జీవించేదెలా? ‘వీరా’ ప్రతినిధులను అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. నిరసన వ్యక్తం చేస్తుంటే, కొత్తవారిని తెచ్చుకుంటామంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. 

 - బి.సాయి 


ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?

నేను బీటెక్‌ పూర్తి చేశాను. చెన్నైలో జాబ్‌ చేశాను. బయటకు వెళ్లే పరిస్థితులు లేక వీరా సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాను. ఇంకా ఎందరో ఉన్నత విద్యావంతులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగాల్లో చేరారు. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న మాకు జీతాలు చెల్లించని ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉందా? మాతోపాటే పని చేస్తున్న అబ్బాయి డ్యూటీకి వస్తుండగా యాక్సిడెంట్‌ అయ్యింది. చికిత్సకు రూ. 4 లక్షలు ఖర్చయింది. సంస్థ యాజమాన్యంగాని, ప్రతినిధులు గాని పట్టించుకోలేదు. కనీసం మాకు చెల్లించాల్సిన జీతాల సొమ్ములో నుంచైనా ఎంతో కొంత ఆ కుటుంబానికి సాయం చేయమని చెప్పినా స్పందించడంలేదు.         

- దుర్గాభవానీ 


ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి  

‘వీరా’ సంస్థలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్‌టెక్నీషియన్లకు జీతాల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాంట్రాక్టు సంస్థతో జీతాలు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. 

-ఎ.వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2020-11-10T14:13:16+05:30 IST