టార్గెట్‌ యూత్‌!!

ABN , First Publish Date - 2021-06-23T05:29:15+05:30 IST

యువత అంటేనే దేన్నైయినా ఎదుర్కొనే శక్తికి, రాళ్లనైనా అరాయించుకునే సామర్థ్యానికి ప్రతీకగా చెబుతారు. యవ్వనంలో ఆవయవాల పనితీరు, ఆరోగ్యం దీనికి ప్రధాన కారణం. అయితే అలాంటి యువతే ఈసారి కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోయారు. రెండో వేవ్‌లో వైరస్‌కు వారే టార్గెట్‌ అయ్యారు. యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ వైరస్‌ బారినపడినా వెంటనే కోలుకుంటారని వైద్యులు భావించినా, వారి అంచనాలు తారుమారయ్యాయి. కొవిడ్‌ నుంచి రెండు వారాలకే కోలుకోవాల్సిన వారు 20 రోజులకు కూడా కోలుకోకపోవటం గమనార్హం. మరోవైపు కొవిడ్‌ మృతుల్లోనూ ఎక్కువ మంది యువత ఉండటం రెండవ దశ తీవ్రతకు అద్దం పడుతోంది.

టార్గెట్‌ యూత్‌!!

యువతపై కరోనా ప్రభావం 

సెకండ్‌వేవ్‌ బాధితుల్లో వారే అధికం

మరణాలలోనూ ఎక్కువే...

వ్యాక్సినేషన్‌తో అరికట్టే అవకాశం

మరి, 18 ఏళ్ల పైబడిన వారికి టీకా ఎప్పుడో..?

యువత అంటేనే దేన్నైయినా ఎదుర్కొనే శక్తికి, రాళ్లనైనా అరాయించుకునే సామర్థ్యానికి ప్రతీకగా చెబుతారు. యవ్వనంలో ఆవయవాల పనితీరు, ఆరోగ్యం దీనికి ప్రధాన కారణం. అయితే అలాంటి యువతే ఈసారి కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోయారు. రెండో వేవ్‌లో వైరస్‌కు వారే టార్గెట్‌ అయ్యారు. యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ వైరస్‌ బారినపడినా వెంటనే కోలుకుంటారని వైద్యులు భావించినా, వారి అంచనాలు తారుమారయ్యాయి. కొవిడ్‌ నుంచి రెండు వారాలకే కోలుకోవాల్సిన వారు 20  రోజులకు కూడా కోలుకోకపోవటం గమనార్హం. మరోవైపు కొవిడ్‌ మృతుల్లోనూ ఎక్కువ మంది యువత ఉండటం రెండవ దశ తీవ్రతకు అద్దం పడుతోంది. 

నెల్లూరు(వైద్యం), జూన్‌ 22 : 

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా యువతపై పడింది. వైరస్‌ మొదటి దశలో 45 ఏళ్ల పైడిన వారిపై ఎక్కువగా ప్రభావం కనిపించింది. అదే రెండో దశకు వచ్చే సరికి 20 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారే లక్ష్యంగా వైరస్‌ విజృంభించింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఎక్కువ మంది యువతీ యువకులకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆ తర్వాత గూడూరు పట్టణంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు నెలల్లో 302 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిబంధనలు పాటించకపోవడమే ఈ పరిస్థితి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.  కర్ఫ్యూ అమలులో ఉన్నా బయట తిరగటం, మాస్క్‌లు, శానిటైజరు వాడక పోవటం వంటి వాటి వల్ల కూడా కరోనా కేసులు పెరిగాయని నిపుణులు అంటున్నారు.

రెండో వేవ్‌లో విజృంభణ

గత ఏడాది మార్చి 9వ తేదీన జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత మొదటి దశలో నమోదైన కేసుల్లో 60 శాతం మగవారు ఉండగా 40 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం బాధితుల్లో 85 శాతం మందికిపైగా 45 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. అప్పట్లోనూ నెల్లూరు నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.   గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 63,814 మంది కొవిడ్‌ బారినపడగా 587 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, రెండో వేవ్‌లో ఈ ఏడాది మార్చి నుంచి కరోనా తీవ్ర ప్రభావం చూపింది. దీనితో పాజిటివ్‌ల సంఖ్య, మరణాల రేటు కూడా పెరిగింది.  కేవలం 4 నెలల వ్యవధిలో 60,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సిన్‌ వేసి ఉంటే....

ఈ ఏడాది జనవరి 16 నుంచి జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ వేయటం ప్రారంభించారు. మొదట ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బందికి, ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు టీకా వేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నాల్గో విడత వ్యాక్సినేషన్‌లో 45 ఏళ్లపైబడిన టీకా వేశారు. అయితే 20 నుంచి 45 ఏళ్లలోపు వారికి సకాలంలో వ్యాక్సిన్‌ వేయకపోవటంతో ఎక్కువ మంది యువతను కోల్పోవాల్సి వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. యువతకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసి ఉంటే మరణాల సంఖ్య తగ్గి ఉండేదని అంటున్నారు. కాగా, 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తామని ప్రధాని మోదీ ప్రకటించినా అది ఎప్పుడు అమలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

యువతపై తీవ్ర ప్రభావం

- డాక్టర్‌ కృష్ణమూర్తి, జీజీహెచ్‌ వైద్యుడు

కరోనా రెండో దశ ప్రభావం ఎక్కువగా యువతపై పడింది. బాధితుల్లో వారే ఎక్కువగా ఉన్నారు. అనేక మంది కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవటం వల్ల కూడా కేసులు పెరిగినట్లు సమాచారం. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-06-23T05:29:15+05:30 IST