బస్సు నిండా భయం!

ABN , First Publish Date - 2021-04-22T09:53:38+05:30 IST

ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య దూరం తప్పనిసరిగా ఆరడగులుండాలి... సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒకటి ఖాళీ ఉం చాల్సిందే... సీఎం జగన్‌ కొవిడ్‌ సమీక్ష సందర్భం గా అధికారులకు ఇచ్చిన ఆదేశాలివి.

బస్సు నిండా భయం!

  • సీట్ల ఎడం లేదు.. శానిటైజర్లు లేవు.. నోటికి మాస్క్‌ ఉంటే చాలు రైట్‌ రైట్‌
  • ఫంక్షన్లు, థియేటర్లకే కొవిడ్‌ రూల్సా?.. ఆర్టీసీ ప్రయాణికులది ప్రాణం కాదా?
  • ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పని చేస్తేనే తొలిదశలో 109 మంది సిబ్బంది మృతి
  • భద్రతే లేని ప్రస్తుత స్థితిపై ఆందోళన.. బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య దూరం తప్పనిసరిగా ఆరడగులుండాలి... సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒకటి ఖాళీ ఉం చాల్సిందే... సీఎం జగన్‌ కొవిడ్‌ సమీక్ష సందర్భం గా అధికారులకు ఇచ్చిన ఆదేశాలివి. మనుషులు మరింతగా గుమిగూడే మరో చోటు ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల మధ్య ఎడంపై సర్కారు ప్రకటించలేదు. ఆర్టీసీ అధికారులూ స్పందించ డం లేదు. పైగా, బస్సులో సీట్ల మధ్య గ్యాప్‌ అవసరంలేదు... ప్రయాణికుడికి మాస్క్‌ ఉంటే చాలు బస్సు ఎక్కించండి... ఈపీకే(కిలో మీటరుకు ఆదాయం) మాత్రం తగ్గడానికి వీల్లేదు అంటూ సిబ్బందిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది ఈ అఽధికారులే కరోనా కట్టడికి గట్టి చర్య లు తీసుకొన్నారు. సీట్ల మధ్య గ్యాప్‌ ఇవ్వడమేగాక ఏకంగా బస్సుల్లో సీట్లు తొలగించి ప్రయాణికుల రక్షణకు పెద్దపీట వేశారు. అంతకుమించి వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాత్రం ప్రయాణికుడికి కరోనాతో సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అవసరానికైనా సామాన్య ప్రజానీకానికి ప్రజా రవాణా అత్యంత సదుపాయమైనది. అటువంటి సంస్థ.. ప్రయాణికుల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాపేక్షకే ప్రాధాన్యం ఇస్తుండటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 128 ఆర్టీసీ బస్‌ డిపోలు ఉండగా, 12వేల బస్సులు ప్రతి రోజూ 60లక్షల మంది ప్రజల ప్రయాణ అవసరాలు తీరుస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావంతో కొంత మేర ప్రయాణాల సంఖ్య తగ్గినా బస్సుల్లో మాత్రం మాస్క్‌ మినహా ఇతర ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. కొన్ని ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో శానిటైజర్లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా పల్లెవెలుగు, ఆర్డీనరీ సర్వీసుల్లో అసలు లేనేలేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే విషయం డ్రైవర్ల వద్ద ప్రస్తావిస్తే ‘‘మాస్కులు, శానిటైజర్లు మాకే ఇవ్వడంలేదు. మేమెక్కడి నుంచి ప్రయాణికుడికి ఇవ్వాలి? మాస్క్‌ లేకుంటే బస్టాండ్లో కొనుక్కొని బస్సెక్కాలని సూచిస్తున్నాం’ అని బదులిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడి సీటు వద్దకు టికెట్‌ కోసం వెళ్లే కండక్టర్లను అడిగితే... ‘అటువంటివి ఏవీ లేవు. మా అధికారులే మమ్మల్ని దగ్గరికి రానివ్వడంలేదు. ఈపీకే మాత్రమే అడుగుతారు’’ అని చెబుతున్నారు. 


50లక్షల బీమా ఏమయిందో?

ఏపీఎ్‌సఆర్టీసీలో 52వేల మంది పని చేస్తుండగా, అందులో ప్రయాణికులతో నిరంతరం మెలిగే డ్రైవర్లు, కండక్టర్లే 41వేల మంది ఉన్నారు. గత ఏడాది కొవిడ్‌ సందర్భంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పని చేసి 109 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. అప్పటి ఆర్టీసీ ఎండీ రాష్ట్ర కొవిడ్‌ అధికారిగా వ్యవహరించిన ఎం.టి. కృష్ణబాబు.. మృతులకు రూ.50లక్షల బీమా వస్తుందని చెప్పారు. ఆ తర్వాత కేంద్రానికి రాశామని చెప్పారు తప్ప రూపాయి వచ్చింది లేదు. సంస్థ సిబ్బందే ఒక రోజు వేతనాన్ని బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెల్లించారు. 


చాంబర్లలోకే వచ్చిందిగా!

విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో 100మందికి పైగా అధికారులు పని చేస్తుంటే, మంగళవారం నాటికి 46మందికి కొవిడ్‌ సోకింది. దీంతో ఎవరూ లోపలికి రావొద్దని ఇతర అధికారులు సైతం చాంబర్ల ముందు బోర్డులు పెట్టేశారు. అదే నిత్యం వేలాది మందితో ప్రయాణించే కండక్టర్లు, డ్రైవర్ల గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. గత ఏడాది 55ఏళ్లు దాటిన సిబ్బందికి ఆఫ్‌లైన్‌ డ్యూటీలు వేశారు. ఇప్పుడు అదీ కుదరదు అంటున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఎవరికైనా కరోనా సోకితే 14రోజులపాటు ఆన్‌ డ్యూటీ ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం సిక్‌ లీవులు పెట్టుకోవాలని అంటున్నారని.. ఆ లీవులు లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏసీలో కూర్చునే అధికారులకే సోకినప్పుడు మాకు రాదా... కొవిడ్‌ ఏమైనా ఎంపిక చేసుకుని వస్తుందా..ప్రాణాలు పోయినా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు.. మాకు ఏమన్నా అయితే భార్య, పిల్లల పరిస్థితి ఏంటని ఫీల్డ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్‌ సర్వీసులకు వెళ్లే సిబ్బంది తమ పరిస్థితి మరీ ప్రమాద కరంగా ఉందని, పగలంతా ప్రయాణికులతో తిరిగి రాత్రుల్లో శానిటైజ్‌ లేకుండా అదే బస్సులో సేద తీరితే ఎంత ప్రమాదకరమో చెప్పలేం అంటున్నారు. నైట్‌ సర్వీసులను సైతం రద్దు చేసేందుకు అధికారులు అంగీకరించడం లేదని, ఎవరి మెప్పు కోసమో మా ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఆర్టీసీ సిబ్బంది వాపోతున్నారు.

Updated Date - 2021-04-22T09:53:38+05:30 IST