ముంచుకొస్తున్న ముప్పు

ABN , First Publish Date - 2022-06-17T13:25:01+05:30 IST

రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురం,

ముంచుకొస్తున్న ముప్పు

- విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్త చర్యలు 

- మళ్లీ కరోనా బాధితుల ఇళ్లకు స్టిక్కర్లు 


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 16: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురం, కోయంబత్తూర్‌ సహా 24 జిల్లాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 15వ తేదీనాటికి రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు 22 మాత్రమే ఉండగా, గురువారానికి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనలు కఠినతరం చేసింది.


విమానాశ్రయంలో మాస్కు తప్పనిసరి...

స్థానిక మీనంబాక్కం విమానాశ్రయంలో కరోనా నియంత్రణ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది సూచిస్తున్నారు. 


అలాగే, విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానం ఉన్న వారి పాస్‌పోర్ట్‌ తదితర అధికారులు సేకరిస్తున్నారు. గతంలో ప్రయాణికులు నకిలీ మొబైల్‌ నెంబర్లు ఇవ్వడం, వారికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారు ఆచూకీని అధికారులు పట్టుకోలేకపోయారు. దీంతో, తాజాగా ప్రయాణికుల ఆధార్‌ కార్డు, అందులోని మొబైల్‌ నెంబర్లను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే, విమాన ప్రయాణం చేసే వారు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకొని ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. 


కొత్తగా ఆంక్షలకు అవకాశం లేదు: మంత్రి సుబ్రమణ్యం

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కరోనా ఆంక్షలను విధించే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో తాంబరంలోని టీబీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన వంద పడకలను సిద్ధం చేశారు. ఈ ఆస్పత్రిని గురువారం పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడు సహా కేరళ, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కరోపా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 400 కేసులు నమోదయ్యాయని, అందుకే సీఎం స్టాలిన్‌ ఆదేశం మేరకు కేసులు అధికంగా నమోదువుతున్న జిల్లాలకు వెళ్ళి సమీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గత మూడు, నాలుగు నెలలుగా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని, బుధవారం మాత్రం తంజావూరులో ఒకరు మరణించారని గుర్తుచేశారు. ఆ బాధితుడు ముందుగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని, అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో తంజావూరు ఆస్పత్రికి తరలించారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. అందువల్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారు తక్షణం సమీపంలోని ఆస్పత్రికి వెళ్ళి వైద్యులను సంప్రదించాలన్నారు. ముఖ్యంగా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో పడకలు 40 శాతానికిపైగా కరోనా బాధితులతో నిండినప్పుడే కొత్త ఆంక్షలు విధిస్తామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మంత్రి సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-17T13:25:01+05:30 IST