10,000 పడకలు

ABN , First Publish Date - 2020-07-06T06:51:10+05:30 IST

పదివేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 ఆస్పత్రిని భారత్‌ నిర్మించింది. 10 రోజుల రికార్డు స్థాయి సమయంలో ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌లో ఏర్పాటు...

10,000 పడకలు

  • ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్‌ ఆస్పత్రి
  • 10 రోజుల రికార్డు సమయంలో నిర్మాణం
  • దక్షిణ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ 
  • 20 ఫుట్‌బాల్‌ మైదానాలంత పెద్దది
  • ఢిల్లీలో వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి
  • 12 రోజుల్లో నిర్మించిన డీఆర్‌డీవో
  • అందులో 250 పడకలతో ఐసీయూ

న్యూఢిల్లీ, జూలై 5: పదివేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 ఆస్పత్రిని భారత్‌ నిర్మించింది. 10 రోజుల రికార్డు స్థాయి సమయంలో ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రికి.. ‘సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని నామకరణం చేశారు. ఇందులో ఐసోలేషన్‌, చికిత్స సదుపాయాలు ఉంటాయి. ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం దీన్ని ప్రారంభించారు. కరోనాకు కేంద్ర బిందువైన వూహాన్‌లో.. 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా నిర్మించ గా.. అంతే సమయంలో భారత్‌ 10వేల పడకల ఆ స్పత్రిని సిద్ధం చేయడం డ్రాగన్‌కు మింగుడు పడని అంశమే. అంతేకాదు.. ఢిల్లీలోనే 12 రోజుల్లో డీఆర్‌డీవో అధికారులు వెయ్యి పడకలతో కొవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. దీనికి తోడుగా.. కరోనా రోగులకు చికిత్సనందించేందుకు త్వరలో 500 రైల్వేకోచ్‌లతో 8 వేల పడకలు సిద్ధమవుతున్నాయి. 


ఐటీబీపీ ఘనత..

ఢిల్లీలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో.. కరోనా నియంత్రణ బాధ్యతలను కేంద్ర హోంమంత్రికి ప్రధాని అప్పగించారు. దీంతో.. కేంద్ర హోంశాఖ భారీ కసరత్తు ప్రారంభించింది. దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌ ప్రాం తంలో ఉన్న స్థలంలో 10వేల పడకలతో కొవిడ్‌-19 ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయించి, ఆ వెంటనే బాధ్యతలను ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)కి అప్పగించింది. అంతే.. పది రోజుల వ్యవధిలో ఐటీబీపీ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేసి, రికార్డు స్థాయి సమయంలో 10,200 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. దీనికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేశాయి. మొత్తం పడకలు, పరుపులను సమకూర్చాయి. 10ు పడకల వద్ద ఆక్సిజన్‌ పోర్టులను ఏర్పాటు చేశారు. ఐసీయూ, వెంటిలేటర్‌ విభాగాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి వేర్వేరు విభాగాల్లో పడకలు సిద్ధమయ్యాయి. వీటితోపాటు.. రోగుల కోసం 600 మరుగుదొడ్లను నిర్మించారు. 70 పోర్టబుల్‌ టాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు.


దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య బాధ్యతలు తీసుకుంటుంది. రోగులకు నిరంతర నీటి సరఫరాకు 1.7 లక్షల లీట ర్ల సామర్థ్యంతో ఒక అండర్‌గ్రౌండ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇంత భారీ ఆస్పత్రిని నిర్మించాక.. వైద్యులు, వైద్య సిబ్బంది ఎలా? దీనికీ కేంద్ర హోంశాఖే పరిష్కారమార్గాన్ని సూచించింది. ఐటీబీపీనే నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఆ విభాగంలో పనిచేస్తున్న 170 మంది వైద్య నిపుణులు, 700 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది వెంటనే విధుల్లోకి దిగారు. వీరంతా 2,000 పడకల బాధ్యతను తీసుకున్నారు. మిగతా పారామిలటరీ దళాలకు చెందిన వెయ్యి మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కూడా ఈ ఆస్పత్రిలో పనిచేస్తారు. 


వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి సిద్ధమైంది. దీన్ని రక్షణ సంస్థ డీఆర్‌డీవో 12 రోజుల్లో నిర్మించింది. ఇందులో 250 ఐసీయూ బెడ్‌లున్నాయి. ఈ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర హోంశాఖ, కేంద్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకరించాయి. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేని కొవిడ్‌ రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఈ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. సాయుధ బలగాలకు చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఈ ఆస్పత్రిని నిర్వహిస్తారని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణంలో టాటాల కృషి కూడా ఉందన్నారు. కాగా, ఢిల్లీలో వైర్‌సను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ‘కొవిడ్‌-19 వార్‌ రూం’ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయంలో ఏర్పాటయ్యే ఈ విభాగం సీనియర్‌ ఐఏఎస్‌ పర్యవేక్షణలో పనిచేస్తుంది. అలాగే, ఢిల్లీలో రైల్వే శాఖ సహకారంతో మరో 8వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ 500 కోచ్‌లను ఉపయోగించడం ద్వారా 8 వేల పడకలు సిద్ధం కానున్నట్టు భోగట్టా.




ఇవీ.. ఆస్పత్రి ప్రత్యేకతలు

  1. ఆస్పత్రిని పూర్తిగా ఉక్కు, కార్డుబోర్డ్‌తో నిర్మించారు
  2. నేలపై కార్పెట్లు పరిచారు. వాటిపై వినైల్‌ షీట్లను వేశారు. దీనివల్ల నేలను శానిటైజ్‌ చేయడం, శుభ్రపర్చడం సులభమవుతుంది
  3. ఆస్పత్రి పొడవు 1700 అడుగులు, వెడల్పు 700 అడుగులు. ఇది 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానం
  4. ఈ ఆస్పత్రిలో 200 ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. ప్రతి ఎన్‌క్లోజర్‌లో 50 పడకలుంటాయి. ప్రతి పడక వద్ద రోగుల కోసం ఒక స్టూల్‌, కుర్చీ, కబ్‌బోర్డు, చెత్తబుట్ట, టైలర్‌కిట్‌, ప్లేటు, గ్లాసు వంటివి అందుబాటులో ఉంటాయి
  5. ప్రతి పడక వద్ద సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ చార్జింగ్‌ పోర్టులు ఉన్నాయి. మ్యూజిక్‌ వినాలనుకునేవారు హెడ్‌ఫోన్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి
  6. రోగుల సౌకర్యార్థం ఒక గ్రంథాలయం, అమ్యూజ్‌మెంట్‌ విభాగాలున్నాయి. ఇక్కడ బోర్డ్‌ గేమ్‌లు, స్కిప్పింగ్‌ రోప్‌లు అందుబాటులో ఉన్నాయి
  7. 10శాతం పడకల వద్ద ఆక్సిజన్‌ సదుపాయం ఉంది
  8. లక్షణాలు లేని రోగులకు, లక్షణాలు ఉన్నవారికి వేర్వేరుగా చికిత్సలు చేస్తారు
  9. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి వేర్వేరుగా వసతి సదుపాయాలు ఉన్నాయి. కమాండింగ్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు
  10. వైద్య సిబ్బంది కోసం 400 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఈ-హాస్పిటల్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నా రు. రోగి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
  11. దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రి, మదన్‌ మోహన్‌ మాలవ్య ఆస్పత్రులకు ఈ దవాఖానా అనుబంధంగా పనిచేస్తుంది. రోగుల సౌకర్యార్థం కౌన్సెలర్లు, సైకియాట్రిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయి

Updated Date - 2020-07-06T06:51:10+05:30 IST