కొవిడ్‌తో భర్త మృతి.. విషయం తెలిసి భార్య కూడా...

ABN , First Publish Date - 2021-05-08T06:33:02+05:30 IST

కొవి డ్‌తో భర్త మరణించిన సమాచారం తెలిసి భార్య కూడా మృతిచెందిన సంఘటన సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో శుక్రవారం జరిగిం ది.

కొవిడ్‌తో భర్త మృతి.. విషయం తెలిసి భార్య కూడా...

సామర్లకోట, మే 7: కొవి డ్‌తో భర్త మరణించిన సమాచారం తెలిసి భార్య కూడా మృతిచెందిన సంఘటన సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో శుక్రవారం జరిగిం ది. గ్రామానికి చెందిన గంటా సత్యారావు (75), గంటా సత్యవతి (68) భార్యాభర్తలు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ కష్టపడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సత్యారావుకు జ్వరం రావడంతో కాకినాడ ఆసుపత్రికి వెళ్లగా కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించి ఆసుపత్రిలోనే చికిత్స నిర్వహించారు. అయితే అప్పటికే సత్యారావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలోనే సత్యారావు మృతిచెందాడు. ఆ సమాచారం గొంచాలలో ఇంటి వద్ద ఉన్న భార్య సత్యవతికి చేరవేయగా శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలి అక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కొవిడ్‌ నిబంధనలతో సత్యారావుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చినవారే సత్యవతి మృతదేహాన్ని కూడా తీసుకువెళ్లి ఇద్దరికీ ఒకేసారి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. 

కరోనాతో వలంటీర్‌ మృతి 

కిర్లంపూడి, మే 7: కరోనా వైరస్‌ బారిన పడి కిర్లంపూడిలో గ్రామ వలంటీర్‌ మృతిచెందింది. వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న రమణయ్యపేటకు చెందిన సేనాపతి అనిత కరోనాతో మృతిచెందడంతో జగ్గంపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తంచేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్లు మృతి

అమలాపురం రూరల్‌, మే 7: కరోనా బారినపడి తల్లీ కూతుళ్లు మృతిచెందిన సంఘటన అమలాపురం రూరల్‌ మండలం సమనసలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులిమే లక్ష్మి(80) కరోనాతో ఇంటివద్దే చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. కాగా ఆమె కుమార్తె మామిళ్లపల్లి బేబి (55) పది రోజుల కిందట కరోనా సోకడంతో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 3న మృతిచెందారు. ఐదు రోజుల వ్యవధిలో తల్లీకూతురు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక బేబీ కుమార్తెకు కరోనా సోకడంతో ఆమె బోడసకుర్రు క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నారు. పులిమే లక్ష్మి కుమారుడు, కోడలకు సైతం కరోనా సోకింది.

Updated Date - 2021-05-08T06:33:02+05:30 IST