షాంఘైలో కొవిడ్‌కు 39 మంది బలి

ABN , First Publish Date - 2022-04-25T12:41:04+05:30 IST

నాలుగు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్న చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కొవిడ్‌ ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లోనే అక్కడ 39 మంది కరోనాతో మృతిచెందగా.. 21,058 కొత్త కేసులు బయటపడ్డా

షాంఘైలో కొవిడ్‌కు 39 మంది బలి

కేసులు బయటపడ్డ ఇళ్ల చుట్టూ కంచెలు

బీజింగ్‌, ఏప్రిల్‌ 24 : నాలుగు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్న చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కొవిడ్‌ ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లోనే అక్కడ 39 మంది కరోనాతో మృతిచెందగా.. 21,058 కొత్త కేసులు బయటపడ్డాయి. మృతుల సగటు వయసు 81 సంవత్సరాలని స్థానిక అధికారులు ప్రకటించారు. కొవిడ్‌తో చనిపోయిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ఈనేపథ్యంలో అక్కడ కొవిడ్‌ కట్టడి చర్యలను మరింత కఠినం చేశారు. కేసులు బయటపడిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కాలనీల చుట్టూ లోహపు కంచెలు వేస్తున్నారు. 



దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కంచెలు వేయడాన్ని ఆపాలంటూ ఇళ్లలో నుంచి ప్రజలు కేకలు వేస్తున్న వీడియోలు.. కంచెలను కూల్చేసేందుకు కొందరు షాంఘైవాసులు యత్నిస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు వీటిని షేర్‌ చేస్తూ.. ‘ఇళ్లలో ఉన్న ప్రజల హక్కుల గురించి మీకు పట్టదా? బంధించడానికి మేమేమైనా పెంపుడు జంతువులమా ?’ అని ప్రశ్నిస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లోనూ హైఅలర్ట్‌  ప్రకటించారు. అక్కడ 22 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జిలిన్‌ ప్రావిన్స్‌లో 60, హీలోంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో 26 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.



Updated Date - 2022-04-25T12:41:04+05:30 IST