నిర్లక్ష్యమే కాటేస్తోంది

ABN , First Publish Date - 2021-04-14T05:27:33+05:30 IST

కరోనా మహమ్మారి మరింత బలపడి రెండోసారి పంజా విసురుతోంది.

నిర్లక్ష్యమే కాటేస్తోంది
స్వరాజ్య మైదానంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో మాస్క్‌లు లేకుండా, సందర్శకులు

జనంలో విచ్చలవిడితనం 

నగరంలో కరోనా హాట్‌స్పాట్లు 

కట్టడి చర్యలపై యంత్రాంగం ఉదాశీనత 


కరోనా మహమ్మారి మరింత బలపడి రెండోసారి పంజా విసురుతోంది. గత ఏడాది కంటే వైరస్‌ మరింత వేగంగా జిల్లాను చుట్టుముట్టేస్తోంది. అయినా ప్రాణాంతక వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ ముప్పు తీవ్రస్థాయిలో ముంచుకొస్తోందని వైద్యనిపుణులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, కరోనాను కట్టడి చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా జిల్లాలో కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతున్నాయి. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం 300 నుంచి 400 మధ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తుండటమే దీనికి నిదర్శనం. కొవిడ్‌ మరణాలూ నమోదవుతుండడంతో జిల్లా అంతటా అలజడి నెలకొంది. వైరస్‌ బారినపడి, ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంటున్నవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచాలు దొరకడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే రూ.లక్షల్లో దోచేస్తున్నారు. దీంతో బాధితుల ఆరోగ్యంతోపాటు ఆస్తులూ కరిగిపోతున్నాయి. వైరస్‌ బారిన పడినవారికి ఇచ్చేందుకు రెమ్‌డెసివర్‌ తదితర మందులు అందుబాటులో లేవంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కనీసం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలైనా చేస్తున్నారా? అంటే అదీలేదు. సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లకు వెళ్లి కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకునే ఆర్థిక స్థోమతు లేని నిరుపేదలు దేవుడిపైనే భారం వేసి కాలం గడుపుతున్నారు. మరోవైపు 45 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వాలు ఆదేశించడమే కాకుండా.. ఈనెల 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్‌’ చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునివ్వగా.. జిల్లాలో టీకా డోసులే లేకుండాపోవడం శోచనీయం. 


మరొకరి బలి 

కరోనా బారినపడి మంగళవారం విజయవాడలో ఓ పత్రికా విలేకరి మరణించారు. జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 261 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌  కేసుల సంఖ్య 53,396కు పెరిగింది. కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 692కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడిన బాధితుల్లో 49,828 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 2,876 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


కరోనా హాట్‌స్పాట్లు ఇవీ.. 

ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు ప్రజలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడా కట్టడి చర్యలు లేకపోవడంతో నగరంలోని అనేక ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, బస్సులు, ఆటోలు.. ఇలా ఎక్కడ చూసినా భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు అమలు కావడం లేదు. మాస్కులు లేకుండా బయటకు వస్తున్నవారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. వర్తక వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడ నగరంలో వ్యాపార కూడళ్లు నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌, గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌, బీసెంట్‌రోడ్డు, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌, రైతుబజార్లు తదితర వ్యాపార కూడళ్లు ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్లుగా మారాయి. పగలే కాదు.. రాత్రిపూట సినిమా థియేటర్లు, ఫుడ్‌కోర్టులకు, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు పిల్లాపాపలతో వస్తున్న జనం కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోందని, నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. 


కట్టడి చర్యలు ఏవీ? 

కరోనా కమ్మేస్తున్నా అధికారులు ఎలాంటి కట్టడి చర్యలు చేపట్టకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది మార్చి నెలలో కరోనా అలజడి మొదలైనప్పుడు ఎవరికైనా వైరస్‌ సోకినట్టు తెలిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బంది బాధితులను ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించేలా చూసేవారు. బాధితులతో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేవారు. మరోవైపు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో  వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేసుల తీవ్రతను బట్టి, కంటెయిన్‌మెంట్‌, రెడ్‌జోన్లను ప్రకటించి ప్రజల రాకపోకలను నియంత్రించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడమే లేదు. ప్రజలే జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలనే ధోరణితో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2021-04-14T05:27:33+05:30 IST