కరోనా విలయం

ABN , First Publish Date - 2021-04-16T06:45:49+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

కరోనా విలయం
మండుటెండలో ఐజీఎంసీ స్టేడియంలో కరోనా పరీక్షల కోసం నిరీక్షణ

24 గంటల్లో 396 మందికి వైరస్‌ 

చికిత్స పొందుతూ మరో బాధితుడు మృతి 

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పడకల కొరత 

కొవిడ్‌ టెస్టులకు మంగళం.. వ్యాక్సిన్‌ డోసులు లేవు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా మరో 396 మంది వైరస్‌ బారినపడ్డారు. గత మార్చి నెల మొదటి వారం నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత ఒకేరోజులో అత్యధికంగా నమోదైన పాజిటివ్‌ కేసులు ఇవే. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పాజిటివ్‌ బాధితుడు గురువారం మృత్యువాత పడ్డారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 53,927కు చేరాయి. మరణాల సంఖ్య 696కు పెరిగింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండగా.. వారందరికీ చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. 


పడకల కొరత

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం దశల వారీగా పడకలు పెంచుకుంటూ వస్తున్నా.. అవి కూడా వెంటనే నిండిపోతున్నాయి. ఈ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 250 పడకలు ఏర్పాటు చేశారు.అవి పది రోజుల క్రితమే నిండిపోయాయి. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ప్రతిరోజూ 50 నుంచి 100 మంది కరోనా బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. 

వీరిలో అత్యవసర చికిత్స అవసరమైన బాధితులను మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం 300 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా లక్షణాలతో వస్తున్న అనేక మంది బెడ్స్‌ ఖాళీ లేవని చెబుతుండటంతో వైద్యాధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రాణాలు పోతున్నా కనికరించరా? అంటూ వాపోతున్నారు. 


మళ్లీ మొదటికి!

గత ఏడాది మార్చిలో కరోనా అలజడి మొదలైన తర్వాత ఈ ఆసుపత్రిని ప్రభుత్వం స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌గా మార్చేడంతో ఆసుపత్రిలో ఉన్న 800కు పైగా బెడ్స్‌ను పూర్తిగా కరోనా బాధితులకే కేటాయించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుల కోసం కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో నాలుగు ఐసీయూలను ఏర్పాటు చేసి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలతో మెరుగైన చికిత్స అందించి ఎంతోమంది బాధితుల ప్రాణాలను కాపాడగలిగారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఒక బ్లాకులో మళ్లీ సాధారణ వైద్యసేవలను సేవలను ప్రారంభించారు. 

గత నెల నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాను కుదిపేస్తుండటంతో కొత్త ప్రభుత్వాసుపత్రికి కొవిడ్‌ బాధితులు మళ్లీ తండోపతండాలుగా తరలివస్తున్నారు. 

వారందరినీ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించే పరిస్థితులు లేకపోవడంతో వైద్యాధికారులు సీరియస్‌గా ఉన్న బాధితులను మాత్రమే అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. సీరియస్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేసి, మరో కొవిడ్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-16T06:45:49+05:30 IST