కోవిడ్ మూలాలు చైనా ల్యాబ్‌లోనే.. భారీ ఆధారం దొరికిందన్న ట్రంప్ పార్టీ

ABN , First Publish Date - 2021-08-03T10:50:25+05:30 IST

చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందనే వాదనలను అమెరికా మరింత బలంగా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలోని..

కోవిడ్ మూలాలు చైనా ల్యాబ్‌లోనే.. భారీ ఆధారం దొరికిందన్న ట్రంప్ పార్టీ

న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందనే వాదనలను అమెరికా మరింత బలంగా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ సోమవారం ఓ నివేదిక విడుదల చేసి మరీ తమ అనుమానాలను మరింత బలంగా వినిపించింది. కోవిడ్ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్ చైనాలోని ఓ రీసెర్చ్ ల్యాబ్‌లోనే తయారైందంటూ రిపబ్లికన్ పార్టీ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాది నుంచి ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగతా రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ దీనిపై రిపబ్లికన్ పార్టీ ఓ నివేదిక విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఈ నివేదిక ప్రకారం.. చైనాలోని చేపల మార్కెట్ నుంచి ఈ వైరస్ వచ్చిందనేది సత్యం కాదు. ఈ వైరస్ ముందు నుంచి అనుకుంటున్నట్లే వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకొచ్చింది. అది కూడా ఈ వైరస్‌ను ప్రపంచం గుర్తించిన డిసెంబర్ నాటికంటే కొన్ని నెలల ముందే సెప్టెంబర్‌లోనే ఇది బయటకొచ్చింది. దీనికి సంబంధించి తాజగా తమకు ఓ కచ్చితమైన ఆధారం కూడా లభించిందని తమ నివేదికలో రిపబ్లికన్లు పేర్కొన్నారు. 


రిపబ్లికన్ సభ్యుల ప్యానెల్ నివేదించిన ఈ నివేదికను విదేశీ విధాన కమిటీ అత్యున్నత నేత, టెక్సాస్ 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిథి అయిన మెక్ కౌల్ విడుదల చేశారు. కోవిడ్ మూలాలను కనుగొనేందుకు ద్వైపాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోవిడ్‌ మూలాలను కనుగొనేందుకు అమెరికా ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేకంగా ఇంటల్లిజెన్స్ వర్గాలను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెక్ కౌల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న అంశాలకు బైడెన్ విధానాలకు దగ్గరి పోలికలున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-03T10:50:25+05:30 IST