కొవిడ్‌ మృతుల కుటుంబాలతో ఆటలు..!

ABN , First Publish Date - 2021-12-04T06:51:10+05:30 IST

కొవిడ్‌తో మృతిచెందిన కుటుంబాలతో జిల్లా యంత్రాంగం, వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆటలు ఆడుతున్నారు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలతో ఆటలు..!

దరఖాస్తుల స్వీకరణ నెలరోజుల తర్వాత కొత్త నిబంధనలు

ఆస్పత్రిలో మృతిచెందితే ఫారం-4 ఇవ్వాలట..

బయట చనిపోతే ఫారం-4 ఏ సమర్పించాలని షరతు

వైద్యఆరోగ్యశాఖ అధికారుల వింత పోకడ  

ఆందోళనలో బాధిత కుటుంబ సభ్యులు 

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 3: కొవిడ్‌తో మృతిచెందిన కుటుంబాలతో జిల్లా యంత్రాంగం, వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆటలు ఆడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన నెలరోజుల తర్వాత తాజాగా కొత్త నిబంధనలు తెరపైకి తేవడంతో బాధిత కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్‌లో నెలరోజుల క్రితం కొవిడ్‌ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రత్యేక సెల్‌ నుంచి 3 వేల మంది ఖాళీ దరఖాస్తులు తీసుకెళ్లారు. ఇప్పటిదాకా 1950 మంది పూరించిన దరఖాస్తుఫారాలు సమర్పించారు. కొత్త నిబంధనలతో శనివారం నుంచి దరఖాస్తు చేసుకునేవారికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. దీంతో ఆయా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


కొత్త నిబంధనతో ఇక్కట్లు

ఎక్స్‌గ్రేషియా కోసం కొవిడ్‌తో మరణించిన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, ఐసీఎంఆర్‌ లేదంటే స్కానింగ్‌ రిపోర్టు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు జారీచేసిన మరణ ధృవీకరణ పత్రం, మృతిచెందిన వ్యక్తి, కుటుంబ సభ్యుడి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌తోపాటు కొవిడ్‌తో మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్‌తో ధృవీకరణపత్రాన్ని సమర్పించాలని ఇదివరకు నిర్ణయించారు.

కలెక్టరేట్‌లోని ప్రత్యేకసెల్‌లో శుక్రవారం దాకా పాతపద్ధతిలోనే దరఖాస్తులు  స్వీకరించారు. శనివారం నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే వారితో కొత్త ని బంధనల మేరకు ఆస్పత్రిలో కొవిడ్‌తో మరణించి ఉంటే ఫారం-4, ఇంటి వద్ద, మార్గమధ్యలో చనిపోయి ఉంటే ఫారం-4ఏలో స్థానిక డాక్టర్‌తో సంతకాలు పెట్టించి, తీసుకువస్తేనే స్వీకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డీఆర్వో గాయత్రీదేవిని కలిసి, కొత్త ఫారాలు సమర్పించాల్సిన విషయాలపై చర్చించారు. శనివారం నుంచి ప్రత్యేక సెల్‌కు వచ్చే బాధిత కుటుంబ సభ్యులు ఫారం-4, ఫారం-4ఏ తప్పనిసరిగా తీసుకువస్తేనే దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. అధికారులు కొత్త నిర్ణయంపై బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే తామంతా తమ కుటుంబ వ్యక్తి కొవిడ్‌తో మరణించినట్లు  డాక్టర్‌తో సంతకాలు చేయించుకు వచ్చామనీ, మళ్లీ కొత్త ప్రొఫార్మాలతో సంతకాలు చేయించుకు రా వాలంటే ఎలాగంటూ నిట్టూరుస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధిత కుటుంబ స భ్యులు కలెక్టరేట్‌కు వస్తున్నారు. తగిన సర్టిఫికెట్లు సేకరించేందుకు ఇప్పటికే నానాతంటాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో  మళ్లీ కొత్త ప్రొఫార్మాల్లో కొవిడ్‌ ధృవీకరణ  చేయించుకోవాలని చెప్పడం అన్యాయమంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పాత ప్రొఫార్మాలో దరఖాస్తులు సమర్పించిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని రి జెక్ట్‌ చేస్తారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే.. బాధిత కుటుంబాలకు కొవిడ్‌ సాయం అందకుండా పోతుంది. దీనిపై కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, తగు పరిష్కారం చూపాల్సి ఉంది. మరి ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.


Updated Date - 2021-12-04T06:51:10+05:30 IST