కొవిడ్‌ కల్లోలం.. జల విలయం!

ABN , First Publish Date - 2021-12-30T04:56:02+05:30 IST

ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తుండటంతో అభివృద్ధి కుంటుపడింది. జిల్లాకు తలమానికమైన ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా మారింది.

కొవిడ్‌ కల్లోలం..  జల విలయం!
కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతికి నిదర్శనమే ఈ చిత్రం. కరోనా నుంచి కోలుకోలేక ఎంతోమంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు బోడిగాడితోటలోని శ్మాశనవాటికలో ఒకరి చితి కాలుతుండగానే ఎన్నో మృతదేహాలు క్యూ కట్టాయి. దీంతో పెన్నా పరీవాహక ప్రాంతంలోనూ మృతదేహాలను ఖననం చేశారు.

ఈ ఏడాదీ అభివృద్ధి అంతా రివర్స్‌


ఏం మార్పు లేదు.. గడిచిన రెండేళ్లుగా నెలకొన్న పరిస్థితులే ఈ ఏడాదీ పునరావృతం అయ్యాయి. సంక్షేమం తప్ప అభివృద్ధి ఊసే కనిపించలేదు. జిల్లాలో ఏ రోడ్డు దుస్థితి చూసినా కడుపుమండుతోంది. గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకే దిక్కులేకపోతే ఈ ఏడాది సంభవించిన వరదలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.  ఇక ప్రధానమైన వ్యవసాయ రంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతేడాదైనా రైతులు పంట వేసి నష్టపోయారు. కానీ ఈ ఏడాది నీరిచ్చినా సాగు చేసేందుకు కర్షకులు ముందుకు రాలేదు. ఇక కీలకమైన ఇరిగేషన ప్రాజెక్టుల్లో కూడా పురోగతి కనిపించలేదు. రెండేళ్ల క్రితం టెండర్లు పూర్తయిన వర్కులు కూడా ఇప్పటికీ మొదలు కాకపోవడం అభివృద్ధి ఏ దిశగా పయనిస్తుందో అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేయగా ఇప్పటికి రెండన్నరేళ్లయినా అతీగతీ లేదు. ఈ ఏడాదైనా ఆ రెండు ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మరో‘సారి’ వాయిదా పడ్డాయి. ఇక పారిశ్రామిక రంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చెన్నై- బెంగళూరు, చెన్నై - విశాఖపట్నం ఇండసి్ట్రయల్‌ కారిడార్లలో పురోగతి కనిపించలేదు. ప్రతిష్టాత్మకమైన కేంద్ర రంగ సంస్థల ఏర్పాటులో కూడా జాప్యం కొనసాగుతూనే ఉంది. వీటన్నిటికితోడు కరోనా రెండోవేవ్‌ అన్నివర్గాల జీవితాలను మరింత చిన్నాభిన్నం చేసింది. మొత్తంగా 2021 సంవత్సరంలో జిల్లా అభివృద్ధి మరింత రివర్స్‌ అయ్యింది. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


కీలక ప్రాజెక్టుల్లో కనిపించని పురోగతి


ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తుండటంతో అభివృద్ధి కుంటుపడింది. జిల్లాకు తలమానికమైన ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా మారింది. రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచిన ఆల్తూరుపాడు, డీఆర్‌-డీఎం చానెల్‌, చినక్రాక డైవర్షన కెనాల్‌, మలిదేవి డ్రెయిన వంటి పనుల్లో పురోగతి కనిపించలేదు. ఒక్క సర్వేపల్లి కాలువ పనులు మాత్రం కొంతమేర జరిగాయి. ఇక బండేపల్లి - డేగపూడి  కాలువ పనుల్లో అడుగు ముందుకుపడలేదు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలకు శంకుస్థాపనలతో సరిపెట్టారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయంపై సందిగ్ధం తొలగలేదు. గతేడాది పాత కాంట్రాక్టరును రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా మరోసారి డీపీఆర్‌ తయారీకి సిద్ధమైంది. నిర్మాణాన్ని ఆలస్యం చేసేందుకు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన పులికాట్‌ ముఖద్వారం పూడికతీత ఊసే కనిపించలేదు. వ్యవసాయ రంగానికి కీలకంగా మారనున్న సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణాల పూర్తి మరోసారి వాయిదా పడింది. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు గాలిలో కలిసిపోయాయి.  తాజాగా సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభిస్తామని స్వయంగా సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికీ పనుల్లో వేగం కనిపించడం లేదు. నాయుడుపేట - పూతలపట్టు రహదారి విస్తరణకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. నెల్లూరులో అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం వీడలేదు. రూ.1100 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల పనులు గత ప్రభుత్వంలో 90 శాతం పూర్తయినా ఈ ప్రభుత్వం మిగిలిన పనులు చేయడం లేదు. అలానే మెట్ట ప్రాంత వాసుల కలైన నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణంలో కూడా పురోగతి లేదు. ఇవే కాదు.. సచివాలయాలు, అంగనవాడీ, మరికొన్ని ప్రభుత్వ భవనాలు, రోడ్లు వంటి వాటిని నిర్మించేందుకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. వీరికి బిల్లులు చెల్లించకపోవడమే కారణం. దీంతో ఏడాది కూడా ఒక్క అభివృద్ధి పని పూర్తి కాలేదు. 


పారిశ్రామిక తిరోగమనం


గతంలో పారిశ్రామికంగా పరుగులు తీసిన జిల్లా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోంది. కొత్త పరిశ్రమల రాక అటుంచితే ఉన్న పరిశ్రమల్లో కూడా ప్రగతి కనిపించడం లేదు. అధికారులేమో రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటనలు చేస్తున్నారే తప్ప అవెక్కడో చెప్పడం లేదు. చెన్నై - బెంగళూరు, చెన్నై - విశాఖపట్నం ఇండసి్ట్రయల్‌ కారిడార్లలో ఈ ఏడాది కూడా పురోగతి కనిపించలేదు. భూసేకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిథానీ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ  అడుగు ముందుకు పడలేదు. కేంద్ర ప్రాజెక్టులైన నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన టెక్నాలజీ (ఎనఐవోటీ), జాతీయ విద్యా, పరిశోధనా సంస్థ(ఎనసీఈఆర్‌టీ) ఏర్పాటులో కూడా పురోగతి  కనిపించలేదు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే పూర్తిస్థాయిలో ఆ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇది జరిగితే సుమారు వంద మందికిపైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఆర్భాటంగా ఇండసి్ట్రయల్‌ పార్కులను ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఫలితాలు కనిపించలేదు. మరోవైపు నిరుద్యోగ సమస్య నానాటికీ పెరుగుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన కష్టంగా మారింది. 


వ్యవసాయం దారుణం


గడిచిన రెండేళ్లుగా ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ రంగం పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతేడాది రబీలో వరదల కారణంగా మూడు సార్లు నార్లు పోసుకోవాల్సి వచ్చింది. దీంతో సాగు పెట్టుబడి అమాంతం పెరిగింది. అయితే ఆ స్థాయిలో దిగుబడి లేకపోవడం, వచ్చిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు అమ్ముకోవడం రైతాంగానికి కష్టంగా మారింది. వీటన్నింటి దృష్ట్యా ఈ ఏడాది ఖరీ్‌ఫలో సాగు చేసేందుకు రైతాంగం ముందుకు రాలేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుండడంతో 5 లక్షల ఎకరాలకు నీటి కేటాయింపులు జరిపగా కేవలం 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. దీని మూలంగా రూ.వేల కోట్ల రాష్ట్ర ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయింది రైతాంగం పరిస్థితి. నవంబరులో రబీకు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు, వరదలు రైతులను ముంచాయి. చాలా చోట్ల పంట మునిగిపోవడంతో రెండోసారి నార్లు పోసుకోవాల్సి వచ్చింది. నవంబరులో సంభవించిన భారీ వరదల కారణంగా ఆక్వా రైతులకు దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఈ వరదలు వచ్చి నెల రోజులు దాటినా ఇంత వరకు బాధితులకు ఉపశమనం లభించలేదు. 


ముందు కరోనా తర్వాత వరదలు


ఈ ఏడాది రెండు విపత్తులు జిల్లా ప్రజలను అతలాకుతలం చేశాయి. గతేడాది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారి ఈ ఏడాది కూడా మరోసారి పంజా విసిరింది. ఏప్రిల్‌ వరకు తగ్గుముఖం పట్టిన కరోనా ఆ తర్వాత రెండో వేవ్‌ మొదలైంది. ఇది సృస్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. గతేడాది చివరి వరకు జిల్లాలో 63,600 పాజిటివ్‌లు నమోదు కాగా 502 మంది మరణించారు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు 83,505 కరోనా కేసులు నమోదవగా 555 మంది మరణించారు. ఈ సంఖ్యను బట్టే అర్థం చేసుకోవచ్చు కరోనా సృష్టించిన విళయం ఏ స్థాయిలో ఉందన్నది. రెండో వేవ్‌లో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే మరణించడం కలచివేసిన విషయం. అయితే దీని నుంచి కోలుకున్న జిల్లా వరుసగా రెండో ఏడాది సంభవించిన భారీ వర్షాలు, వరదలకు మరోమారు అతలాకుతలమైంది. పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చడంతో 13 మండలాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు నగరం పరిస్థితి మరీ దారుణం. జనార్ధనరెడ్డి కాలనీ, ఇస్లాంపేట, భగతసింగ్‌ కాలనీ ప్రాంతాలతో పాటు కోవూరు పట్టణం కొన్ని రోజుల పాటు నీట మునిగింది. గతేడాది వదరల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడంతో ఈ ఏడాది నెల్లూరు నగరం మరోమారు నీట మునిగింది. భారీ వరదలకు సోమశిల భద్రతపై ఆందోళనలు ఏర్పడ్డాయి. గతేడాది ఆఫ్రాన పూర్తిగా దెబ్బతినడంతో ఈ ఏడాది వరదలప్పుడు అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వరదల కారణంగా దాదాపు రూ.1100 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందాలకు నివేదించారు. 



Updated Date - 2021-12-30T04:56:02+05:30 IST