వీడని జంకు!

ABN , First Publish Date - 2021-10-09T05:30:00+05:30 IST

కరోనా కాలం నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతోంది.

వీడని జంకు!

కరోనా కల్లోలం నుంచి తేరుకోలేక!

ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితికి జనజీవనం 

కరోనా కేసులు కాస్త తగ్గుముఖం..

అయినా గత అనుభవాలతో చాలామందిలో వీడని భయం

నలుగురితో కలవడంలో వెనుకబాటు 

ఆత్మీయులను కోల్పోయామనే భాధ

ఆదాయంలోనూ హెచ్చుతగ్గులు..

ఇవన్నీ కలిపి మానవ సంబంధాలపై ప్రభావం

ఇవి క్యాబిన్‌ ఫీవర్‌ లక్షణాలంటున్న వైద్య నిపుణులు


 

 మళ్లీ సాధారణ జీవితాన్ని మొదలుపెట్టాలంటే చాలా కష్టంగా ఉంది..! దాదాపు రెండేళ్లు కట్టిపడేసినట్లున్న స్థితి నుంచి రెక్కలు విప్పుకొని ఎగరాలంటే కాస్త సంకోచంగా ఉంది... చుట్టూ ఉన్న చాలామందిది ఇదే పరిస్థితి.. ఎన్నడూ చూడని లాక్‌డౌన్‌ అనుభవంలోకి వచ్చింది. కాలాన్ని ఒక్కసారిగా పట్టి ఆపినట్లు అయింది.. కాలు కదపకుండా ఇంటిలోనే కూర్చునే పరిస్థితి తలెత్తింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని భయంభయంగా   రోజులు గడిపాం... మళ్లీ మునుపటిలా సాధారణ జీవితం గడపాలంటే కొంచెం ఆందోళనగా.. కాస్త బద్ధకంగా.. కొంచెం గజబిజిగా కూడా ఉందని చాలామంది అంటున్నారు.


గుంటూరు, అక్టోబరు 9: కరోనా కాలం నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో విచారం, ఐసోలేషన్‌,  ఆత్మీయులను కోల్పోయామనే భావన, ఉద్యోగం, ఉపాధిలో ఆదాయాన్ని కోల్పోవడం, సమాజంలో భౌతిక దూరం పెరగడం వంటివి.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయని డాక్టర్లు అంటున్నారు. ఈ కారణంగా మనుషుల ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. ఎవరినైనా కలవాలంటే అనాసక్తిగా అనిపించడం, సమూహంలోకి వెళ్లడానికి సంకోచించడం వంటివి చేస్తున్నారు. దీంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా అర్బన్‌, రూరల్‌లో ఈ తేడాలు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఉండి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడిన వారిలో ఇంకా ఆ భయం పోలేదు. ఈ మధ్య కాలంలో గుంటూరులో స్థిరపడిన ఓ వ్యక్తి తప్పనిసరి అయి తన సొంత ఊరిలో బంధువుల ఇంటికి వెళుతూ వెంట భోజనం క్యారేజీ తీసుకు వెళ్లాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కానీ పల్లెల్లో ఆ పరిస్థితి లేదు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండి, మరణాలు చోటు చేసుకున్న సమయంలో కాస్త భయపడినా.. ఆ తర్వాత అంతా మరిచిపోయారు. ప్రస్తుతం ఏం జరగనట్టే సాధారణ జీవనం గడుపుతున్నారు. వారిలో ఉన్న మానసిక స్థైర్యమే, బంధాలరే ఇచ్చే విలువ  ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 


నిజంగా భయపడాలా...?

 కొవిడ్‌ మొదటి దశ ఎక్కువ సమయం తీసుకున్నా.. మరణాలు తక్కువే ఉన్నాయి.. రెండోదశ మాత్రం వేగంగా వచ్చి చాలామంది ప్రాణాలను హరించివేసింది. చాలామంది తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కోల్పోయారు. దీంతో పిల్లలను బడికి పంపాలంటే భయం.. పంపకుంటే చదువుకు దూరమవుతారేమోననే భయం.. వేడుకలకు వెళ్లాలంటే భయం.. వెళ్లకుంటే ఆప్తులు దూరమవుతారేమోనని భయం ఇంటికి ఎవరైనా వస్తే భయం.. ఎవరింటికైనా వెళ్లాలంటే భయం.. సినిమాకు, షాపింగ్‌కు వెళ్లాలన్నా అంతే.. ఈ భయాలు ఇంకా చాలామందిని వెంటాడుతున్నాయి. మూడో దశ ఉంటుందనే హెచ్చరికలు.. గతం మిగిల్చిన విషాదం.. ఇందుకు కారణం.  గత అనుభవాలతో కరోనా అంటే భయం ఉండాలి కానీ.. అతి భయం, ఆందోళన వద్దని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే పలు సమస్యలకు దారి తీస్తుందంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే మళ్లీ సాధారణ జీవితం మొదలు పెట్టాలని సూచిస్తున్నారు.  

 

పోస్ట్‌ హాలిడే సిండ్రోమ్‌..

వారాంతంలో ఎంజాయ్‌ చేసి.. తిరిగి ఆఫీసుకు వెళ్లాలంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. దీనినే పోస్ట్‌ హాలిడే సిండ్రోమ్‌ అంటారు. విద్యార్థులదీ అదే పరిస్థితి.. సెలవుల అనంతరం బడికి వెళ్లాలన్నా అడుగులు త్వరగా ముందుకు పడవు. ఒక్కరోజు సెలవు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంటే.. మరి దాదాపు ఏడాది పైగా కాలం ఇంటో కాలు కదపకుండా ఉండి.. ఒక్కసారిగా బయటకు రావాలన్నా కొంచెం ఇబ్బందే..? ముఖ్యంగా ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇళ్ల నుంచే పనిచేసే అవకాశం కల్పించాయి. చాలామంది తమ ఇంటికి వచ్చి అక్కడ నుంచే ఉద్యోగాలు చేశారు. కరోనా గాడిన పడిన తర్వాత ఆయా కంపెనీలు చిన్నగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని సూచిస్తున్నాయి. ఈ సమయంలో పలువురు తిరిగి వెళ్లాలంటే బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారిని పంపాలంటే ఆలోచిస్తున్నారు. 


 కట్టిపడవేస్తే.. అంతే

 పులి లాంటి జంతువు కూడా గొలుసులతో కట్టేసి కొంతకాలం ఉంచితే.. దాని శక్తిని కోల్పోతుంది. తర్వాత ఆ గొలుసు విప్పినా కదలలేని స్థితి చేరుకుంటుంది. మనమూ అంతే... ఇంతకాలం ఇంటికే పరిమితం అయ్యాం.. నలువురినీ కలవలేదు.. కేవలం ఫోన్లలోనే పలకరింపులు.. షాపింగ్‌లు లేవు.. సినిమాలు లేవు... కొవిడ్‌ పరిస్థితులు సర్దుకుంటున్నాయి. మళ్లీ జీవనం గాడిన పడాలంటే.. బంధనాలను తీసుకుని బయటకు రావాలంటే ఇబ్బంది సహజమే..! 

    

  

క్యాబిన్‌ ఫీవర్‌ అంటే...

ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం.. సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం.. ఎక్కువగా ఒంటరిగా ఉండడం వల్ల  క్యాబిన్‌ ఫీవర్‌ అనే లక్షణాల బారిన పడతారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారిలో గతంలో ఇటువంటి లక్షణాలను గుర్తించారు. మూసివేసిన గదులలో పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ తర్వాత కూడా ఇవే లక్షణాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి. అలసటగా అనిపించడం, ఎవరినీ కలవాలనే ఉత్సాహం లేకపోవడం, ఏదైనా ఘటన జరిగితే తక్కువగా స్పందించడం.. ఇవన్నీ లాక్‌డౌన్‌ తర్వాత వెలుగు చూస్తున్నాయి. ఇవి మరీ ఎక్కువగా ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.


కుటుంబ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం

కరోనా అధిక సంఖ్యలో కుటుంబాల ఆదాయంపైనా తీవ్ర ప్రభావం చూపింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఉన్నతవర్గాలపై ఎటువంటి ఆర్థిక ప్రభావం లేదు. దీంతో అంతరాలు పెరిగిపోయాయి. ఇవి కూడా మానవ సంబంధాలపై ప్రభావాన్ని చూపాయి. డబ్బు విలువ చాలామందికి తెలిసి వచ్చింది. త్వరగా అప్పులు పుట్టడం లేదు.. బంధువుల్లోనే ఇటువంటి సంఘటనలు ఎదురవడం మార్పునకు కారణమవుతోంది. 

 

కరోనా భయంతో.. 

 కరోనా భయంతో 15 నెలల పాటు ఇల్లు దాటని ఓ కుటుంబాన్ని గత జూలైలో తూర్పుగోదావరి జిల్లా రాజోలులో గుర్తించారు. వలంటీరు గ్రామ పెద్దల సహకారంతో వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. వారి మానసిక పరిస్థితిలో కూడా తేడాను గుర్తించారు. వైరస్‌ బారిన పడతామనే భయం.. అయిన వారిని కోల్పోతామనే ఆందోళన..  మానసిక కుంగుబాటు.. వంటివి ఇలాగే చాలామందిపై ప్రభావం చూపాయి.

  

జాగ్రత్తలు తీసుకుంటూనే.. 

కరోనా మనమధ్య నుంచి ఇంకా దూరమవలేదు.. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి.. మూడో వేవ్‌పై స్పష్టత లేకపోయినా నిపుణులు జాగ్రత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ సాధారణ జీవితానికి అలవాటు కావలసి ఉంది. భయం.. జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక జీవితాన్ని పునఃప్రారంభించాలి. 



ఎలా అధిగమించాలి..

ఆందోళన తగ్గాలంటే పాజిటివ్‌ థింకింగ్‌ అలవరుచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తొలుత మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటున్నారు. వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం, ఏదో పని చేస్తూ బిజీగా ఉండడం, సంగీతం వినడం, వంటి వాటిద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా గత చేదు జ్ఞాపకాలను తుడిచి వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. దూరంగా వారిని కనీసం ఫోన్‌లో అయినా పలకరించాలి. కరోనా మన ఒక్కరికే ఎదురైన అనుభవం కాదు..  ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఇదే ఎదురైందనే విషయాన్ని మరువ కూడదు. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ముందడుగు వేయాలి..!

Updated Date - 2021-10-09T05:30:00+05:30 IST